భారత్, పాక్ సంబంధాలను కశ్మీర్ అంశమో, 370 అధికరణ వ్యవహారమో మొన్నటివరకూ శాసించేవి. ఇప్పుడు సమీకరణలు మారిపోయాయి. సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యాంశంగా మారాయి. కొన్నేళ్లుగా పాక్ ప్రస్తావిస్తున్న అనేక అంశాలు ఒక్కపెట్టున వెనక్కి వెళ్ళిపోయి... సింధు జలాల పంపిణీ ఇప్పుడు ప్రముఖంగా ముందుకు వచ్చింది. ఇరుదేశాలు 1960లో నదీ జలాల న్యాయబద్ధ పంపిణీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకోసం సింధు జల శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. అది ఇప్పటికి 115 పర్యాయాలు సమావేశమైంది. ఇరుపక్షాల సభ్యులతో కూడిన ఈ కమిషన్ కనీసం ఏడాదికి ఒకమారు సమావేశం కావాలన్నది అలిఖిత ఒప్పందం. చివరిసారిగా 2018లో లాహోర్‌లో సమావేశమైన ఈ కమిషన్ ఆ తరవాత మళ్ళీ చర్చలకు కూర్చోలేదు. ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, నియంత్రణ రేఖ వెంబడి చెదురుమదురు కాల్పులు జరగడం, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు కావడం వంటి కారణాలవల్ల ఉభయ దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే తెరవెనక రెండు దేశాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు దౌత్య ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఉభయ దేశాల నడుమ నెల రోజుల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తెరవెనక దౌత్య కృషే కారణం.
కీలకమైన ఒప్పందం..
భారత్, పాకిస్థాన్ అధికారులతో కూడిన శాశ్వత సింధు కమిషన్(పీఐసీ) వార్షిక సమావేశం దిల్లీలో ముగిసింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెలువరించిన ప్రకటన ప్రకారం... భారత్ చేపట్టిన పకాల్‌దల్, దిగువ కల్నాయ్ ప్రాజెక్టుల ఆకృతులపై చర్చలు కొనసాగుతాయి. ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తిగా ఒప్పందంలోని అంశాల ఆధారంగానే జరుగుతున్నట్లు మనదేశం స్పష్టం చేసింది. ప్రతిపాదిత జలవిద్యుత్తు ప్రాజెక్టుల ఆకృతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పాక్ భారత్‌ను కోరగా, ఒప్పందంలోని నిబంధనల మేరకు అవసరమైన సమాచారాన్ని అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సింధునది, దాని ఉపనదులకు సంబంధించిన జల పంపిణీలోని అసమానతల్ని రూపుమాపి, ఉభయ దేశాల మధ్య హేతుబద్ధంగా వాటా పెట్టేందుకు 1960లో కుదిరిన ఒప్పందం దోహద పడింది. దాని ప్రకారం భారత్‌లోని పశ్చిమ ప్రాంతం ద్వారా పాక్‌వైపు ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ జలాల వినియోగంపై పాకిస్థాన్‌కు పూర్తి హక్కులు దఖలుపడ్డాయి. మరోవంక రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాల వినియోగంపై భారత్‌కు సంపూర్ణ అధికారాలు ఏర్పడ్డాయి. భారత్, పాక్‌లతోపాటు ఆ ఒప్పందంపై ప్రపంచబ్యాంకు సైతం సంతకం చేసింది. ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా ఆయా నదులపై నిర్మించే ఏ ప్రాజెక్టుకూ ప్రపంచబ్యాంకు మద్దతు అందించదు. పాకిస్థాన్ వ్యవసాయానికి చీనాబ్, జీలం నదులు ప్రాణాధారం. జమ్ము కశ్మీర్ నుంచి నియంత్రణ రేఖ ద్వారా పాకిస్థాన్‌లో ప్రవేశించే ఈ నదీ జల ప్రవాహానికి భారత్ అడ్డుకట్టలు వేస్తోందన్నది ఇస్లామాబాద్ ప్రధాన ఆరోపణ. జమ్ము ప్రాంతంలో చినాబ్ నదిపై బాగ్లిహార్, పకాల్‌దల్ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై పాకిస్థాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పాక్ వైపునుంచి నేతృత్వం వహిస్తున్న సయ్యద్ మెహర్ అలీ షా, భారత్ తరఫున సారథిగా ఉన్న పీకే సక్సేనాలతో కూడిన నిపుణుల బృందాలు జమ్ము ప్రాంతంలోని దోడ, కిష్ట్‌వార్ జిల్లాల్లో చీనాబ్ నదిపై నిర్మించిన జల విద్యుత్తు ప్రాజెక్టులపైనే తాజా సమావేశంలో చర్చించాయి. వివిధ అభ్యంతరాల కారణంగా, తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు ప్రపంచ బ్యాంకు జోక్యంతో తిరిగి ప్రారంభమయ్యాయి.