తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా వేళ.. గ్రామాల్లో గరిష్ఠ స్థాయికి నిరుద్యోగం - నిరుద్యోగం

కరోనా కారణంగా గ్రామాల్లో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి పెరిగింది. మే నెల మొదటి వారంలో 7.29శాతం ఉండగా.. రెండో వారానికి 14.34శాతానికి చేరింది. లాక్‌డౌన్​లు, కర్ఫ్యూలతో ఉపాధి లేక చాలామంది తప్పనిసరి స్థితిలో సొంతూళ్ల బాట పట్టడమే గ్రామాల్లో నిరుద్యోగ శాతం నిలువుగా ఎగబాకడానికి కారణం.

unemployment
నిరుద్యోగం

By

Published : May 31, 2021, 8:51 AM IST

గ్రామీణ భారతంలో మే నెల మొదటి వారంలో 7.29శాతంగా ఉన్న నిరుద్యోగం- రెండో వారానికి 14.34శాతానికి పెరిగింది. అంటే ఒక్క వారంలో రెట్టింపయింది. ఇది గత యాభై వారాల గరిష్ఠ స్థాయి అని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం-సీఎంఐఈ ప్రకటించింది. దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలాల్లో నిరుద్యోగమూ ఒకటి. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలతో ఉపాధి లేక చాలామంది తప్పనిసరి స్థితిలో సొంతూళ్ల బాట పట్టడమే గ్రామాల్లో నిరుద్యోగ శాతం నిలువుగా ఎగబాకడానికి కారణం.

వాటిల్లో స్తబ్ధత వల్లే..

పల్లెల్లో సరైన ఆదాయ మార్గాలు లేవు. వ్యవసాయ పనులూ అంతగా సాగడం లేదు. స్వయంఉపాధి దెబ్బతింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా మందగించి సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఏర్పడిన స్తబ్ధత వల్ల నిరుద్యోగిత పెరిగిపోయింది. ఇది మరికొన్ని నెలలపాటు సాగే అవకాశం ఉంది. పల్లెల్లో కరోనాను వేగంగా కట్టడి చేయకపోతే పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉంది. గ్రామీణ నిరుద్యోగం పెరిగి- తద్వారా ఎదురయ్యే గొలుసుకట్టు ప్రభావాలు తీవ్ర ప్రతికూల ప్రభావాలను సృష్టించే ముప్పుంది. ఇప్పటికే దాదాపు 60శాతం పల్లెప్రజలు ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. విత్తనాలు విత్తే, పంట కోసే కాలాల్లోనే ఎక్కువ మందికి పనులు ఉంటాయి. ఏడాది మొత్తంలో సగటున అయిదు నెలలు మాత్రమే గ్రామాల్లో ఉపాధి దొరుకుతుంది. మిగతా ఏడు నెలలూ ఎలాంటి ఆర్థిక ఉత్పత్తి లేకుండానే గడిపేస్తారు. మహమ్మారి వల్ల ఏర్పడే వలసలతో ఉత్పత్తి లేని వినియోగ వ్యయాలు పెరిగి వ్యవసాయ పెట్టుబడుల కోసం ఉంచుకున్న నిధులు కరిగిపోతాయి. ఆర్థికంగా మరింత దయనీయ పరిస్థితులు తలెత్తుతాయి. పల్లెల్లో ఉన్న కొద్దిపాటి పనులకు మానవ వనరుల అందుబాటు పెరగడంతో వేతనాలు తగ్గిపోతాయి. పేదరికం ఎక్కువవుతుంది. దాంతో పౌష్టికాహార లోపంతో గ్రామీణ భారతం అనారోగ్యంతో అల్లాడే పరిస్థితులూ ఎదురవుతాయి.

సొంతూళ్లకు కార్మికులు..


గడచిన ఏడాది ప్రభుత్వాలు మేల్కొనేలోగా ఎంతో నష్టం జరిగింది. కరోనాతో నగరాలు, పట్టణాల్లో తగిన ఆసరా లేక వలస కార్మికులు గ్రామాలకు తరలివెళ్లారు. ఊరి బాట పట్టి ఊపిరి వదిలేసిన వారికి సంబంధించి- కేంద్రం వద్ద ఎలాంటి లెక్కలూ లేవు. వలస కార్మికుల మరణాలపై గత ఫిబ్రవరిలో ఒక శివసేన ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. తమ వద్ద పూర్తి లెక్కలు లేవని, ఇంకా సేకరణ జరుగుతోందని చెప్పారు. మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం ప్రకారం గత లాక్‌డౌన్‌లో కోటీ 23 లక్షలమంది కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లారు. పరిస్థితులు చక్కబడ్డాయనే ధైర్యంతో నాలుగు నెలల క్రితమే మళ్లీ నగరాలకు చేరారు. ఇంతలో మళ్లీ కరోనా విజృంభించడంతో- గత చేదు అనుభవాల భయంతో గ్రామాలకు తిరుగు ప్రయాణం కట్టారు. సకాలంలో టీకాలు అందించలేని దుస్థితి కూడా ఇందుకు మరో కారణం. ఈసారి వెంటనే మళ్లీ పట్టణాలకు తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. గ్రామీణ నిరుద్యోగంపై ప్రభుత్వాలు వేగంగా స్పందించి తగిన చర్యలు చేపట్టకపోతే పల్లెల్లో పరిస్థితులు దిగజారిపోవడంతోపాటు దేశ ప్రగతికి మరింత విఘాతం కలిగే ప్రమాదం ఉంది.

తగ్గిన నిధులు..

గత ఏడాది జూన్‌లో వలస కార్మికుల కోసం కేంద్రం దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో ప్రారంభించిన గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన.. గ్రామాల్లో రూ.39,293 కోట్ల వ్యయంతో 50 కోట్ల 78 లక్షలకు పైగా పనిదినాలను కల్పించింది. ఇది కొంతవరకు ఉపశమనం కలిగించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఖర్చుచేసిన రూ.61,500 కోట్లకు ఇది అదనం. కానీ 2021-22 బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధికి 34శాతం నిధులు తగ్గించారు. గత ఏడాది మొత్తం రూ.1,11,500 కోట్లు ఖర్చు చేస్తే, ఈసారి రూ.73 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. పరిస్థితులు విషమిస్తున్న ప్రస్తుత తరుణంలో మరిన్ని నిధులు కేటాయించి పల్లె ప్రజలకు పనులు కల్పించే చర్యలు చేపట్టాలి. గ్రామీణ అవసరాలకు కావాల్సిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించాలి. ఇళ్లు, తాగునీరు, ప్రాథమిక వైద్యం, విద్య, రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణులకు ఉపాధి కల్పించాలి.

కరోనా ప్రభావంతో గ్రామాల్లో పెరుగుతున్న నిరుద్యోగంపై ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా దేశానికి దీర్ఘకాలం కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించి పల్లెలు నిరుద్యోగం కాటుకు గురి కాకుండా తక్షణమే కాపాడుకోవడానికి సిద్ధం కావాలి.

- ఎమ్మెస్‌

ABOUT THE AUTHOR

...view details