'విమానయాన సంస్థను సమర్థంగా నిర్వహించడంలో టాటా సర్వీసెస్ అందరికీ ఆదర్శప్రాయం. సమయపాలన వంటి కీలకాంశాల్లో వీరి నుంచి విలువైన పాఠాలు గ్రహించడానికి ఇంపీరియల్ ఎయిర్‌వేస్ సిబ్బందిని ఇక్కడికి పంపించాలి'- 1932లో కన్నుతెరిచిన టాటా ఎయిర్‌మెయిల్ మీద ఆ మరుసటి ఏడాది పౌరవిమానయాన డైరెక్టరేట్ రూపొందించిన నివేదికలోని వ్యాఖ్యలివి! జేఆర్‌డీ టాటా దీక్షాదక్షతలకు దక్కిన ప్రశంసలవి! సేవలకు శ్రీకారం చుట్టిన తొలి ఏడాదిలోనే 60 వేల రూపాయల లాభాన్ని ఆర్జించిన ఆ సంస్థ- అయిదేళ్లలో అంతకు పదిరెట్ల వృద్ధిని నమోదుచేసింది. తరవాతి కాలంలో టాటా ఎయిర్‌లైన్స్‌గా, ఎయిరిండియాగా (Air India News) అవతరించి- అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన సేవలకు చిరునామాగా వినుతికెక్కింది. 1953లో జాతీయీకరించాక, ఆ సంస్థ ప్రభుత్వ అజమాయిషీలోకి వచ్చింది. 'జాతి ప్రతిష్ఠకు ప్రతీక'గా నిలుస్తూ అర్ధ శతాబ్దం పాటు అది లాభాల్లోనే నడిచింది. యూపీఏ జమానాలో నేతల అసమర్థ, అనుమానాస్పద నిర్వాకాలకు బలైన ఎయిరిండియా- నేడు రోజుకు రూ.20 కోట్లను నష్టపోయే దుస్థితికి చేరింది! 84వేల కోట్ల రూపాయల మేరకు ముంచెత్తిన నష్టాలు, రూ.61,560 కోట్లకు పైగా పోగుపడిన రుణాలతో కునారిల్లుతున్న సంస్థలో వందశాతం వాటాల విక్రయానికి కేంద్రం నిరుడే ముందుకొచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాథమిక ధరకు 39శాతానికి పైగా కోట్ చేసిన టాటా గ్రూప్ తాజాగా విజయపతాకం ఎగురవేసింది. 68 ఏళ్ల తరవాత పుట్టింటికి తిరిగివచ్చిన ఎయిరిండియా 'మహారాజా'కు పునర్వైభవం తీసుకొస్తామని రతన్ టాటా ఆనందోత్సాహాలతో ప్రకటించారు. కొవిడ్ ధాటికి అంతర్జాతీయంగా పౌరవిమానయాన రంగం కుదేలవుతున్న తరుణంలో- సంస్థను తిరిగి లాభాల బాట పట్టించడం టాటాలకు కత్తి మీద సామే!
Air India News: సొంతింటికి ఎయిరిండియా!
యూపీఏ జమానాలో నేతల అసమర్థ, అనుమానాస్పద నిర్వాకాలకు బలైన ఎయిరిండియా (Air India News) నేడు రోజుకు రూ.20 కోట్లను నష్టపోయే దుస్థితికి చేరింది! 84వేల కోట్ల రూపాయల మేరకు ముంచెత్తిన నష్టాలు, రూ.61,560 కోట్లకు పైగా పోగుపడిన రుణాలతో కునారిల్లుతున్న సంస్థలో వందశాతం వాటాల విక్రయానికి కేంద్రం నిరుడే ముందుకొచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాథమిక ధరకు 39శాతానికి పైగా కోట్ చేసిన టాటా గ్రూప్ తాజాగా విజయపతాకం ఎగురవేసింది.
కరోనా మహమ్మారి మూలంగా 2020-22 మధ్య విమానయాన రంగం 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోనుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) ఇటీవల ఆందోళన వ్యక్తంచేసింది. 2023 నాటికి గానీ ఆయా సంస్థలు లాభాలను కళ్లచూడలేవని స్పష్టీకరించింది. ఈ సంక్షుభిత వాతావరణంలో అంతర్గత సమస్యలను చక్కబెట్టుకుంటూ ఎయిరిండియాను గాడిలో పెట్టడానికి మరో నాలుగేళ్లు పట్టవచ్చని టాటా గ్రూప్ యాజమాన్యం అంచనా వేస్తోంది. ఐటీ-డిజిటల్ కార్యకలాపాలను ఇకపై టీసీఎస్ చూసుకుంటుందని, తద్వారా సంస్థ సమర్థత ఇనుమడిస్తుందని గ్రూప్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 12 వేలకు పైగా ఎయిరిండియా ఉద్యోగులను ఏడాది వరకు అలాగే కొనసాగించి, ఆ తరవాత పరిస్థితుల మేరకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేయనున్నారు. తమ ఆధ్వర్యంలోని ఇతర విమానయాన సంస్థలైన ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారాలపై ఇప్పటి వరకు టాటాలు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు నష్టాలను మూటగట్టుకొన్నారు. ఎయిరిండియా బిడ్‌లో భాగంగా స్వీకరించిన రూ.15,300 కోట్ల అప్పులను చెల్లువేయడం, కొత్త విమానాలను సమకూర్చుకోవడంతో పాటు సిబ్బంది, నిర్వహణ అవసరాలకు వారు ఇంకా భారీగానే వెచ్చించాలి! యూపీఏ పెద్దల పుణ్యామా అని లాభదాయకమైన రూట్లను కోల్పోవడం, దశాబ్దాల సర్కారీ యాజమాన్యంలో మేటవేసిన పెడపోకడల ఫలితంగా విపణిలో ఎయిరిండియా వాటా గణనీయంగా కోసుకుపోయింది. సమస్యల వలయంలోంచి బయటపడి- జేఆర్‌డీ టాటా మానసపుత్రిక మళ్ళీ సమున్నతంగా నిలబడితే అది అద్భుతమే! ఎయిరిండియా ఎసెట్ హోల్డింగ్స్ లిమిటెడ్ పరిధిలోకి వచ్చే రూ.28 వేల కోట్లకు పైగా రుణాలపై కేంద్రం కార్యాచరణ ఎలా ఉండనుందన్నదీ ఉత్కంఠభరితమే!
ఇదీ చూడండి:68ఏళ్ల తర్వాత సొంత గూటికి ఎయిర్ ఇండియా