తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆపత్కాలంలోనూ రాజకీయాలేనా.. విచక్షణ ఏది? - దేశంలో కరోనా

దేశంలో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చుతోంది. ఔషధాలు లేక, సరైన వైద్యసేవలు లభించక వేల మంది విగతజీవులుగా మారుతున్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రం మొదలు రాష్ట్రాల వరకు అన్ని చోట్లా కరోనా కల్లోలంపై రాజకీయాలే నడుస్తున్నాయి. మహమ్మారిపై పోరులో ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. రోజువారీ రాజకీయాలను పక్కనపెట్టి, అభిప్రాయ భేదాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఏకమైతేనే ఈ ఘోర విపత్తు నుంచి దేశం వీలైనంత త్వరగా కోలుకుంటుంది.

politics on corona pandemic
ఆపత్కాలంలోనూ ఆగని రాజకీయాలు..

By

Published : May 16, 2021, 6:57 AM IST

గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు తేలుతున్నాయి. కరోనా చికిత్స కోసం వచ్చిన వారిలో కొందరు అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. ఆక్సిజన్‌ అందని అభాగ్యుల ఆర్తనాదాలు రోజూ ప్రతిధ్వనిస్తున్నాయి. ఆసుపత్రి పడకల కోసం జనం పడిగాపులు పడుతున్నారు. అవసరమైన ఆసరా దొరకక ఆక్రందనలు చేస్తున్నారు.

మహమ్మారిపై రాజకీయాలు..

ఔషధాలు లేక, సరైన వైద్యసేవలు లభించక వేల మంది విగతజీవులుగా మారి వల్లకాటికి వరస కడుతున్నారు. శ్మశానాలు హౌస్‌ ఫుల్‌ బోర్డులు పెడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి వయసు మీరడం వల్లో, ప్రమాదాల్లోనో ఆప్తులు మరణించినట్లు వార్తలు తెలిసేవి. ఈ కరోనా విలయంతో వాటిని తరచూ వినాల్సి వస్తోంది. ఇది యుద్ధంకంటే ప్రమాదకరమైన పరిస్థితి. ఈ సమయంలో రాజకీయంగా పరస్పర విమర్శలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎదుటివారి తప్పులెన్నుతూ కూర్చుంటే పరిస్థితులు చక్కబడతాయా? ప్రజలకు ఉపశమనం అందుతుందా? కేంద్రం మొదలు రాష్ట్రాల వరకు అన్ని చోట్లా కరోనా కల్లోలంపై రాజకీయాలే నడుస్తున్నాయి. నాయకులు సున్నితత్వాన్ని, సందర్భోచిత విచక్షణను కోల్పోయారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి!

విపత్తు తీవ్రతపై సరైన శాస్త్రీయ అంచనాలు లేకపోవడం, నిర్లక్ష్యం, ప్రపంచ పరిణామాలను విస్మరించడం, తొందరపాటు విజయోత్సవాలు, రాజకీయ ప్రయోజనాలు వంటి ఎన్నో కారణాలు కలగలిసి ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ఏమాత్రం భరోసా లేని విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అలా అని ఇప్పుడు కారణాలను విశ్లేషిస్తూ, కారకులను విమర్శిస్తూ కాలం గడపటమూ సమంజసం కాదు. తగిన పరిష్కారానికి అందరూ ఏకమై కదలాలి. సాక్షాత్తు సుప్రీంకోర్టు సూచించినట్లు రాష్ట్రాలు రాజకీయాలు వదిలి కేంద్రానికి సహకరించాలి. కేంద్ర నాయకత్వమూ వ్యూహాత్మక మౌనాన్ని వీడి రాజకీయ ఏకీకరణకు చొరవ చూపాలి.

సమగ్ర కార్యాచరణ..

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, నేతలతో సమావేశం నిర్వహించి మూడు ప్రధానమైన సూచనలు చేస్తూ ఆ మధ్య ప్రధానికి లేఖ రాశారు. మళ్ళీ 12 ప్రతిపక్షాలు కలిసి ఇటీవల తొమ్మిది అంశాలతో మరో లేఖను ప్రభుత్వానికి పంపాయి. రోజువారీ ప్రకటనలు మినహా కేంద్ర సర్కారు నుంచి ఇలాంటి వాటికి ఎలాంటి అధికారిక స్పందన ఉండటం లేదు. సోనియా లేఖకు మాత్రం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీపరంగా స్పందించారు. అందులో ఆయన కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోయడమే ప్రధానలక్ష్యంగా పెట్టుకున్నారు. సోనియా సూచనలను సరైన రీతిలో ప్రస్తావించలేదు. వివరణా ఇవ్వలేదు. అసలు ఈ సంక్షోభ సమయంలో అఖిల పక్షం నిర్వహించి, అందరితో కలిసి చర్చించి సమగ్ర కార్యాచరణ రూపొందించుకోవడం దేశానికి తక్షణ అవసరం.

రాజకీయాలను పక్కన పెట్టాలని అధికార, ప్రతిపక్షాల నాయకులు అందరూ అదే పనిగా ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు! ప్రతిపక్షాల సూచనలు, సలహాలు, డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి అనువైన వాటి అమలుకు సిద్ధమవుతున్నట్లు లేదా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు ప్రభుత్వం కనీస సంకేతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. బాధ్యతాయుతమైన జవాబు ఏదీ కేంద్రం నుంచి రానప్పుడు రాజకీయ ఐకమత్యం ఎలా సాధ్యమవుతుంది?

అన్ని నిర్ణయాలు తన సారథ్యంలోనే సాగాలనుకొనే ప్రధాని ఏకపక్ష ధోరణి ఈ విపత్కర పరిస్థితులను ఇంకా సంక్లిష్టం చేస్తోంది. దీనివల్లే ప్రతిపక్షాలు, రాష్ట్రాలు కేంద్రానికి దూరంగా ఉండిపోతున్నాయి. అధికారులూ ప్రభుత్వానికి సరైన మార్గనిర్దేశం చేసే సాహసానికి పూనుకోలేకపోతున్నారు. నాయకత్వ పారదర్శకత లోపించడం సైతం కరోనాను ఎదుర్కోవడంలో భారత్‌ వైఫల్యానికి కారణమని ప్రఖ్యాత అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ పేర్కొనడం గమనార్హం. ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్న సమయంలో తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు పశ్చిమ్‌ బంగలో ఎన్నికల విజయంతో సమాధానం చెప్పాలని ఆశించిన ప్రధాని మోదీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన కాంగ్రెస్‌ అసమర్థత, అంతర్గత విభేదాలతో అంతకంతకూ బలహీనపడిపోతోంది. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన సమయంలో రాజకీయ విమర్శలు చేయడానికే ఆ పార్టీ పరిమితమవుతోంది. దీంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులూ అదే రీతిలో సాగుతున్నాయి. ఇక్కడి నేతలూ పూర్తిగా దిల్లీనే అనుసరిస్తున్నారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ తమను వ్యతిరేకించే వారిపై, ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధించడానికి చూపుతున్న శ్రద్ధ, వేగం ప్రజల ప్రాణాలను రక్షించడంలో ప్రదర్శించడం లేదు!

రాజకీయాలను పక్కనపెట్టి..

ప్రపంచాన్నే రక్షిస్తామని ప్రకటించిన పరిస్థితి నుంచి, ఆ ప్రపంచ దేశాలే మన రక్షణకు వరస కట్టాల్సిన దుస్థితికి భారత్‌ చేరిందనే వాస్తవాన్ని ఇప్పటికైనా అన్ని పార్టీలూ గ్రహించాలి. రాజకీయ లక్ష్యాల కోసం కేంద్రమే టీకాలు ఇస్తుందని రాష్ట్రాలను మొదట నియంత్రించడం- కాదు... సొంతగా కొనుక్కొమ్మని మళ్లీ మాట మార్చడం వంటి అస్థిర విధానాలను వదిలిపెట్టాలి. లాక్‌డౌన్‌ వద్దని ఒకసారి, కావాలని మరోసారి అనడం, సెంట్రల్‌ విస్టా పనులు నిలిపేయాలని, విధాన ప్రణాళికలకు రూపకల్పన చేయకుండా రాజకీయ ప్రచారాలకే మోదీ ప్రభుత్వం పరిమితమవుతోందంటూ పలు రకాల విమర్శలు కురిపించడం వల్ల ఇప్పుడు ప్రజలకు చేకూరే ప్రయోజనమేమీ లేదు. శత్రువులు దండెత్తి వస్తే దేశం మొత్తం ఏకమైనట్లు, కొవిడ్‌ను జయించాలంటే అంతకు మించిన రాజకీయ ఐకమత్యాన్ని ప్రదర్శించాలి. కొవిడ్‌ కట్టడిలో అక్కరకొచ్చే ఏ చిన్న సలహానైనా కేంద్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలి. అలాంటి నిర్మాణాత్మక సూచనలను అందించడానికి ప్రతిపక్షాలూ చొరవ చూపాలి.

అన్ని దేశాలతో కలిసి అన్ని విధాలుగా ఆలోచించి పోరాడితేనే మహమ్మారిని మట్టుపెట్టగలమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటొనీ ఫౌచీ ఆ దేశ సెనేట్‌తో అన్న మాటలు మన దేశానికీ వర్తిస్తాయి. రోజువారీ రాజకీయాలను పక్కనపెట్టి, అభిప్రాయ భేదాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఏకమైతేనే- ఈ ఘోర విపత్తు నుంచి దేశం వీలైనంత త్వరగా కోలుకుంటుంది.

- ఎమ్మెస్

ABOUT THE AUTHOR

...view details