దేశానికి స్వాతంత్య్రం లభించాక ఏడున్నర దశాబ్దాల తరవాతా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ(షెడ్యూల్డ్ కులాలు తెగ)ల ప్రాతినిధ్యం తక్కువగానే ఉందని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తాజాగా నివేదించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు వివిధ ఉద్యోగాల్లో తగినన్ని గ్రూప్-ఎ కొలువుల్లో కుదురుకోవడానికి సుప్రీంకోర్టే ప్రతిపాదనలు రూపొందించాలన్న ప్రభుత్వ అభ్యర్థన విస్మయపరుస్తోంది! పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి అస్పష్టతను తొలగించాలని కోరుతూ కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలూ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
సమగ్ర సమాచారం కాదు..
పదోన్నతుల్లో కోటాలను ఎలా సమర్థించుకుంటారన్న న్యాయస్థానం సూటిప్రశ్నకు స్పందనగా కేంద్రం సమర్పించిన గణాంకాలు ఎన్నో శంకలు లేవనెత్తుతున్నాయి. సర్వే చేసిన మేరకు 19 మంత్రిత్వశాఖల సిబ్బందిలో ఎస్సీల ప్రాతినిధ్యం 15.34 శాతమని, ఎస్టీలు 6.18 శాతమని, ఓబీసీలు 17.5 శాతందాకా ఉన్నారంటూనే- ఇది సమగ్ర సమాచారం కాదని అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్ సింగ్ చెబుతున్నారు. భారత జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 16.6 శాతమని, షెడ్యూల్డ్ తెగలవారు 8.6 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నా- జన సంఖ్యకు అనుగుణంగా ఉపప్రణాళిక కింద పథకాల అమలు, నిర్ణీత కేటాయింపులు రాష్ట్రాల్లో దస్త్రాలకే పరిమితమవుతుండటం బహిరంగ రహస్యం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలూ అదే బాపతుగా సర్కారీ నివేదిక ధ్రువీకరిస్తోంది. ఇందుకు దశాబ్దాలుగా కేంద్రంలో చక్రం తిప్పిన ప్రభుత్వాల ఉమ్మడి వైఫల్యాన్నే వేలెత్తిచూపాలి! నిమ్నవర్గాల బాగుసేత కోసం రాజ్యాంగంలోని వివిధ అధికరణలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా రక్షణలను నిర్దేశిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలను ప్రధాన ఓటుబ్యాంకులుగానే చూస్తున్న ప్రభుత్వాలు వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల మెరుగుదలను పెద్దగా పట్టించుకోనే లేదన్న యథార్థాన్ని- 'సుప్రీం' ఎదుట సర్కారీ ఒప్పుకోలు నిర్ధారిస్తోంది!
ఊతంగా ఉపకరించడమే ముఖ్యోద్దేశం...