విశ్వవ్యాప్తంగా నగరాల్లో నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. భూగర్భ జలం పూర్తిగా అడుగంటిపోయే- 'డే జీరో' ముప్పు పొంచి ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నగరాల్లో భారత్‌కు చెందినవే 30 దాకా ఉన్నాయి. నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సంయుక్త జల నిర్వహణ సూచీ ప్రకారం- హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు 'డే జీరో' స్థితికి అతి చేరువలో ఉన్నాయి. 2019లో చెన్నైలో సంభవించిన తీవ్ర నీటి ఎద్దడి లాక్‌డౌన్ వాతావరణాన్ని తలపించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. సమర్థమైన జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే 2030నాటికి దేశంలోని ప్రధాన నగరాలన్నీ దాహార్తితో అల్లాడుతాయని 'వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)' నివేదిక వెల్లడించింది. నీటి ఒత్తిడి సూచీ ప్రకారం జల సంక్షోభం ముప్పు పొంచి ఉన్న దేశాల్లో భారత్ 46వ స్థానంలో ఉంది.
వ్యవస్థలకు సవాలు
భూగర్భ జలాలు అడుగంటుతూ ఉండటానికి- శరవేగంతో సాగుతున్న పట్టణీకరణ, భారీగా నీటి వినియోగం పెరగడం, వాతావరణ మార్పులు, జలవనరుల విధ్వంసం ముఖ్య కారణాలు. వలసలతో నగరాల్లో జనాభా కిక్కిరిసిపోవడంవల్ల నీటి వినియోగం రెండింతలవుతోందని నీతిఆయోగ్ వెలువరించిన 'సమీకృత నీటి నిర్వహణ సూచీ' వెల్లడించింది. సంవత్సరానికి 1.5శాతం చొప్పున- 1990 నుంచి తలసరి నీటి లభ్యత రేటు పడిపోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లోని నగరాల సగటు జనాభా పెరుగుదల రేటు 49శాతం. 2035నాటికి సుమారు 15 కోట్ల నగర జనాభా నీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. భారీగా పెరుగుతున్న జనాభా నీటి అవసరాలను పరిమిత జల వనరులతో తీర్చగలిగేలా కార్యాచరణను రూపొందించడం పురపాలికల ముందున్న అతి పెద్ద సవాలు. వాతావరణ మార్పుల దుర్బలత్వ సూచీలో మన దేశాన్ని అధిక ముప్పు ఉన్న దేశంగా గుర్తించారు. 2015తో పోలిస్తే 2060 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో అయిదు శాతం మేర వరస నీటి కరవు దినాలు పెరుగుతాయని అధ్యయనాలు చాటుతున్నాయి. రక్షిత మంచి నీటి సదుపాయానికి నోచుకోక, జబ్బుల బారిన పడటంతో దేశంలో ఏటా రెండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. తీవ్ర నీటి కొరతవల్ల జీడీపీకి వాటిల్లుతున్న నష్టం ఏటా ఆరు శాతమని నీతిఆయోగ్ తేల్చింది.
పారిశ్రామిక వ్యర్థాల కారణంగా నగరాల్లోని నీటి వనరులు కాలుష్య కాసారాలుగా మారుతూ ప్రజలను అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. దేశంలో నానాటికీ పెచ్చరిల్లిపోతున్న నీటి సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రత్యేకించిన పథకాలకు రూపకల్పన చేసింది. 2024నాటికి దేశమంతా కుళాయిల ద్వారా మంచి నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకర్షణీయ నగరాల్లో మంచి నీటి సరఫరా మౌలిక వసతుల నిర్మాణం కోసం అమృత్ పథకాన్ని ప్రారంభించింది.
దేశంలో 64శాతం సాగునీటి అవసరాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 85శాతం తాగునీటి అవసరాలకు, 50శాతానికి పైగా పట్టణ అవసరాలకు భూగర్భ జలాలనే విరివిగా వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద భూగర్భజల వినియోగదారు భారతదేశమే. ప్రతి సంవత్సరం సుమారు 25వేల కోట్ల ఘనపు మీటర్లకుపైగా భూగర్భ జలాన్ని విచక్షణారహితంగా తోడేస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం భారీయెత్తున భూగర్భ జలాన్ని వినియోగించడం కూడా నగరాల్లో తీవ్ర నీటి కొరతకు కారణమవుతోంది. బెంగళూరు, దిల్లీ, అహ్మదాబాద్‌లలో 1998-2020 మధ్య భూగర్భజల మట్టాలు 80శాతం పడిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే, తీవ్ర నీటి ఎద్దడికి దారి తీసే ప్రమాదం ఉంది.
ఉరుముతున్న ఎద్దడి