దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని కరోనా ఒక కుదుపు కుదిపింది. విద్యారంగానికి ఆయువుపట్టు అయిన బోధనా రీతుల్నే ఇది ఆసాంతం మార్చేస్తోంది. గురుముఖతః చదువు ప్రమాదంలో పడింది. ఆన్‌లైన్ పద్ధతిలో డిజిటల్ స్క్రీన్ చూస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బోధనపరంగా ఆన్‌లైన్ చదువులను ఎవరూ సమర్థించరు. అదే సమయంలో విపత్కర కాలంలో ఈ పద్ధతిని ఉన్నంతలో మంచి ప్రత్యామ్నాయంగా అంగీకరించక తప్పదు. ఆన్‌లైన్ సాంకేతికతకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నప్పటికీ మారిన పరిస్థితులు గ్రామీణ విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉన్నాయన్నది నిర్వివాదం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థినుల చదువులు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నాయి. గ్రామాల్లో ఉండే సామాజిక ఆర్థిక స్థితిగతులు అందుకు కారణమవుతున్నాయి.
అదనపు ఆర్థిక భారం
ఆన్‌లైన్ విద్యకు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లలో ఏదోఒకటి ఉండాలి. అంతర్జాలంతో అనుసంధానం అవసరం. ఇవన్నీ ఆర్థికంగా భారం మోపేవే. గ్రామాల్లో అంతర్జాల కనెక్టివిటీ అంతంతమాత్రం. విద్యార్థుల్లో ఎక్కువమందికి మామూలు ఫోన్లు ఉంటాయి. కొందరికి ఫోన్లే ఉండవు. అందువల్లే ఆన్‌లైన్ తరగతులకు వారు దూరమై ఒత్తిడికి గురవుతున్నారు. వారిలో ఆత్మన్యూనత వేళ్లూనుకుంటోంది. ఫోన్లు ఉన్నా అవసరమైన డేటా లేని విద్యార్థులు అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను అడగలేక సతమతమవుతున్న వైనం ఇందులోని మరో బాధాకర కోణం. వీడియో ఆడియో పాఠాలు వినాలంటే ఎక్కువ డేటా అవసరం. డేటా కొనుగోలు చేయలేనివారు చదువులకు క్రమేపీ దూరమవుతున్నారు. ఆన్‌లైన్ చదువులకు ఏకాంతం, ఏకాగ్రతలు ఎంతో అవసరం. గ్రామాల్లో అలాంటి పరిస్థితులు ఉండవు. ఇంటి వాతావరణం సైతం అందుకు దోహదం చేయదు.
అంతా యాంత్రికంగా..
విద్యార్థులు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి దూరంగా ఉంటున్నారు. చెప్పేది వారెంతవరకు విన్నారో, అసలు విన్నారో లేదో తెలియని స్థితి. అంతా యాంత్రికంగా జరిగిపోవడం బోధనలో ప్రాథమిక నియమాలకు విరుద్ధం. పిల్లలకు పాఠం ఎంతవరకు అవగతమయిందో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉపాధ్యాయులు ఉండిపోతున్నారు. చెప్పిన పాఠం సరిగ్గా వినక, వినిపించక ఆ తరవాత పిల్లలు సంధించే ప్రశ్నల వల్ల వారు పడుతున్న పాట్లు అనేకం. పాఠాలు చెబుతున్నప్పుడు అంతర్జాల ప్రసార అనుసంధానం (స్ట్రీమింగ్) పోతుండటం చీకాకుపెట్టే అతిపెద్ద సమస్య.