తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే! - నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!

విద్య అనేది మార్పునకు చిహ్నం. అది వారి జీవన విధానంలో ఎన్నో మార్పులు తెస్తుంది. సమాజ అభివృద్ధితో పాటు దేశ ఆర్థికవృద్ధినీ ఇతోధికం చేస్తుంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కల్పించడంలో మంచి ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. నేటితరం విద్యార్థులు బహిరంగ వనరుల ద్వారా విషయాలకు, సాంకేతికతకు చేరువగా ఉంటున్నారు. అయితే.. ఈ పరిస్థితుల్లో విజ్ఞానం అందించడమే ఉపాధ్యాయుడి బాధ్యత కాబోదు. విద్యారంగంలో ప్రస్తుతమున్న సవాళ్లను అధిగమించి.. ప్రభావశీలురుగా తమ ఔచిత్యం కోల్పోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. ఉపాధ్యాయుడంటేనే నిత్యవిద్యార్థి.. కావున నేర్చుకునే విషయంలో బోధకులు సానుకూల మనస్తత్వాన్ని అలవరచుకోవాలి.

TEACHERS NEED TO IMPROVE POSITIVE ATTITUDE IN LEARNING PROCESS
నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!

By

Published : Sep 5, 2020, 7:06 AM IST

విద్య ఒక మార్పు కారకం. అది ప్రజల ఆరోగ్య సమృద్ధికి దోహదపడుతుంది. వారి జీవనాన్ని మెరుగుపరుస్తుంది. సామాజిక సుస్థిరతకు తోడ్పడుతుంది. దేశ దీర్ఘకాలిక ఆర్థికవృద్ధిని ఇతోధికం చేస్తుంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని కల్పించే దిశగా మంచి ఉపాధ్యాయులు ప్రముఖపాత్ర వహిస్తారు. అందుకే తన ప్రజల మీద, తన భవిష్యత్తు మీద దేశం పెట్టదగిన అత్యంత ముఖ్యమైన పెట్టుబడుల్లో విద్య ఒకటి. విద్యపై అపారమైన అనురక్తి కలిగిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్వయంగా అధ్యాపకుడు, విఖ్యాత దౌత్యవేత్త, పండితుడు. రెండుసార్లు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయనను స్మరించుకుని నివాళి అర్పించేందుకు ఆయన జయంతి సందర్భంగా భారత్‌లో ఏటా సెప్టెంబరు అయిదో తేదీన 'ఉపాధ్యాయ దినోత్సవం' పాటిస్తున్నారు. ఉపాధ్యాయులపట్ల మన గౌరవప్రపత్తులను చాటుకునేందుకు ఇది చక్కటి అవకాశం. గురువుల సమస్యలను, సవాళ్లను, అవకాశాలను, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పులను చర్చించుకోవడానికి ఇది సరైన సమయం.

ప్రపంచవ్యాప్తంగా బోధకుల కొరత

యునెస్కో గణాంకాల ప్రకారం, 2030 సంవత్సరానికి నిర్దేశించుకున్న విద్యాలక్ష్యాల సాధనకు అంతర్జాతీయంగా దాదాపు 6.90 కోట్ల మంది కొత్త ఉపాధ్యాయులు అవసరం. వచ్చే 14 ఏళ్లలో ప్రతి విద్యార్థికి ప్రాథమిక, మాధ్యమిక విద్యాబోధనకు 6.88 కోట్లమంది ఉపాధ్యాయ నియామకాలు జరగాల్సి ఉంటుంది. ఈ సంఖ్య దేశాల జనాభాలను తలపిస్తుంది. 6.90 కోట్లకు మించిన జనాభా గల దేశాలు ప్రపంచంలో కేవలం 20 మాత్రమే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది కెనడా జనసంఖ్యకు దాదాపు రెట్టింపు. నాణ్యమైన విద్యాబోధకులకు ప్రతి దేశంలోనూ ఇప్పుడు కొరత ఉంది. హవాయ్‌ పబ్లిక్‌ రేడియో ప్రకారం, ఆంగ్లం మాట్లాడే దేశాల నుంచి యోగ్యులైన టీచర్లను నియమించుకునేందుకు న్యూజిలాండ్‌ విద్యామంత్రిత్వ శాఖ ఉద్యోగ ప్రకటనలు ఇస్తోంది. చైనా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ఉపాధ్యాయులకు కొరత ఏర్పడింది. దీంతో పదవీ విరమణ చేసిన వారికి ప్రోత్సాహకాలు కల్పించి మళ్లీ నియమించుకుంటోంది. నెదర్లాండ్‌లో సుశిక్షితుల కొరత మరీ తీవ్రంగా ఉంది. అనేక దేశాలు తమ విద్యావ్యవస్థలు, ఉపాధ్యాయుల మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఓఈసీడీ 2018 నివేదిక ప్రకారం, విద్యార్థుల నమోదు తగ్గినప్పటికీ, 2010-2015 మధ్య కాలంలో చాలా సభ్యదేశాలు విద్య మీద పెట్టుబడులను పెంచాయి.

అయినా తగ్గని అవసరం..

బోధనలో సాంకేతికత, అంతర్జాలం, కృత్రిమమేధల పాత్ర శరవేగంగా పెరిగిపోతున్న వేళ, బోధనావృత్తి ప్రాముఖ్యం కోల్పోతుందన్న భయాలు ఉన్నాయి. అయినా, తరగతి గదిలో ఉపాధ్యాయుడి అవసరం ఎన్నటికీ తగ్గదు. కరోనా మహమ్మారి కష్టకాలంలో- ఇది చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యావశ్యకంగా మారింది. భావోద్వేగభరితమైన బుద్ధికుశలత గురువు సొంతం. విద్యార్థి ధ్యాసను చదువు మీదకు మరల్చడం ఎలానో ఉపాధ్యాయులకే తెలుస్తుంది... ఇప్పటి తరం విద్యార్థులు సాంకేతికత క్షణక్షణం మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్నారు. ఆ వేగం అందుకోవాలంటే, వారికి ప్రతి పదేళ్లకూ కొత్త నైపుణ్యాలు కావాలి. ఉపాధి యోగ్యత కోల్పోకుండా ఉండాలంటే, ఒక జీవితకాలంలో పలు నైపుణ్యాలు సమకూర్చుకోవాలి. వెనకబడుతున్న ప్రతిసారీ వారికి తోడ్పడేందుకు మంచి అధ్యాపకులు కావాలి.

భవిష్యత్‌ గురువులు!

ఇప్పటితరం విద్యార్థులు బహిరంగ వనరుల ద్వారా విషయాలకు, సాంకేతికతకు ఎంతో చేరువగా ఉంటున్నారు. ఈ పరిస్థితిలో విజ్ఞానం అందించడమొక్కటే ఉపాధ్యాయుడి బాధ్యత కాబోదు. విద్యారంగం నేడు ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాలు ఇది. అయినప్పటికీ, ఉపాధ్యాయులు ప్రభావశీలురుగా తమ ఔచిత్యం కోల్పోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండటం సాధ్యమే. హృదయపూర్వకంగా కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడం ద్వారా ప్రపంచ విద్యావిషయక పరివర్తనలో భాగస్వాములు కాగలుగుతారు. జీవితమంతా నేర్చుకుంటూనే ఉండటం నేటి ఆధునిక విద్యలో తప్పనిసరి.. కనుక, నేర్చుకునే విషయంలో బోధకులు సానుకూల మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. కొత్త భావాలు స్వీకరించడానికి, సరికొత్త విషయాలు నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండగలిగిన వారే రేపటి ఉపాధ్యాయులు అవుతారు.

వృత్తి శిక్షణ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే..

రానున్న సంవత్సరాల్లో, సాంకేతికతలు పెద్దపెట్టున అభివృద్ధి అవుతాయి. కృత్రిమ మేధ, ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), డిజిటల్‌ సాధనాలు, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వంటివి విద్యారంగంలో రాజ్యమేలనున్నాయి. కంప్యూటర్‌ ధారాళత, డిజిటల్‌ అక్షరాస్యత, మార్పునకు అనుసరణీయత, సమస్యాపరిష్కారంలో నేర్పరితనం, అధిక ఐక్యూ- ఇవి ఉపాధ్యాయులు తమ వృత్తిలో రాణించడానికి తప్పనిసరి. వృత్తి శిక్షణ అవకాశాలను ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలి. విద్యార్థులకు వారు బోధకులే కాదు- మంచి సదుపాయకర్తలు కావాలి. ఆలోచనలు రేకెత్తించాలి. చక్కటి కథకులుగా మారాలి. కేవలం విజ్ఞానం సమకూర్చడం ఒక్కటే కాదు వారి బాధ్యత. విద్యార్థులు జీవితకాల అభ్యాసకులుగా మారడంలో వారికి తోడ్పడాలి. సాంకేతిక సాయంతో సమాచారాన్ని విజ్ఞానంగా, ఆ విజ్ఞానాన్ని నైపుణ్యంగా మార్చాలి.

ఉపాధ్యాయులు బాగోగులు చూసుకుంటేనే..

సంతోషంగా లేని ఉపాధ్యాయులు- సంతోషంగా ఉండే ఉత్పాదక విద్యార్థులను సృష్టించలేరు. వారి సమస్యలు తీర్చేందుకు అవసరమైన చర్యలను అనేకం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌) సూచించింది. విద్యార్థి-బోధకుల నిష్పత్తిని మెరుగుపరచడం, మంచి వేతనాలు చెల్లించడం, తరగతి పరిమాణం హేతుబద్ధంగా ఉండేలా చూడటం, తరగతిగదులకు పూర్తిస్థాయిలో సామగ్రి సమకూర్చడం, ఉన్నతవిద్య శిక్షణ అవకాశాలు అందించడం, విధాన నిర్ణయాలలో పాత్ర కల్పించడం వంటి చర్యలతో మనం మన ఉపాధ్యాయుల బాగోగులు చూసుకోవాలి.

ఇండియాలో ఇదీ పరిస్థితి...

విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిలో ఎనిమిది దేశాలతో పోల్చి చూస్తే, ఇండియా చిట్టచివరి స్థానంలో నిలుస్తుంది. భారత్‌లో ఈ నిష్పత్తి 24:1గా ఉంది. ఇది చైనా, బ్రెజిల్‌ దేశాల్లో ఉన్న 19:1కంటే తక్కువ. ఉన్నత విద్యలో ఈ నిష్పత్తి పరంగా భారత్‌ అనేక దేశాల కంటే వెనకబడి ఉంది. స్వీడన్‌ (12:1), బ్రిటన్‌ (16:1), రష్యా (10:1), కెనడా (9:1)లు మన కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. కొత్త ‘జాతీయ విద్యా విధానం-2020’ టీచర్లకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతిభావంతులైన విద్యార్థులు బోధనావృత్తిని ఎంచుకోవాలని అభిలషించింది. టీచర్ల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వాలని, పాఠశాలలో చక్కటి ఆహ్లాదకర వాతావరణం ఉండాలని ఉద్ఘాటించింది. ‘నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి’కి చర్యలు చేపట్టాలని సూచించింది. ఇవి అమలు చేయదగిన చక్కటి ప్రతిపాదనలు. జనాభాపరంగా పోటీపడుతున్న భారత్‌లో- చైనాలో కంటే మూడు రెట్లు అధికంగా 15 లక్షల పాఠశాలలు ఉన్నాయి.

- డాక్టర్​ కే. బాలాజి రెడ్డి, రచయిత - సాంకేతిక విద్యారంగ నిపుణులు

ఇదీ చదవండి:కళ్లకు గంతలతో ఆరేళ్ల బుడతడి 16 కి.మీ స్కేటింగ్​

ABOUT THE AUTHOR

...view details