కొవిడ్(covid-19) ప్రళయతాండవం ప్రపంచంలో అనేకానేక కంపెనీలను అధఃపాతాళానికి నెట్టివేసినా- టెక్నాలజీ కంపెనీల లాభాలు మాత్రం నింగిని తాకుతున్నాయి. ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో 'బిగ్5'గా పేరుపడిన ఫేస్‌బుక్, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలకు లాభాలే లాభాలు. కరోనా వల్ల మన సామాజిక, ఆర్థిక జీవనాలు ఆన్‌లైన్‌కు తరలిపోవడం బిగ్5 వ్యాపారవృద్ధికి దోహదం చేస్తోంది. 2021వ సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ఈ కంపెనీల ఆదాయం 41శాతం మేర పెరిగి 32,200 కోట్ల డాలర్లకు (దాదాపు 23.5 లక్షల కోట్ల రూపాయలకు) చేరింది. బిగ్5 భూగోళమంతటా వ్యాపారం చేస్తున్నా ప్రపంచ దేశాలకు అదే స్థాయిలో పన్నులు(Tax) కట్టడం లేదు. మానవ హక్కుల సంస్థ యాక్షన్ ఎయిడ్ నివేదిక ప్రకారం బిగ్5 కంపెనీలు.. జీ20 దేశాలకు ఏటా 3,200 కోట్ల డాలర్ల (రూ.2,34,000 కోట్ల) పన్నులు ఎగ్గొడుతున్నాయి. జీ20 సభ్యదేశమైన భారత్ ఏటా రూ.11,242 కోట్ల పన్నుల ఆదాయాన్ని కోల్పోతోంది.
సంస్కరణలకు సమయమిది
సాంకేతిక పరిజ్ఞానం కేవలం కంపెనీలకు లాభాలు సంపాదించి పెట్టడానికే పరిమితమైపోకుండా మానవ కల్యాణానికి తోడ్పడాలని ఇటీవల జరిగిన వర్చువల్ సమావేశంలో ఐరోపా కమిషన్ అత్యున్నత డిజిటల్ అధికారిణి మార్గరిటె వెస్టేగర్ సందేశమిచ్చారు. బిగ్5 టెక్ కంపెనీలు ఏటా ఎగ్గొడుతున్న 3,200 కోట్ల డాలర్ల పన్నుల(Tax) ధనంతో ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రెండు కొవిడ్(Covid-19) నిరోధక టీకా డోసులు వేయవచ్చని యాక్షన్ ఎయిడ్ తెలిపింది. కొవిడ్ నియంత్రణకు నిధులు చాలక ప్రపంచ ప్రభుత్వాలు సతమతమవుతున్న సమయంలో బిగ్5 ఎగవేస్తున్న పన్నులను రాబట్టుకోవడం చాలా అవసరం. ఇంటర్నెట్ ఆవిర్భావంతో కాలం చెల్లిపోయిన కార్పొరేట్ పన్నుల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని ప్రపంచమంతటా డిమాండ్లు ఊపందుకొంటున్నాయి. ఇంటర్నెట్ సాయంతో దేశదేశాల్లో విస్తరించిన బిగ్5 కంపెనీల వ్యాపారంపై ఏ దేశంలో పన్నులు(Tax) వేయాలన్నది చిక్కు ప్రశ్న. ఈ టెక్నాలజీ కంపెనీలకు ప్రపంచమంతటా వినియోగదారులు ఉన్నప్పటికీ, ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం ఆ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉంటే అక్కడే పన్నులు కట్టాలి.
చట్టపరమైన లొసుగుల వల్ల..
బిగ్5 ప్రధాన కార్యాలయాలు అమెరికాలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు పన్ను రేట్లు బాగా తక్కువగా ఉండే ఐర్లాండ్, కరీబియన్ దేశాల్లోనూ కార్యాలయాలు నెలకొల్పాయి. తమ లాభాల్లో కొంత భాగాన్ని ఈ దేశాల్లో చూపి తక్కువ పన్నులు కట్టి తప్పించుకోవడానికి అంతర్జాతీయ పన్ను చట్టాల్లోని లొసుగులు తోడ్పడుతున్నాయి. బడా టెక్ కంపెనీల కార్యకలాపాలు పేద దేశాలకూ విస్తరించినా, చట్టపరమైన లొసుగుల వల్ల వాటికి లభిస్తున్న పన్నుల ఆదాయం నామమాత్రమే. కొవిడ్‌వల్ల ప్రధాన దేశాలూ ఈ సమస్యపై దృష్టి సారిస్తున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)లతోపాటు భారతదేశమూ- బడా టెక్నాలజీ కంపెనీల నియంత్రణకు చట్టాలు రూపొందించే పనిలో ఉంది. ప్రపంచ ప్రభుత్వాలు అంతర్జాతీయ కనీస పన్నును విధించడం ఒక పరిష్కార మార్గమని యాక్షన్ ఎయిడ్ నివేదిక సిఫార్సు చేసింది. ప్రతి కంపెనీ స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఆర్జించే లాభాలపై 25శాతం అంతర్జాతీయ కనీస పన్ను (జీఎంటీ) విధించాలని సూచించింది. ప్రపంచ దేశాలు తమ భూభాగాల్లో సొంత పన్ను రేట్లు విధించుకోవచ్చు. కంపెనీలు విదేశాల్లో 25శాతంకన్నా తక్కువ జీఎంటీని చెల్లించి, మిగిలిన భాగాన్ని తమ ప్రధాన కార్యాలయాలు నెలకొన్న దేశాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన కంపెనీ ఐర్లాండ్‌లో చూపిన లాభాలపై 25శాతంకన్నా తక్కువ కార్పొరేట్ పన్ను చెల్లించి మిగిలిన భాగాన్ని అమెరికాలోనే చెల్లించాలి.