దేశీయ వస్తువులను విరివిగా వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు తరచూ పిలుపిస్తున్నారు. దీనివల్ల స్వయంసమృద్ధి (ఆత్మనిర్భర్) దిశగా పెద్ద ముందడుగు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఇప్పుడు పండగల సీజన్ నడుస్తోంది. దసరాతో మొదలైన కొనుగోళ్ల సందడి సంక్రాంతి వరకు కొనసాగుతుంది. కేవలం హిందువులకే కాకుండా ముస్లిములు (ఈద్), క్రైస్తవులు (క్రిస్మస్), సిక్కులు (గురునానక్ జయంతి)... విభిన్న మతాల ప్రజలు పర్వదినాలను వేడుకగా జరుపుకొనే ఈ తరుణంలో ప్రధాని పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని పిలుపును ఎవరూ తప్పు పట్టలేరు. ఎందుకంటే, భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి- అంతర్గత వినియోగం మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. చైనా ఇతర ఆగ్నేయ ఆసియా దేశాల్లా మనది ఎగుమతుల ఆధారిత వ్యవస్థ కాదు. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) మొత్తంలో అంతర్గత వినియోగమే 60 శాతాన్ని మించుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొవిడ్ కోరల్లో విలవిల్లాడుతున్న సమయంలో, రెండో ప్రపంచ యుద్ధం దరిమిలా ఎన్నడూ ఎరగని రీతిలో సరఫరా గొలుసు వ్యవస్థలు విచ్ఛిన్నమై వాణిజ్యం విఫలమైన తరుణంలో ఆర్థిక పునరుత్తేజానికి అంతర్గత వినియోగం ఎంతోకీలకం.
కొనుగోళ్లతో పునరుజ్జీవం
ఈ నాలుగు నెలల పండగల పరంపర ఎన్నో వ్యాపారాలకు అమ్మకాలపరంగా కీలకమైన కాలం. కొత్త వస్త్రాలు, ఎలెక్ట్రానిక్ ఉపకరణాలు, మిఠాయిలు తదితర ఆహార ఉత్పత్తులు, బహుమతులు, ఇత్యాదులు ఇంటిల్లపాది షాపింగ్ జాబితాలో ప్రాధాన్య వస్తువులు. కార్పొరేట్ సంస్థలు బహుమతుల కొనుగోళ్లతో విక్రయాలకు ఊతమిస్తాయి. వ్యాపార సంస్థలకు ఏడాది మొత్తం ఆదాయంలో 25 నుంచి 60 శాతం వరకు ఈ స్వల్ప వ్యవధిలోనే సమకూరుతుంది. గత ఏడాది సెప్టెంబరు- అక్టోబరు మధ్య నెల రోజుల పండగ సీజనులో నమోదైన ఆన్‌లైన్ విక్రయాలే రమారమి రూ.45 వేల కోట్లు ఉన్నాయి.
మొత్తం చిల్లర విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా ఆరు శాతం మించదు కాబట్టి- మొత్తంగా దేశీయ చిల్లర అమ్మకాలు ఏడాదికంతా కలిపి ఎంతటి భారీ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మాత్రం కొవిడ్ మహమ్మారి పుణ్యమా అంటూ చిల్లర విక్రయాలు 2020లో 1.9శాతం మేర క్షీణిస్తాయని తాజా అంచనా. కొవిడ్‌కన్నా ముందటి కాలంతో పోలిస్తే, దేశంలోని 44 కోట్ల మంది శ్రామిక జనాభాలో సుమారు రెండు శాతం మందికి ఉద్యోగాలు దొరకలేదని సీఎంఐఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఏడు శాతం సాధారణ నిరుద్యోగులకు వీరు అదనం. వేతన ఉద్యోగాలు 2018-19తో పోలిస్తే 2019-20లో రెండు శాతం హరించుకుపోయాయి.
షాపింగ్ పెరిగితే..
కొనుగోళ్ల గిరాకీ పెరగడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొంటాయి. కొనుగోళ్లు పెరిగితే పన్నుల వసూళ్లూ పెరుగుతాయి. ప్రభుత్వం ఆయా పథకాలపై అధిక వ్యయం చేయగలుగుతుంది. ఈ నిధులు ఆర్థిక వ్యవస్థలో మరింత గిరాకీ పెరగడానికి దారితీస్తాయి. పండగల షాపింగు అంటే వస్త్రాలు, దీపాలంకరణ సామగ్రి, తినుబండారాలు వంటి వస్తుసేవల కొనుగోళ్లు పెరగడమే. వీటిలో చాలా వరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) సరఫరా చేస్తాయి. ఈ అసంఘటిత రంగంలో నెలకొని ఉన్న 6.3 కోట్ల సూక్ష్మ సంస్థలు... 3.5 లక్షల చిన్న యూనిట్లు, అయిదు వేల మధ్యతరహా సంస్థలు సేవల పరంగా స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)కి 25శాతం, తయారీ వైపు నుంచి 33శాతం సమకూరుస్తూ, 12కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కాబట్టే వినియోగం పెరిగితే ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. జనం చేతికి డబ్బు వస్తుంది. మరే ప్రభుత్వ వ్యయం కూడా ఇంత వేగంగా నిధులను అందించలేదు.