మన జీవన విధానాన్నీ, వృత్తులను, ఉపాధిని, ఇతరులతో సామాజిక అనుబంధాలను కరోనా సమూలంగా మార్చేసింది. 2011 నుంచి తగ్గుతూ వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు 2016లో కొంత ఊపందుకున్నా, కొవిడ్ మహమ్మారి దెబ్బకు మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి. ఇది ఆర్థిక ప్రగతికి ఏ మాత్రం శుభ సూచకం కాదు. ఇంత నిరాశావహ వాతావరణంలోనూ సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలు ఆశాకిరణంలా కనిపించడం విశేషం. కరోనా విషపు నీడలో ఆర్థిక కార్యకలాపాలు బొత్తిగా మందగించినా, సాంకేతికత వినియోగం మాత్రం గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచే పని అనే పదబంధం సరికొత్త వాడుక పదమైంది. లక్షలాది విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ చెల్లింపులు పెద్దపెట్టున పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన చెల్లింపులకన్నా జూన్ నెలలో చెల్లింపులు ఎన్నో రెట్లు ఎక్కువ. కుటుంబాలు, కంపెనీలు, ప్రభుత్వాలు దృశ్యమాధ్యమాల ద్వారా సంప్రదింపులకు అగ్ర ప్రాధాన్యమిస్తున్నాయి.
పెరిగిన ఈ-కామర్స్ వ్యాపారం
లాక్‌డౌన్ పతాకస్థాయిలో ఉన్నప్పుడు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) రంగంలోని 45 లక్షల మంది సిబ్బందిలో మూడింట రెండొంతులు ఇళ్ళ నుంచే పని చేశారని అంచనా. దీంతో కంపెనీలు కరోనా తగ్గుముఖం పట్టేవరకు కార్యాలయాలను తెరవకుండా కార్యకలాపాలు కొనసాగించడానికి వీలైంది. ఒకవేళ కొన్ని తెరిచినా పరిమిత సిబ్బందితో అవి కార్యకలాపాలు నడిపిస్తున్నాయి. పెద్ద నగరాల్లో కిరాణా సరకులు, వస్త్రాలు మొదలుకొని రకరకాల వినియోగ వస్తువులను ఈ-కామర్స్ కంపెనీలు భారీస్థాయిలో సరఫరా చేస్తున్నాయి. అందుకే కరోనా ప్రబలిన తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు తమ వ్యాపారం 80 శాతందాకా పెరిగిందని ఈ-కామ్ కంపెనీలు వెల్లడించాయి. అదే సాధారణ దుకాణాలు కరోనా ముందు నాటి వ్యాపారంలో 50 నుంచి 60 శాతం మాత్రమే చేయగలుగుతున్నాయి.
ఉద్యోగాలపై ప్రభావం
సాంకేతికత వెలుగు నీడలు అసలే కొవిడ్ వల్ల భారీ ఉద్యోగ నష్టం సంభవించిన పరిస్థితిలో సాంకేతికత వల్ల ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయనే ఆశ లేదు. స్వల్ప, మధ్య కాలాల్లో ఉద్యోగ విపణి విచ్ఛిత్తి సాంకేతికత వల్ల మరింతగా ముదిరింది. భారత్ వంటి వర్ధమాన దేశంలో అన్ని ఉద్యోగాలూ ఇంటి నుంచి చేయడానికి అనువైనవి కావు. కొన్ని రంగాల్లో మాత్రమే ఆ సదుపాయం లభిస్తుంది. ఒకటి మాత్రం నిజం- ఇంటి నుంచి పని విధానం సంఘటిత రంగంలోని పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల ఉత్పాదకతను పెంచింది. ఉద్యోగులపై కంపెనీలు చేసే ప్రయాణ ఖర్చులు, క్యాంటీన్ ఖర్చులు, కార్యాలయ భవనాల అద్దెలు, విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గాయి. నగరాల్లో కంపెనీలు తమ ఉద్యోగులపై చేసే వ్యయంకన్నా తమ కార్యాలయాలకు చెల్లించే అద్దె ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఎక్కువని అంచనా.
దేశ ఆర్థికంపై ప్రభావం..
ఇంటి నుంచి పనితో అద్దె ఖర్చు ఆదా అయినా దీనివల్ల స్థిరాస్తి, భవన నిర్మాణ రంగాలపై పడే ప్రతికూల ప్రభావం తక్కువేమీ కాదు. పేదలకు, వలస కూలీలకు ఉపాధి కల్పించే ఈ రెండు రంగాలు దెబ్బతినడం దేశార్థికానికి ఏమాత్రం మంచిది కాదు. ఆధునిక సాంకేతికతలను క్రమంగా చేపట్టాలి తప్ప, ఉన్నఫళాన అమలు చేయడం మంచిది కాదు. సంక్షోభ సమయాల్లో ఆకస్మికంగా వచ్చిపడే సాంకేతిక మార్పు తీవ్ర నష్టాలకు దారి తీస్తుందని ప్రస్తుత కొవిడ్ సంక్షోభ సమయం రుజువు చేస్తోంది. కొవిడ్ వల్ల ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఉపాధి నష్టం కొనసాగేట్లుంది. నేడు భారత ఆర్థిక వ్యవస్థను కరోనాతోపాటు ఉపాధి రహిత అభివృద్ధి, విపరీతమైన రుణభారం, తగ్గిపోయిన ప్రైవేటు పెట్టుబడులనే రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి.
భారీ ఉద్యోగ నష్టాలు