మానవుడికి, ప్రకృతికి మధ్య జరిగిన ఘర్షణ నుంచి పుట్టినదే సైన్స్. ఇది గొప్ప వైజ్ఞానిక విప్లవానికి బీజం వేసిందనడంలో సందేహం లేదు. విజ్ఞాన శాస్త్ర ఫలాలను అందిపుచ్చుకొన్న భారత్.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు దీటుగా సాగుతున్నా ఇప్పటికీ అనేక రూపాల్లో మూఢ నమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఆచరణలో నిరూపితం కాని అశాస్త్రీయ విశ్వాసాలు. విజ్ఞానశాస్త్ర పరంగా ఎంతో పురోగతి సాధించినా నేటికీ నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమ లాంటివి కనిపిస్తే కొంతమంది ఉలిక్కిపడుతుంటారు. బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, మంత్రాలు వంటి రకరకాల అంధవిశ్వాసాలు పెరుగుతున్నాయి. నరబలులు, జంతుబలులను ఆచరిస్తున్నారు. మెజారిటీ గ్రామీణ, పట్టణ పేద కుటుంబాలతోపాటు విద్యావంతులు సైతం వీటి బారిన పడి మోసపోతున్నారు. ఇవి మానసిక రుగ్మతలకు దారి తీస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో సైతం ఇలాంటి వ్యవహారాలు కొనసాగడం ఆందోళన కలిగించే విషయం.
కరోనా దేవికి పూజలు..
డిజిటల్ భారత్‌లో ప్రస్తుతం కరోనా సంక్షోభంలో సైతం పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో అనేక అంధ విశ్వాసాలు, వదంతులు వెలుగు చూశాయి. లాక్‌డౌన్ వేళ కరోనా నియంత్రణకు తెలంగాణలో వేపచెట్టుకు నీళ్ల పూజలు, గ్రామ దేవతలకు పూజలు, జనం గుండ్లు కొట్టించుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లో ఒక యువకుడు అమ్మవారికి నాలుకను నైవేద్యంగా సమర్పించిన ఉదంతం మూఢత్వానికి నిదర్శనంగా నిలిచింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బంగ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 'కరోనా దేవి' ఆరాధన, ఒడిశాలో ఓ పూజారి ప్రముఖ దేవాలయంలో నరబలికి పాల్పడటం, తాజాగా ఝార్ఖండ్‌లోని కొడేర్మా జిల్లాలో కరోనా రాకుండా శాంతి పూజల పేరిట 400 గొర్రెలను అమ్మవారి ఆలయంలో బలి ఇచ్చిన సంఘటనలు- మూఢ నమ్మకాల జోరును ధ్రువీకరిస్తున్నాయి. ఒకవైపు ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తుంటే ఇలాంటి మూఢత్వ వదంతులు, నమ్మకాలు ప్రజల్లో ఉదాసీనతను పెంచి వ్యాధి విజృంభణకు కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా- చెవికెక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులకు గ్రామీణులు భూతవైద్యులను ఆశ్రయించే ఆచారం కొనసాగుతుండటం, ఇటీవల అమావాస్య రోజు ఏర్పడిన సూర్యగ్రహణం చుట్టూ అలముకున్న అపోహలు- మూఢనమ్మకాలకు నిదర్శనాలు. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ విశ్వాసాల తీవ్రత పెరుగుతున్న కొద్దీ మంత్రగాళ్ల నెపంతో అనుమానితులను అమానవీయంగా వేధించడం, క్రూరంగా చంపడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇవి శాంతి భద్రతలు, ప్రజారోగ్యానికి పెను సవాలుగా నిలుస్తున్నాయి.
మహిళలే బాధితులు..