కొవిడ్ సంక్షోభం మనదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించేలా చేసింది. 2020 జనవరి నుంచి కొనసాగుతున్న ఈ సంక్షోభానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. బలహీనమైన ప్రజారోగ్య వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే, సమర్థమైన ఆరోగ్య సౌకర్యాలను కలిగి ఉన్న రాష్ట్రాలు ఈ సంక్షోభాన్ని మెరుగైన రీతిలో ఎదుర్కోగలిగినట్లు కనిపించింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు పటిష్ఠంగా ఉండాల్సిన అవసరంతోపాటు ప్రాథమిక, మాధ్యమిక స్థాయి ఆరోగ్య రంగ ప్రాధాన్యమూ కొవిడ్ సంక్షోభం ద్వారా వెల్లడయింది. అన్నింటికీ మించి, చికిత్సకన్నా నివారణే మంచిదన్న సత్యాన్ని మరోసారి చాటిచెప్పినట్లయింది. మొత్తం కొవిడ్ కేసుల్లో పదిశాతంకన్నా తక్కువగానే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం నెలకొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం రెండు నుంచి మూడుశాతం బాధితులను ఐసీయూ లేదా వెంటిలేటర్‌పై ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. తీవ్రస్థాయి చికిత్సలు అవసరం లేకపోయినా, ఉన్నతస్థాయి ఆస్పత్రుల్లో కొవిడ్ రోగుల రద్దీ విపరీతంగా పెరగడంతో అనవసర వృథా పెరిగింది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లోనే కొవిడ్ కేసులు విస్తృతమవుతున్నాయి. గ్రామీణ జిల్లాల్లోని వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వంటి ముఖ్యమైన ఆరోగ్య మానవ వనరులకు ప్రాధాన్యం ఎంతమేర ఉంటుందనేది నమోదవుతున్న కేసులు తేటతెల్లం చేశాయి.
ఎన్నో సమస్యలకు పరిష్కారం
ఆరోగ్య సంరక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్నేళ్లుగా తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. దీనివల్ల మానవ వనరులు, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యల్ని అధిగమించే అవకాశం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సమాచారాన్ని సేకరించి, నమోదు చేసేందుకు ఏఎన్‌ఎమ్‌ల వంటి ఆరోగ్య సిబ్బంది స్మార్ట్ ఫోన్లు వాడేలా జాతీయ ఆరోగ్య మిషన్ పలు మార్పులు ప్రవేశపెట్టింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో మెరుగైన పర్యవేక్షణ సుసాధ్యమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని సృష్టించారు. ముఖ్యంగా, టెలీమెడిసిన్ రంగంలో ప్రైవేటు రంగం వైద్యులు సైతం పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్రమోదీ కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్‌డీహెచ్‌ఎం) ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్‌డీహెచ్‌ఎం అనేది పూర్తిస్థాయి డిజిటల్ వేదిక. ఇది ఆరోగ్య సంబంధ గుర్తింపును, వ్యక్తిగత ఆరోగ్య రికార్డును, నమోదు చేసుకున్న వైద్యులు, ఆరోగ్య సౌకర్యాల వివరాలను అందజేస్తుంది. ఎన్‌డీహెచ్‌ఎమ్‌లో టెలీమెడిసిన్ సేవలు, ఈ-ఫార్మసీ సౌకర్యాలను పొందుపరుస్తారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) ఈ పథకాన్ని నిర్వహించనుంది. ఆయుష్మాన్ భారత్ అమలునూ ఇదే చేపడుతుంది. జాతీయ ఆరోగ్య విధానం-2017 సైతం డిజిటల్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యాన్ని చాటింది.
ప్రయోజనాలెన్నో