దక్షిణ దిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మూడు నెలలపాటు జరిగిన నిరసన ప్రదర్శనలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు- పౌరులు నిరసన తెలపడానికిగల హద్దులు ఏమిటో స్పష్టం చేసింది. ప్రజలు, వాహనాలు నిత్యం తిరిగే రహదారులను నిరసనల పేరిట ఆక్రమించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని ఆ తీర్పు తేటతెల్లం చేసింది. రాజ్యాంగం పౌరులకు నిరసన తెలిపే హక్కును కల్పిస్తున్నా అది నిర్నిబంధ హక్కు కాదనీ తేల్చింది.
ఇకముందు వీధుల్లో రాజకీయ ప్రదర్శనలు, ధర్నాలపై తాజా తీర్పు దీర్ఘకాల ప్రభావం ప్రసరింపజేస్తుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అనిరుద్ధ బోస్, కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు అది.
వాటిపైనా కొన్ని పరిమితులు :
రాజ్యాంగంలోని 19వ అధికరణలోని (1)ఎ సెక్షన్ పౌరులకు వాక్ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తోంది. 19 (1)బి ప్రకారం పౌరులు నిరాయుధులై శాంతియుతంగా ఒకచోట గుమికూడి ప్రదర్శన జరపవచ్చు. రాజ్యాంగానికి ఈ అధికరణ పునాది వంటిదని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను నిరసిస్తూ పౌరులు శాంతియుతంగా గుమిగూడటానికి, ప్రదర్శనలు జరపడానికి ఈ రెండు హక్కులూ అనుమతిస్తున్నాయి. వీటిని ప్రభుత్వం గౌరవించకతప్పదు కానీ, సదరు హక్కులకు కొన్ని సమంజసమైన పరిమితులు ఉన్నాయని తాజా తీర్పు వివరించింది.
రాజ్యాంగం ప్రసాదించిన ప్రతి ప్రాథమిక హక్కును దానికి భిన్నమైన హక్కుతో సమతుల్యపరచాలనీ, ఏ హక్కునూ స్వతంత్రంగా పరిగణించరాదని గతంలో సుప్రీంకోర్టు మరో తీర్పులో పేర్కొంది. నిరసన ప్రదర్శకుల హక్కును ప్రయాణికుల హక్కుతో సమతుల్యపరచాలని, యత్నంగా తాజా తీర్పును చూడాలి.
నిర్దిష్ట ప్రదేశాల్లోనే :
ప్రజాస్వామ్యం, అసమ్మతి చెట్టపట్టాల్‌గా సాగే మాట నిజమే కానీ, అసమ్మతి లేదా నిరసనలను నిర్దిష్ట ప్రదేశాల్లోనే వ్యక్తం చేయాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. షాహీన్ బాగ్ నిరసనలవల్ల రహదారి మూసుకుపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారనేది ఆ కేసు సారాంశం. ఎంతమందైనా ఎక్కడైనా గుమిగూడి నిరసన తెలపవచ్చుననే వాదాన్ని తాము అంగీకరించేది లేదని కోర్టు పేర్కొంది. నడి రోడ్డు మీద నిరసనవల్ల 2019 డిసెంబరు 15 మొదలుకొని దీర్ఘకాలంపాటు కాళిందీ కుంజ్ నుంచి షాహీన్ బాగ్ వరకు రోడ్డు మూసుకుపోయింది. ఇది చాలా ముఖ్యమైన రహదారి అనీ, నిరసనలవల్ల అది మూసుకుపోవటం వల్ల ప్రయాణికులు బాగా ఇబ్బంది పడ్డారంటూ డాక్టర్ నంద్ కిశోర్ గర్గ్ ప్రభృతులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ రోడ్డు అనే కాదు, ఇలాంటి బహిరంగ రహదారులు ఎక్కడ ఉన్నా వాటిపై నిరసన ప్రదర్శనలు జరపరాదని కోర్టు తీర్మానించింది. ఇలాంటి రహదారులపై ఆక్రమణలు, అవరోధాలు ఉండకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించింది.
అప్పటి ప్రభుత్వం వేరే :
స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ ఇలాంటి ప్రదర్శనలు జరిగినా అప్పుడు ఉన్నది వలస ప్రభుత్వమని, ఇప్పుడు ఉన్నది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని గుర్తించాలని పేర్కొంది. మన రాజ్యాంగం పౌరులకు అసమ్మతి, నిరసన తెలిపే హక్కును ప్రసాదించినా, దానితోపాటు కొన్ని బాధ్యతలూ ఇచ్చిందని సుప్రీం కోర్టు ఉద్ఘాటించింది. 1949 నవంబరు 25న రాజ్యాంగ నిర్మాణ సభలో బీఆర్ అంబేడ్కర్ ఈ అంశంపైనే మాట్లాడారు. ఆ రోజునే రాజ్యాంగం ఖరారైంది. రాజ్యాంగాన్ని ఖండించే వర్గాలు రెండే రెండు. ఒకటి- కమ్యూనిస్టు పార్టీ, రెండోది సోషలిస్టు పార్టీ అని అంబేడ్కర్ వివరించారు. కమ్యూనిస్టులకు శ్రామిక వర్గ నియంతృత్వం కావాలి కాబట్టి వారికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఆధారపడిన ప్రస్తుత రాజ్యాంగం నచ్చదు. ఇక సోషలిస్టులు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులన్నింటినీ జాతీయం చేయాలంటారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పరిమితులులేని సంపూర్ణ హక్కులుగా ఉండాలని వారు కోరతారు.
'ఇలాంటి ఉద్యమాలు అరాచకం '
నిరసన పద్ధతుల గురించి సైతం అంబేడ్కర్ మాట్లాడారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో సూచించారు. మొదట మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగసమ్మత మార్గాలను మాత్రమే అనుసరించాలన్నారు. ఇప్పుడు రాజ్యాంగ సమ్మత పద్ధతుల్లో నిరసన తెలపవచ్చు కనుక ఇలాంటి ఉద్యమాలు అరాచకానికి కారణమవుతాయని, వాటికి స్వస్తి చెప్పాలని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు.
2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన శక్తులు ఈ నిరసనలు నిర్వహించి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. నెలల తరబడి అరాచక పరిస్థితిని కొనసాగించే బదులు, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆయా పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించవలసింది. అంబేడ్కర్ సూచించిన రాజ్యాంగ సమ్మత పద్ధతి అది. సుప్రీం కోర్టు తీర్పుతో అవాంఛనీయ నిరసనలకు తెరపడుతుందని ఆశిద్దాం.