దేశంలో సుమారు అయిదు కోట్ల కుటుంబాలు చక్కెర రంగంపై ఆధారపడి ఉన్నాయి. బ్రెజిల్ తరవాత ప్రపంచంలోనే అత్యధికంగా పంచదార ఉత్పత్తి చేస్తున్న భారత్‌లో రైతులకు ఆ తీపి దక్కడం లేదు. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారత్ వాటా దాదాపు 17శాతం. కొన్నేళ్లుగా అటు చక్కెర మిల్లులు, ఇటు చెరకు సాగుదారులు సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొవడం చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, మిల్లులు ఉత్పత్తి చేసిన చక్కెరకు గిరాకీ లేకపోవడమే ఈ సంక్షోభానికి కారణం. చెరకు సాగుదారులు, మిల్లుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనక పోవడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఈ పంట సాగునుంచి రైతులు వైదొలగుతున్నారు.
మనుగడ ప్రశ్నార్థకం...
దేశంలో చక్కెర పరిశ్రమ ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభ పరిస్థితులను చవిచూస్తోంది. చెరకు సాగు, పంచదార ఉత్పత్తి, రికవరీ శాతంలో దేశంలో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చెరకు ఉత్పత్తిలో 80శాతం వాటా ఈ మూడు రాష్ట్రాలదే. 2015-16లో దేశంలో 2.48 కోట్ల టన్నులున్న పంచదార ఉత్పత్తి, 2017-18 నాటికి 3.23 కోట్ల టన్నులకు పెరిగింది. 2019-20 నాటికి ఉత్పత్తి 2.72 కోట్ల టన్నులకు పడిపోయింది. దేశంలో చక్కెర ఏడాది ఆరంభమై రెండు నెలలు దాటినా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎనిమిది మిల్లులు మాత్రమే క్రషింగ్ ఆరంభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 29 మిల్లులుండగా 17 మిల్లులు పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన 12లో ఈసారి గానుగాడేవి తొమ్మిదే. తెలంగాణలో ఈసారి ఏడు మిల్లులే నడవనున్నాయి. దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన చక్కెర మిల్లులు సైతం నష్టాలను భరించలేక మూతపడ్డాయి. పలు చక్కెర మిల్లులు ఆధునికీకరణకు నోచుకోలేదు. నిర్వహణ సామర్థ్యం కొరవడి నష్టాల పాలయ్యాయి.
కేంద్రం మద్దతు ధర ప్రకటించినా..
ఒక టన్ను చెరకు నుంచి 10శాతం రికవరీతో 100 కిలోల పంచదార ఉత్పత్తవుతుంది. చక్కెర రికవరీలో ఉత్తర్ ప్రదేశ్(13శాతం), మహారాష్ట్ర (12శాతం), కర్ణాటక (11శాతం) ముందంజలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది 9-9.5శాతం మించడం లేదు. మరోవైపు, కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు కూడా చెరకు రైతుల్ని నష్టపరుస్తున్నాయి. చెరకుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 10శాతం రికవరీపై క్వింటాకు రూ.285. ఇది 2018-19 నుంచి రూ.275గా ఉంది. జడకట్టే, చెరకు నరికే కూలీల అవసరంతో రైతుకు ఖర్చు పెరిగింది. ప్రభుత్వం ఏటా క్వింటాకు రూ.10 చొప్పున పెంచుతుండటం దారుణం. గతంలో 9.5శాతం రికవరీపై నిర్ణయించే ఈ ధరను మూడేళ్లుగా 10శాతం రికవరీపై ప్రకటిస్తుండటం- పైగా 9.5శాతం కంటే రికవరీ తగ్గితే ధరను క్వింటాకు రూ.270.75గా స్థిరపరచడం వల్ల రైతులకు మరింత నష్టం కలుగుతోంది. కూలీల కొరత ఏర్పడి అదనులో పంటను మిల్లుకు చేర్చకపోతే చెరకులో సుక్రోజ్‌శాతం దిగుబడి తగ్గి రైతులకు నష్టం వాటిల్లుతోంది.
మన మిల్లులకు చక్కెర ఉత్పత్తి ఖర్చులు కిలోకి రూ.37-38 అవుతుంటే- అమ్మకం ధర కిలోకు రూ.31-32గా ఉంటోంది. ఈ నష్టాలన్నీ మిల్లుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నష్టాలను పూడ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీలూ ఇవ్వడం లేదని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో, చక్కెర ఉత్పత్తి కంటే ఇథనాల్ తయారీని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు గతేడాది చక్కెర పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8,000 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచునేందుకు రూ.5,732 కోట్లను కేంద్రం చక్కెర మిల్లులకు రుణంగా అందించింది. వచ్చే పదేళ్లలో 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపాలన్న లక్ష్యంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. తద్వారా ముడిచమురు దిగుమతుల భారాన్ని కాస్తయినా తగ్గించాలనేది కేంద్రం యోచన.