కరోనా మహమ్మారి వల్ల 165 దేశాల్లో పాఠశాలలు మూతపడి 6.30 కోట్లమంది ఉపాధ్యాయులు ప్రభావితమయ్యారు. 150 కోట్లమంది విద్యార్థుల చదువులు కొనసాగేలా చూసే బాధ్యత వీరిపై ఉంది. లాక్‌డౌన్ ప్రభావం ఇతరులకన్నా బడిపిల్లలు, ఉపాధ్యాయుల మీదే అధికంగా ఉంది.
భారత్‌లో పాఠశాల విద్యకు సంబంధించి 2016-17నాటి గణాంకాల ప్రకారం 14 లక్షల పాఠశాలలు ఉన్నాయి. 1-8 తరగతుల మధ్య 19 కోట్ల మంది, 9-10 తరగతుల్లో 3.8 కోట్ల మంది చదువుతున్నారు. భారత్ జనాభాలో చిన్నారులే 29 శాతం ఉన్నారు. వీరిలో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల సంఖ్య 19.29 శాతం ఉంటుంది. విద్యాహక్కు చట్టం(2009) ప్రకారం 6-14 సంవత్సరాల వయస్సు పిల్లలకు విద్య అభ్యసించే హక్కును చట్టబద్ధం చేశారు.
కొత్త నైపుణ్యాలు తప్పనిసరి
దేశంలో 27 లక్షల మంది ఉపాధ్యాయులు కరోనా వైరస్‌వల్ల ప్రభావితమయ్యారని యునెస్కో గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత అనూహ్య పరిస్థితిని ఎదుర్కొనే శిక్షణ వారికి లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6.3 కోట్ల ఉపాధ్యాయుల్లో 91 లక్షల మంది ఉపాధ్యాయులు సుశిక్షితులు కాకపోవడం వల్ల ఉద్యోగపరంగా అస్థిరతను ఎదుర్కొంటున్నారు. 2020 ఏప్రిల్ 7 నుంచి 14వ వరకు గ్లోబల్ స్కూల్ లీడర్స్ ఫోరం 12 దేశాల్లోని 1,800 మంది స్కూలు టీచర్ల నుంచి ఉపాధ్యాయులూ యోధులే! స్పందనలు స్వీకరించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో విద్యార్థుల సంక్షేమానికి పూచీపడాల్సిన బాధ్యత తమపై ఉందని ఉపాధ్యాయులు బలంగా విశ్వసిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
స్కూళ్ల ఆకస్మిక మూసివేతతో అనేకమంది ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత, తాము నిర్వహించాల్సిన పాత్ర గురించి ఎంతో అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామందికి వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాలను ఎలా వినియోగించుకోవాలో తెలియదు. కళాశాలల పునః ప్రారంభం తరవాత బోధనాపరమైన సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా లేరు. బోధన కోసం కమ్యూనికేషన్, డిజిటల్ పరికరాలను అవసరాన్ని అకస్మాత్తుగా తెరపైకి తెచ్చింది ఈ మహమ్మారి. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో మానవ ప్రమేయం తప్పనిసరన్నది వాస్తవం. ఉత్తమ అధ్యాపకులకు సాంకేతికత ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే- కరోనా మహమ్మారి తరహా అనూహ్య పరిస్థితుల్లో దీటుగా పనిచేయడానికి టీచర్లకు బహువిధాలా మద్దతు అవసరం.
మరింత క్లిష్టంగా..
సహజంగానే అధ్యాపక వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది. సాంకేతికత వినియోగం, బోధనలో వినూత్న విధానాలను నేర్చుకోవడం, విద్యార్థులతో భావోద్వేగ సంబంధాలు ఏర్పరచుకోవడం... ఇలా ఎన్నో విధాలుగా అధ్యాపక పాత్ర అత్యంత ప్రధానమైనది. టీచర్లు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు లేదా డైరెక్టర్లు... ఎలా పిలిచినప్పటికీ వీరంతా ప్రస్తుత సంక్షోభంలో కీలక పాత్ర పోషించాలి. ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న ప్రస్తుత కఠోర పరిస్థితిని సానుకూల దృక్పథంతో స్వీకరించాలి. తమ పురోగతికి దీన్ని సదవకాశంగా మార్చుకోవాలి. వారు తమ కుటుంబాలను క్వారంటైన్‌లో ఉంచి పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అధిక సమయం ఎలక్ట్రానిక్ తెరల ముందు గడపడం వల్ల నిద్రలేమి, అలసట, కళ్లు పొడిబారడం, దృష్టి మసకబారడం, తలనొప్ఫి.. వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
స్కూళ్లు తెరిచాక...
పాఠశాలలు ముందుగానో ఆలస్యంగానో తెరుచుకోవడం తథ్యం. టీచర్ల నుంచి తాను ఏమి ఆశిస్తున్నదీ స్పష్టం చేస్తూ అనుగుణమైన మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించాలి. కర్తవ్య నిర్వహణలో అవసరమయ్యే అన్ని వనరుల్నీ వసతుల్నీ వారికి సమకూర్చాలి. ఉపాధ్యాయులూ విద్యార్థుల పట్ల సానుభూతితో ఉంటూ మెరుగైన బోధన అందించాలి. ఇందుకోసం టీచర్లకు ఆన్‌లైన్ నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమలు నిర్వహించాలి. వారిపై అదనపు బాధ్యతలు మోపకుండా ఆన్‌లైన్ బోధనకే పరిమితం చేయాలి. నిజానికి ఉపాధ్యాయులు కూడా వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసుల తరహాలో 'ఫ్రంట్‌లైన్ వారియర్లు'గా పనిచేస్తున్నారు. తమ విధుల సమర్థ నిర్వహణకు అన్నివిధాలుగా రక్షణ, మద్దతు వారికి అవసరం.
మానసిక ఆరోగ్యం టీచర్లు ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య. వ్యాకులత, నిస్పృహ, ఒంటరితన భావనలకు వారు లోనయ్యే ప్రమాదం ఉంది. వారిలో తలెత్తగల అనారోగ్య సమస్యల పరిష్కారానికి మానసిక వైద్యుల సలహాలనూ అందించాలి. ఉపాధ్యాయుల మానసిక ఒత్తిడి ప్రభావం విద్యార్థుల మీదా పడుతుంది. ఆనందం కొరవడిన ఉపాధ్యాయులు ఆనందం పొంగిపొర్లే విద్యార్థులను తయారు చేయలేరు. టీచర్లు ఆనందంగా ఉంటేనే విద్యార్థులూ ఆనందంగా ఉంటారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయులకూ వర్తింపజేయాలి. వారిని కాపాడుకోవాలి. పూర్తి మద్దతు ఇవ్వాలి. విద్యారంగం సమూల మార్పులకు లోనవుతున్న తరుణంలో ఇది పాలకుల తక్షణ కర్తవ్యం కావాలి!
- కె బాలాజీరెడ్డి, సాంకేతిక విద్యారంగ నిపుణులు
ఇదీ చూడండి:ఆ మూడు సంరక్షణ కేంద్రాల్లో పులులు మాయం!