దేశంలోని అయిదు అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో అందరిందృష్టీ పశ్చిమ్ బంగా మీదే ఉంది. కానీ కీలక మెలిక అసోంలో ఉంది. దశాబ్దాల తరబడి అసలు తమకు ప్రాతినిధ్యం లేని రాష్ట్రంలో దాదాపు 68 శాతం సీట్లతో ఎన్డీఏ అధికారం చేపట్టడం సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడో 1978-79 సంవత్సరాల మధ్య జనతాపార్టీ ప్రభుత్వం అసోంలో ఉండేది. తరవాత మళ్లీ 2016లోనే భాజపా అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. అసోంలో నెగ్గిన తరవాత ఈశాన్యప్రాంత ప్రజాస్వామ్య కూటమి (నార్త్‌ఈస్ట్ డెమొక్రాటిక్ ఎలయెన్స్-నెడా) పేరుతో ఒక కూటమిని ఏర్పాటుచేసి, దానికి హిమంత బిశ్వశర్మను కన్వీనర్‌గా నియమించారు. అప్పటినుంచి దాదాపు ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ స్వయంగానో, మిత్రపక్షాల సాయంతోనో క్రమంగా అధికారాన్ని భాజపా సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని మిత్రపక్షాలు చేజారడం, తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ లాంటి పార్టీలూ భాజపాను నిలువరించేందుకు అసోంలో రంగప్రవేశం చేస్తుండటం వంటి పరిణామాలు కమలనాథులకు మింగుడుపడేవి కావు. ఈ అడ్డంకులను అధిగమించి మరోసారి అసోంలో అధికారాన్ని భాజపా చేపట్టగలదా?
2016 అసోం అసెంబ్లీ ఎన్నికలలో భాజపా సొంతంగా 60, మిత్రపక్షాలైన అసోం గణపరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లతో కలిపి 86 స్థానాలు గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను తొమ్మిది చోట్ల భాజపా గెలిచింది. దశాబ్దాల పాటు అసోంలో రాజ్యమేలిన కాంగ్రెస్‌పార్టీని కేవలం మూడే స్థానాలకు పరిమితం చేసింది. ఇన్నాళ్లూ అక్కడ కేవలం జాతులకు సంబంధించిన విషయాలే ఎన్నికల ప్రధానాంశాలుగా ఉండగా దాన్ని కాస్తా హిందూ-ముస్లిం, భారతీయ-భారతీయేతర విషయాల మీదకు విజయవంతంగా మళ్లించగలిగింది. ఈసారి ఎన్నికల సమయానికి తమ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ క్రమంగా బలహీనపడటం వల్ల కొత్తగా యూపీపీఎల్‌తో భాజపా జట్టుకట్టింది. బోడో విద్యార్థి నాయకుడైన ప్రమోద్ బోడో ఈ పార్టీని స్థాపించారు. కొన్ని మిత్రపక్షాలు దూరం కావడం, మరికొన్ని చేరువ కావడం లాంటి పరిణామాల మధ్య భాజపా మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటే పర్వాలేదు గానీ, ఓడితే మాత్రం ఈశాన్య రాష్ట్రాల్లో తన పట్టు మొత్తాన్ని కోల్పోతుంది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రగిల్చిన నిరసన మంటలు అసోంలో వ్యాపించినంతగా మరే రాష్ట్రంలోనూ లేవు. సహజంగా, ఈ వివాదంతో భాజపా పీకల్లోతు మునిగిపోవాల్సిందే! కానీ 2020లో జరిగిన బోడోలాండ్ ప్రాంతీయ మండలి (బీటీసీ) ఎన్నికల్లో కొత్త వ్యూహాన్ని అనుసరించింది. మిత్రపక్షమైన బీపీఎఫ్‌ను పక్కన పెట్టి ఐక్య ప్రజావిమోచన పార్టీ (యూపీపీఎల్)తో జట్టుకట్టి గట్టెక్కింది. 40 స్థానాలున్న బీటీసీలో బీపీఎఫ్ 17 స్థానాలు గెలిచి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. యూపీపీఎల్ 12 చోట్ల, భాజపా తొమ్మిది చోట్ల గెలవడం కారణంగా 21 స్థానాలతో ఎన్డీఏ అక్కడ పాగా వేసింది.