ఎందుకండీ నవ్వుతున్నారు? ఓహో.. అన్నాడీఎంకే ప్రకటించిన 'ఓటుకు వాషింగ్ మెషిన్' పథకం గురించా? ఏముంది ఇందులో అంతలా నవ్వుకోవడానికి? కారు కొంటే ఫ్రిజ్ ఉచితం.. ఫ్రిజ్ కొంటే జ్యూసర్ ఉచితమంటున్నప్పుడు- ఓటేస్తే వాషింగ్ మెషిన్ ఉచితమంటే తప్పేముంది? అంటే... వ్యాపారానికో నిబంధన, రాజకీయానికో నియమమా? ఇదెక్కడి అన్యాయమండీ! అసలు వ్యాపారస్తులతో పోలిస్తే రాజకీయ నాయకులు ఎందులో తక్కువ? కొనుగోలుదారులకు గరికో పరకో ఉచితంగా ఇచ్చేవారి కంటే.. ఎదురు కట్నాలిచ్చి మరీ ఓట్లు కొనుక్కునే వాళ్లెంత గొప్పవారు! ఆ ధర్మప్రభువుల దయాగుణానికి దండం పెట్టాల్సింది పోయి- పరిహాసాలు చేయడం మర్యాదస్తుల లక్షణమేనా?
ప్రజాసేవలో పండిపోయిన పెద్దల దృష్టిలో ఎన్నికల హామీలంటే... హల్వా పళ్లాలే! మేనిఫెస్టో రూపకల్పన అంటే హల్వా వండటమే! దినుసులన్నీ సరిగ్గా పడి రుచి కుదిరిందా.. ఓట్లు వరదలై పారతాయి. ఓటర్లతో లొట్టలేయించి వారిని బుట్టలో వేసుకునే ఈ హల్వా మేనిఫెస్టోలే మన ప్రజాస్వామ్య కీర్తికిరీటంలో కలికితురాళ్లు! వీటి తయారీలో చెయ్యితిరిగిన మన పార్టీల ప్రతిభ ముందు పిట్టలదొరలూ దిగదుడుపే!.
'అమ్మ' దయతో కుర్చీలెక్కి...
ఎన్నికల పండగను పురస్కరించుకుని ఓటర్లకు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించడంలో తమిళనాడు నాయక నలభీములతో పోటీపడేవారే లేరు. కలర్ టీవీలు, ల్యాప్‌టాప్‌లతో మొదలైన వారి వడ్డన ఇప్పుడు ఇంటింటికీ వాషింగ్ మెషిన్లు, ఉచిత డేటాల వరకు వచ్చింది. 'అమ్మ' దయతో కుర్చీలెక్కిన అధికారపక్ష 'అన్నలు' ఈసారి ఆడపడుచులకు పుట్టింటి కట్నంగా వాషింగ్ మెషిన్లు కొనిస్తామంటున్నారు. ఏడాదికి ఆరు ఉచిత గ్యాసుబండలతో పాటు సోలార్ స్టవ్‌లనూ ఇంటికి పంపిస్తామంటున్నారు. వీటన్నింటికీ మించి ఏకంగా బంగారమే పెడతామంటున్నారు. ఎంత మంచి అన్నయ్యలు! ఇలా చెమటోడ్చి మరీ రాష్ట్రం అప్పులను ఆరు లక్షల కోట్ల దాకా తీసుకొచ్చిన వారు, కావాలంటే ఇంకో అరవై లక్షల కోట్ల అప్పులు చేసైనా సరే- ఈ పెట్టుపోతల్లో ఏ లోటూ రానివ్వరు!
అధికారపక్షమేనా అన్నీ పెట్టేదీ... మేమూ పులిహోర కలపగలమంటూ రంగంలోకి దిగింది ప్రతిపక్ష డీఎంకే. ఏకంగా అయిదొందల హామీలతో 'ఫ్యామిలీ ప్యాక్' ప్రకటించింది. వాటిలో ముఖ్యమైంది... గృహిణులకు నెలకు వెయ్యి రూపాయలిస్తామన్న వాగ్దానం! దీన్ని చూడగానే 'లోకనాయకుడి' పార్టీ లబోదిబోమంది. ఈ 'రెసిపీ' మీద పేటెంట్ హక్కులు మావే... మీ పేరెలా వేసుకుంటారంటూ వెర్రి ఆవేశం తెచ్చుకుంది. నిజానికి కమలహాసనుడు ఉదారంగా ప్రసాదించిన వరమేమిటంటే... వారి పార్టీ అధికారంలోకి వస్తే గృహిణులకు జీతమిస్తారట! ఎన్ని పని గంటలకు ఎంత వేతనమన్నది వారు చెప్పలేదు. అన్నట్టు జీతభత్యాలనగానే హాజరుపట్టికలు తప్పనిసరి కదా! అంటే గృహిణులందరికీ బయోమెట్రిక్ ఐడెంటిటీ కార్డులిస్తారో ఏమిటో మరి! ఇలాంటి సృజనాత్మక హామీలకు మరికొన్ని కలిపితే బాగుండేది. చంటిపిల్లలకు చంద్రమండలం మీద ఉయ్యాలలు కట్టిస్తాం, సకుటుంబ పరివార సమేతంగా అంతరిక్ష యాత్రలకు పంపిస్తాం లాంటివి ఏవైనా ప్రకటించాల్సింది. ఇంకా కొత్తగా ఉండేది!! కనీసం మధ్యతరగతి వారికి 'సులభ వాయిదాల్లో సొంత విమానాలు' అనైనా చెప్పి ఉండాల్సింది. హల్వా రుచీ అమోఘంగా ఉందని చెప్పుకొనేవారందరూ!!