తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక' - వెంకయ్య నాయుడు కథనం

నేతాజీ అఖండ దేశభక్తుడు, అకుంఠిత దీక్షతో భరతమాత దాస్య శృంఖలాలను తెగదెంచే సంకల్పంతో అన్ని రకాల ప్రయత్నాలూ చేశారు. ఇందుకోసం వివిధ దేశాల్లో మద్దతు సైతం కూడగట్టారు. ఆయన పేరు విన్నా, ఆయన ముఖచిత్రం చూసినా ప్రతి భారతీయుడూ నేటికీ ఉత్తేజితులవుతారు. అయితే ఆయన మరణం మాత్రం వివాదాల్లో చిక్కుకోవడం విచారకరం. ఆయన దుర్మరణం పొందకుంటే, దేశ ముఖ చిత్రం మరోలా ఉండేది. ప్రజాస్వామ్య స్వేచ్ఛాభారతం అభివృద్ధి చెందాలంటే మన పౌరుల్లో క్రమశిక్షణ, బాధ్యత, సేవ, దేశభక్తి విలువలను నింపాలని నేతాజీ అభిప్రాయపడ్డారు. ఆయన దృష్టిలో భరతమాత అనే భావన ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం. భారతదేశ శ్రేయస్సు కోసం అనేక భావజాలాలతో పోలిస్తే దేశభక్తి, త్యాగనిరతి ప్రతి భారతీయుడి కర్తవ్యం కావాలని ప్రగాఢంగా విశ్వసించారు.

Subhas Chandra Bose
'నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక'

By

Published : Jan 23, 2021, 5:18 AM IST

రెండు వందల సంవత్సరాల పాటు తమ కబంధ హస్తాల్లో భారత్‌ను బంధించిన బ్రిటిష్‌ పాలకుల్లో అకస్మాత్తుగా 1940లో మన దేశాన్ని పాలించే సామర్థ్యం గురించి సందేహాలు పెరిగాయి. అనతి కాలంలోనే భారత్‌ను వీడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ ఆకస్మిక పరిణామాల వెనక అసలు కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా- కొంతకాలంగా పెద్దయెత్తున జరుగుతున్న పరిశోధనల్లో విలువైన చారిత్రక సమాచారం బయటకు వస్తోంది. 1947 ఆగస్టులో బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశం నుంచి వెళ్ళిపోయేందుకు దారి తీసిన సంఘటనల పరంపర మీద అనేక కొత్త కోణాలు ఆవిష్కృతమయ్యాయి. భారతదేశ స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ సాగించిన పోరాటం కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తిని నింపి, లక్షల మందిని స్వరాజ్య ఉద్యమం వైపు ఆకర్షించడం మనందరికీ తెలిసిందే. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఓ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి, పరాక్రమంతో పోరాడి, బ్రిటిష్‌ వలస వాదులను తరిమికొట్టాలని సంకల్పించిన సంఘటన భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో 1940లలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. మహాత్ముడి అహింసా మార్గం బ్రిటిష్‌ వారిని భయపడేలా చేయగా- నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పరాక్రమ మార్గం బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది.

యువతను ఆకట్టుకున్న పోరు

స్వరాజ్య ఉద్యమ సమయంలో చైతన్యవంతమైన, సాహసోపేతమైన నేతాజీ నాయకత్వం ప్రజలకు, ప్రత్యేకించి యువతకు విశేష స్ఫూర్తిని పంచింది. బలమైన నేతాజీ వ్యక్తిత్వం, ఓ సమున్నత భారతదేశ గతం. ఒక దేశంగా, నాగరిక సమాజంగా, సంస్కృతిగా భారతజాతికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. కులం, మతం, ప్రాంతం, భాష లాంటి గుర్తింపులకు అతీతంగా మొదట మనమంతా భారతీయులమని బోస్‌ గట్టిగా నమ్మారు. నేతాజీకి ఉన్న అపారమైన ప్రజాదరణ, ఆయన తీసుకువచ్చిన ఒత్తిడి, భారతదేశ సమస్యలకు సైనిక పరిష్కారం దిశగా చేసిన నిశ్చయమైన ప్రయత్నాలు బ్రిటిష్‌ పాలకుల్లో మరింత ఆందోళనకు కారణమయ్యాయి. అనేక దశాబ్దాల క్రితం మహాత్ముడు ప్రారంభించిన శాంతియుత, అహింసాయుత పోరాటానికి భిన్నమైన నేతాజీ ఆలోచనలకు, దేశ ప్రజలు ప్రత్యేకించి యువకులు ఆయన వైపు ఆకర్షితులయ్యారు. ఆయనతో కలిసి పోరాటం సాగించేందుకు సిద్ధమయ్యారు.

ఆ సమయంలో ప్రధానంగా వివిధ ప్రావిన్సుల గవర్నర్లు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి వచ్చిన నివేదికల ప్రకారం 1940 మధ్య కాలానికి నేతాజీకి లభించిన విశేషమైన ప్రజాదరణ, దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రశంసలు, సానుభూతి కారణంగా బ్రిటిష్‌ పాలకులు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. వలసవాద శక్తిని సైనికపరంగా తరిమి కొట్టేందుకు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ(ఐఎన్‌ఏ)ని నేతాజీ స్థాపించారు. ఇది అప్పటి బొంబాయిలో నావికాదళ తిరుగుబాటుకు దారి తీసింది. మద్రాస్‌, పూనా సహా కొన్ని సైనిక శిబిరాల్లో, అనేక ఇతర ప్రాంతాల్లో తిరుగుబాట్లకు కారణమైంది. 1945 చివర్లో, 1946 ప్రారంభంలో బ్రిటిష్‌ వైస్రాయ్‌ వావెల్‌కు ఇచ్చిన నివేదికల్లో- ఐఎన్‌ఏను లక్ష్యంగా చేసుకుంటే స్వాతంత్య్ర సమరయోధుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు, భారతసైన్యంలో తిరుగుబాటు మొదలవుతుందని దాదాపు ప్రతి గవర్నర్‌, వైస్రాయ్‌ను హెచ్చరించారు. ఐఎన్‌ఏకు పెరుగుతున్న ప్రజాదరణతో పాటు కలకత్తా సహా ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న కార్యకలాపాల పట్ల అప్రమత్తమైన వైస్రాయ్‌, కింగ్‌ జార్జ్‌-జుఖికి, ప్రధానమంత్రి క్లెమెంట్‌ అట్లీకి పరిస్థితిని తెలియజేశారు. ప్రస్తుతం సాధారణ స్థితిలో ఉన్నట్లు కనిపించినప్పటికీ, ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ, ఈ చారిత్రక అంశాల మీద పరిశోధన చేసిన కల్యాణ్‌ కుమార్‌- 'నేతాజీ, ఐఎన్‌ఏ' గురించి రాసిన తన పుస్తకంలో తెలియజేశారు.

నేతాజీ ప్రేరణతో సంఘటితమైన భారత సైనికుల పరాక్రమాన్ని ఎదుర్కోవలసి వస్తుందన్న భయం బ్రిటిష్‌ పాలకుల మీద ఎంతగా ప్రభావం చూపిందంటే, ముగ్గురు ప్రముఖ ఐఎన్‌ఏ సైనికులైన ప్రేమ్‌ కుమార్‌ సెహగల్‌, గుర్బక్‌ సింగ్‌ థిల్లాన్‌, షా నవాజ్‌ ఖాన్‌లకు కోర్టు విధించిన జీవితఖైదును రద్దు చేసే దిశగా బ్రిటిష్‌ వారు ఒత్తిడి తీసుకొచ్చారు. 1946 ఫిబ్రవరి 12న జనరల్‌ సి.జె.ఆచిన్‌ లెక్‌ ఆర్మీ కమాండర్లకు రాసిన పూర్తి వ్యక్తిగతమైన రహస్య లేఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిలో వారి శిక్షను రద్దు చేయడానికి ప్రేరేపించిన కారణాల గురించి తెలియజేశారు. 1945 నవంబర్‌ 26న వేవెల్‌కు సెంట్రల్‌ ప్రావిన్సు గవర్నర్‌ ట్వినమ్‌ రాసిన రహస్య లేఖ కూడా ఈ చారిత్రక రికార్డుల్లో ఉంది. తమ వైపు కేవలం ముగ్గురు జ్యుడీషియల్‌ అధికారులు సహా 17 మంది యూరోపియన్‌ అధికారులు, భారత పోలీసుల్లో 19 మంది యూరోపియన్‌ సభ్యులు (36 మందిలో) మాత్రమే ఉన్నారని, ఈ బలంతోనే లక్ష చదరపు మైళ్ల విస్తీర్ణంలోని 1.80కోట్ల జనాభా నిర్వహణ జరగాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఈ బ్రిటిష్‌ గవర్నర్‌ ఇచ్చిన గణాంకాలు భారతదేశంలో బ్రిటిష్‌ వలస పాలన వెనక ఉన్న అనేక ఆశ్చర్యకరమైన వాస్తవాలను కళ్లకు కడతాయి. కొద్దిమంది యూరోపియన్లు తమపై అధికారం చలాయించేందుకు, కోట్లాది భారతీయులు ఎలా అనుమతించారనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి కారణం కేవలం ఐక్యత, ఆత్మవిశ్వాసం లేకపోవడమనేది నిర్వివాదాంశం. ఇదే వలస పాలకులు భారతదేశం మీద అధికారం చెలాయించడానికి దారి తీసింది. ఈ దిశగా పరిశోధకులు మరింత దృష్టి కేంద్రీకరించి, నిజానిజాలు తెలుసుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేయాలి.

స్ఫూర్తి నింపే 'సిద్ధాంతం'

నేతాజీ అఖండ దేశభక్తుడు, అకుంఠిత దీక్షతో భరతమాత దాస్య శృంఖలాలను తెగదెంచే సంకల్పంతో అన్ని రకాల ప్రయత్నాలూ చేశారు. ఇందుకోసం వివిధ దేశాల్లో మద్దతు సైతం కూడగట్టారు. ఆయన పేరు విన్నా, ఆయన ముఖచిత్రం చూసినా ప్రతి భారతీయుడూ నేటికీ ఉత్తేజితులవుతారు. అయితే ఆయన మరణం మాత్రం వివాదాల్లో చిక్కుకోవడం విచారకరం. ఆయన దుర్మరణం పొందకుంటే, దేశ ముఖ చిత్రం మరోలా ఉండేది. ప్రజాస్వామ్య స్వేచ్ఛాభారతం అభివృద్ధి చెందాలంటే మన పౌరుల్లో క్రమశిక్షణ, బాధ్యత, సేవ, దేశభక్తి విలువలను నింపాలని నేతాజీ అభిప్రాయపడ్డారు. ఆయన దృష్టిలో భరతమాత అనే భావన ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం. భారతదేశ శ్రేయస్సు కోసం అనేక భావజాలాలతో పోలిస్తే దేశభక్తి, త్యాగనిరతి ప్రతి భారతీయుడి కర్తవ్యం కావాలని ప్రగాఢంగా విశ్వసించారు.

నేతాజీయే కాకుండా, ఆయన కాలంలోని అనేక మంది ఇతర నాయకులు సైతం ప్రతి భారతీయుడిలో దాగి ఉన్న సామర్థ్యాలను గుర్తించారు. భారతదేశం స్వరాజ్యాన్ని సాధించేందుకు ధైర్యం, త్యాగనిరతి, ఆత్మవిశ్వాసం, స్వావలంబన శక్తులను మెరుగుపరచే ప్రయత్నాలు చేశారు. స్వాతంత్య్రానంతరం కూడా అదే ప్రేరణతో జాతీయ అభివృద్ధిని కొనసాగిస్తున్నాం. "సిద్ధాంతం కోసం ఒకరు తమ ప్రాణాలను కోల్పోవచ్చు. అయితే, ఆ సిద్ధాంతం, వారి మరణం తరవాత వేల మందిలో స్ఫూర్తిని నింపుతుంది" అన్న నేతాజీ స్ఫూర్తివచనాలు అక్షర సత్యాలు. నేతాజీ నిరుపమాన పరాక్రమం, ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశభక్తి, సేవలను ప్రపంచంతో పాటు ముందు తరాలకు తెలియజేసి, వారిలో ప్రేరణ నింపే సత్సంకల్పంతో ఆయన జయంతి అయిన జనవరి 23ను 'పరాక్రమ దివస్‌'గా నిర్వహించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి ఏడాది నేపథ్యంలో- 'పరాక్రమ దివస్‌' ప్రేరణతో నవ భారత నిర్మాణానికి కృషి చేయాలని యువతకు పిలుపిస్తున్నాను!

- ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details