తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహిళల వివాహ వయసు పెంపునకు మరో అడుగు

మహిళల వివాహ వయసు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. స్త్రీ, పురుషుల వివాహ వయసు సమానంగా ఉండటంపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, లా కమిషన్‌కు గత సంవత్సరం నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. 125 దేశాల్లో స్త్రీ, పురుష వివాహ వయసు సమానంగా ఉండగా మన దేశంలోనే ఈ తేడా ఎందుకని పిటిషనర్​ ప్రశ్నించారు.

task force for  girls marriage age
మహిళల వివాహవయసు పెంపునకు మరో అడుగు

By

Published : Jun 21, 2020, 10:57 AM IST

ఒక దేశంలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన మానవ వనరులు లభించడం వెనక మహిళల వివాహ వయసు, వారి ఆరోగ్యం, పోషకాహార లభ్యత... తదితరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కుటుంబ ఆలనపాలనలో, ఆర్థిక సామాజిక క్రమశిక్షణలో తల్లి పాత్ర కీలకం. 2018 జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, గృహహింస సమస్య అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిణతి చెందని వయసులో చేసిన పెళ్లిళ్లూ ఇందుకు కారణమే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహిళల వివాహ వయసు పెంచేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. గత సంవత్సరం ఆగస్టులో ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన దిల్లీ హైకోర్టు స్త్రీ పురుషుల వివాహ వయసు సమానంగా ఉండటంపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, లా కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసు వేర్వేరుగా ఉండటం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనే కాకుండా పితృస్వామిక వాదనను బలపరుస్తూ, మహిళా హక్కులు హరించడమేనని పిటిషనర్‌ ఆరోపించారు. 125 దేశాల్లో స్త్రీ, పురుష వివాహ వయసు సమానంగా ఉండగా మన దేశంలోనే ఈ విచక్షణ ఎందుకని ప్రశ్నించారు.

బాల్య వివాహాలతో అనేక సమస్యలు

బాల్య వివాహాల నిరోధక చట్టం (శారదా చట్టం-1929) వివాహ వయసును బాలికలకు 14, బాలురకు 18 సంవత్సరాలుగా నిర్ధారించింది. బాల్య వివాహాలవల్ల పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతారని వాటి నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టం వివాహ వయసును మహిళలకు 18, పురుషులకు 21 సంవత్సరాలుగా నిర్ధారించింది. చట్టాలు వయసును నిర్దేశించినా, ఆయా మతాలు తమ కట్టుబాట్ల ప్రకారమే వివాహ వయసు నిర్ధారించుకొని ఆచరిస్తున్నాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం సగటు భారతీయ మహిళ వివాహ వయసు 22 సంవత్సరాలు. యునిసెఫ్‌ గణాంకాల ప్రకారం 47 శాతం అమ్మాయిలు 18 సంవత్సరాల వయసులోపు, 18 శాతం 15 సంవత్సరాల లోపే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. జాతీయ కుటుంబ సర్వే (2015-16) ప్రకారం దేశంలోని 11 రాష్ట్రాల్లో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని, 30 శాతం బాలికలు 18వ సంవత్సరం నిండేసరికే మొదటి బిడ్డకు జన్మనిస్తున్నట్లు నివేదిక తెలిపింది. బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌లలో ఎక్కువగా బాల్య వివాహాలు నమోదయ్యేవి కానీ ఈ సర్వేలో బెంగాల్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. పొరుగు దేశాల వలసలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రపంచ మాతాశిశు మరణాల్లో దక్షిణాసియా దేశాల్లోనే 24 శాతం చోటుచేసుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. బాల్య వివాహాలు బాలికల అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి.

శారదా చట్టాన్ని సవరించి బాలికల వివాహ వయసును 14 నుంచి 18కి పెంచినప్పటి నుంచి ప్రభుత్వం తెచ్చిన వివిధ చట్టాలు, పథకాల మూలంగా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మహిళాభివృద్ధికి బాటలు పడ్డాయి. ఈ మార్పు పట్టణాలు, నగర ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. 1990లలో వచ్చిన సంస్కరణలు కుటుంబం, వివాహం, కుటుంబ విలువలు, సామాజిక పరివర్తన తదితర అంశాలపై ప్రభావం చూపాయి. అప్పటిదాకా కేవలం ఒక ప్రాంతం, కులం, మతం, ప్రదేశానికి పరిమితమైన వివాహం ఈ సంస్కరణల మూలంగా ప్రపంచీకరణకు లోనయింది. కులాంతర, మతాంతర వివాహాల సంఖ్య క్రమేణా పెరగసాగింది. విదేశాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన వంటి కారణాలతో- అమ్మాయి పెళ్లిని సత్వరమే చేసెయ్యాలనే ఆలోచనా విధానం తగ్గింది. ఇలాంటి కారణాలతో అమ్మాయిల పెళ్లి వయసు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రేమ వివాహాల ఆమోదం, భాగస్వామి ఎంపికలో స్వేచ్ఛ వంటి పరిణామాలు ఈ పరంపరలో వచ్చిన మార్పులే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మహిళల వివాహ వయసు పెంపుదల యోచనను మగువ సాధికారత, లింగ సమానత్వాలు సాధించే దిశగా మరో ముందడుగుగా భావించాలి.

సాధికారత నినాదం కాకూడదు

అమ్మాయిల వివాహ వయసు నిర్ధారణపై భిన్నవాదనలున్నాయి. పలు కారణాలరీత్యా న్యాయస్థానాలూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. అందుకని ఇలాంటి విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా, వివిధ మతాల పెద్దలు, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు సాగించాలి. ఆయా మతాల కట్టుబాట్లు, వివిధ వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులు, విభిన్న నేపథ్యాలను పరిగణనలోకి తీసుకొని ఓ నిర్దిష్ట నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మహిళా సాధికారత ఒక నినాదంలా కాకుండా వారికి కేటాయించిన అన్ని అవకాశాలను వినియోగించుకునేలా తోడ్పాటునివ్వాలి. ఆడపిల్ల అంటే ఆర్థిక భారంగా పరిగణించే పరిస్థితుల్లో... వివాహ వయసు పెంపుదల తల్లిదండ్రులకు భారంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. తోడ్పాటు కోసం తగిన పథకాలనూ ప్రవేశపెట్టి భరోసా కల్పించాలి. వివాహమనేది ఆర్థిక బంధంతో కాకుండా సామాజిక బంధంతో ముడివడి ఉందనే భావనను ప్రజల్లో నెలకొల్పాలి. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని సుసాధ్యం చేయడం వారి అభివృద్ధికి ఊతాన్నిస్తుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా ముందు సామాజిక కట్టుబాట్లు మారాలి. పితృస్వామిక ఆలోచనా విధానాన్ని వీడి, కాలానుగుణంగా వ్యవహార సరళిని మార్చుకోవాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యం.

-డాక్టర్‌ రమేష్‌ బుద్దార (మధ్యప్రదేశ్‌లోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)

ABOUT THE AUTHOR

...view details