ఈ సాంకేతిక యుగంలో ప్రజలకు విశ్వసనీయమైన, సత్వర సేవలు అందించాలంటే- స్థానిక సంస్థల డిజిటలీకరణ అత్యంత ఆవశ్యకం. పంచాయతీరాజ్ వ్యవస్థలో సాంకేతికత వినియోగం... స్వరాజ్య భావనను, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందిస్తుంది. విధాన రూపకల్పనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం, సమాచార సౌలభ్యాన్ని అందించాలనే ధ్యేయంతో భారత ప్రభుత్వం జాతీయ ఎలక్ట్రానిక్ పరిపాలన ప్రణాళికను 2006 మే 18న చేపట్టింది. ఇ-పాలన ద్వారా పౌరులకు సర్కారీ సేవలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందించి- ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తూ, ప్రజలకు సౌలభ్యాన్ని పెంచారు.
సామాజిక, ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా...
పంచాయతీల్లో ఎలెక్ట్రానిక్ పరిపాలనను బలోపేతం చేసేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ 'ఇ-పంచాయతీ మిషన్ మోడ్' ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 2011-12 సంవత్సరంలో పంచాయతీ ఎంటర్‌ప్రైజెస్ సూట్(పీఈఎస్)ను 11 అప్లికేషన్లతో ప్రారంభించారు. డిజిటల్ ఆధారిత, సమాచార సమాజాన్ని నిర్మించడానికి, జాతీయ ఇ-పరిపాలనా ప్రణాళికను భారీస్థాయిలో ఆవిష్కరించడానికి 2015 జులై ఒకటో తేదీన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమ నిర్మాణానికి బ్రాడ్‌బ్యాండ్ హైవే ప్రథమ స్తంభం వంటిది. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించేందుకు వెయ్యి కోట్ల రూపాయల మూలధనంతో భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా తక్కువ ధరలకు గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ డిజిటల్ సేవలు అందించడం, గ్రామాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించాలన్నది లక్ష్యం.
దేశవ్యాప్తంగా 2014కు ముందు 100లోపు పంచాయతీలు మాత్రమే ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానమయ్యాయి. ప్రస్తుతం 1.25 లక్షల పైచిలుకు గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లో 2.5 లక్షలకు పైగా సాధారణ సేవా కేంద్రా(సీఎస్‌సీ)లను ఏర్పాటు చేసి, పలు పౌర సేవలను అందించడం దీని ఉద్దేశం. అంతర్జాల సేవలను అందించేందుకు ప్రతి గ్రామానికీ ఒకటి చొప్పున వైఫై హాట్ స్పాట్, సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థలకు ఒక వైఫైని, ఒక ‘ఫైబర్ టు ది హెూమ్ (ఎఫ్‌టీటీహెచ్) కనెక్షన్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ పథకం ద్వారా అన్ని గ్రామ పంచాయతీలను 100 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ హైవేతో అనుసంధానించి, డిజిటల్ గ్రామాలుగా మార్చి, సమ్మిళిత సామాజిక, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తారు.
ఇ-గ్రామ స్వరాజ్..
గ్రామ పంచాయతీల్ల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి 2018లో ఎలెక్ట్రానిక్-ఆర్థిక నిర్వహణ వ్యవస్థను ప్రారంభించారు. కానీ ఇప్పటికే 11 అప్లికేషన్లు అమలులో ఉండటంవల్ల గందరగోళం నెలకొంది. దీన్ని నివారించడానికి ఇ-గ్రామ స్వరాజ్ అనే ఏకీకృత పోర్టల్‌ను 2020 ఏప్రిల్ 24న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామ పంచాయతీల సమాచారం, ప్రణాళిక, పనుల భౌతిక పురోగతి, ఆర్థిక పురోగతి, ఆస్తుల నిర్వహణ, ప్రణాళిక, జియోట్యాగింగ్, ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ అనే ఎనిమిది అంశాలతో ఇ-గ్రామ స్వరాజ్ నిర్మితమై ఉంది. వికేంద్రీకృత ప్రణాళిక, రిపోర్టింగ్‌లో పురోగతి, పని ఆధారిత అకౌంటింగ్‌లో మెరుగైన పారదర్శకతను తీసుకురావడమే ఇ-గ్రామ స్వరాజ్ లక్ష్యం. పంచాయతీల పూర్తి వివరాలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ద్వారా చేపట్టిన కార్యకలాపాలు, ఇతర మంత్రిత్వ శాఖల నుంచి తీసుకున్న సమాచారం ఇందులో ఉంటాయి. జనాభా లెక్కలు, సామాజిక, ఆర్థిక, కుల, గణన వివరాలు, మిషన్ అంత్యోదయ సర్వే నివేదికలను గురించి తెలుసుకొనేందుకు ఇది ఏకగవాక్షంగానూ పని చేస్తుంది.