'ధర్మం చెయ్ బాబూ, కాణీ ధర్మం చెయ్ బాబూ..'
'ఏంటబ్బాయ్! పొద్దున్నే పాట పాడుకుంటూ వచ్చావు?'
'యాచకుల గురించి మన సుప్రీంకోర్టు- వాళ్లను మేమేమీ అనం. వాళ్లకూ టీకాలు ఇప్పించే ఏర్పాటు చేయండి అని చెప్పింది కదా. దానికి అర్థం ఏమిటి బాబాయ్?'
'అర్థం కాకపోవడానికి అదేమైనా అణు సిద్ధాంతమా? తరచి చూడాలిగానీ, ఆ వృత్తి ఆనవాళ్లు కోకొల్లలు మన మూలాల్లో'
'మొదలుపెట్టావా నీ తిరకాసు మాటల్ని!'
'ఓరి నీ అజ్ఞానాన్ని అడుక్కుతినేవాడు ఎత్తుకెళ్లా! ఆయవారమని ఎంత అందమైన పేరుంది ఆ వృత్తికి! అంతెందుకు- గురుశిష్య పరంపరలో ఉదయాన్నే విద్యగరపి, అపరాహ్నానికి భిక్షాటన ద్వారా లభించే ఆహారంతో జీవనం గడిపేవారురా. పోనుపోను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు, అనేక అవకరాలు అంటుకట్టడంతో, ఆ వృత్తి మీద జనానికి గౌరవం, భక్తి స్థానే అసహ్యం, అనాదరణ పెరిగిపోయాయి'
'నిజమే బాబాయ్'
'తిరిపెమున కిద్దరాండ్రా, గంగ విడుము పార్వతి చాలున్' అని శ్రీనాథుడు ఆక్రోశించినా; 'ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది' అని కవి విరచించినా- అర్థించడంలో ఆ ఆదిశంకరుడే మన లోకానికి మూలం! 'గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఇల్లూ వాకిలి లేనివాడు, బిచ్చమెత్తుకుని తిరిగేవాడు నీ వాడా' అని అడిగితే, 'బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి’ అంటూ జనానికి అర్థమయ్యేటట్టు జానపదంలో చెప్పారు ఓ సినీకవి! అపర శివభక్తుడు రావణబ్రహ్మ సైతం, 'భవతీ భిక్షాందేహి' అని అర్థిస్తేనే కదా.. సీతమ్మ లక్ష్మణరేఖను దాటింది! పాండవులంతటి వాళ్లే తమ ఉనికి తెలియకుండా ఏకచక్రపురంలో భిక్షాటన చేశారు. కాబట్టి అబ్బాయ్, అర్థించడాన్ని అంతలా తీసిపారేయకు'
'ఊరుకో బాబాయ్! నా చెవిలో పువ్వేమైనా కనబడుతోందా? యాచనకు అంత అందం అవసరమా?'
'అవసరమేరా అబ్బాయ్! అచ్చిరాని కాలంలో అడుక్కుతినబోతే ఉన్న బొచ్చె కాస్తా ఊడ్చుకుపోయిందన్నట్టు, అర్థించడానికి సైతం సమయం, సందర్భం, కాలమాన పరిస్థితులన్నీ కలిసిరావాలి. దుర్యోధనుడినే చూడు- శ్రీకృష్ణుడిని అర్థించడానికని వెళ్ళి, దర్జాగా ఆయనగారి తలదగ్గర కూర్చుంటే ఏమైంది? మొదటి అవకాశం కాళ్లదగ్గర కూర్చున్న అర్జునుడికి దక్కింది. తవుడు తింటూ వయ్యారమా అన్నట్టు, అర్థించడానికి వెళ్ళినప్పుడు భేషజానికి పోకూడదు. ఈ విషయంలో మన నాయకులను చూడు, ఎంతలా పండిపోయారో అర్థమవుతుంది'