తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నిర్లక్ష్యంతోనే మూడోదశ ప్రమాదం.. జాగ్రత్తలేవి? - 3rd wave of covid in world

కొవిడ్‌ రెండో ఉద్ధృతి ఇంకా పూర్తిగా ముగియలేదని, దేశంలోని చాలా ప్రాంతాలు సమస్య నుంచి బయటపడలేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటుపై జిల్లా స్థాయిలో పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో ప్రజలు గుంపులుగా తిరగటం ఆందోళన కలిగిస్తోంది.

covid third wave
కొవిడ్ మూడోదశ

By

Published : Jun 29, 2021, 6:37 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గిపోతున్నాయంటూ పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. జనం సైతం మామూలుగా బయటికి వస్తూ గుంపులుగా తిరిగేస్తున్నారు. మార్కెట్లు, సంతలు, దుకాణాల్లో రద్దీ కనిపిస్తోంది. వివాహాలకూ పెద్దయెత్తునే హాజరవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా పాక్షిక లాక్‌డౌన్లే అమలవుతున్నాయి. ఇంతకుముందు అసలేమీ జరగనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజంగానే, బయటి పరిస్థితులు పూర్తి సురక్షితంగా మారాయా? దేశవ్యాప్తంగా అన్నిచోట్లా కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గిందా?

ఉత్పరివర్తనాలతో ఆందోళన

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు తగ్గినప్పుడు, పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. పరీక్షలు తగ్గిస్తూ, దాని ఆధారంగా కేసులు తగ్గిపోతున్నాయని భావిస్తే ఆత్మాహత్యా సదృశమే అవుతుంది. కొవిడ్‌ మూడోదశ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు సైతం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం. రెండో దశలో కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తున్నా పరీక్షలు నిర్వహించడాన్ని కొనసాగించాలని ఎయిమ్స్‌ చీఫ్‌ రణదీప్‌ గులేరియా చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా- కొవిడ్‌ రెండో ఉద్ధృతి ఇంకా పూర్తిగా ముగియలేదని, దేశంలోని చాలా ప్రాంతాలు సమస్య నుంచి బయటపడలేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ స్పష్టంచేస్తున్నారు. పాజిటివిటీ రేటుపై జిల్లా స్థాయిలో పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉందని, దీనివల్ల మహమ్మారి వ్యాప్తిని స్థానికంగానే పరిమితం చేస్తూ, మూడో ఉద్ధృతికి అడ్డుకట్ట వేయవచ్చని సూచిస్తున్నారు.

డెల్టా రకం..

పాజిటివిటీ రేటు వరసగా రెండు వారాలు అయిదు శాతానికి దిగువన ఉంటే ఆ ప్రాంతంలో అన్ని కార్యకలాపాలను పునఃప్రారంభించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఇటీవలి గణాంకాల ప్రకారం- దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో వారానికి సంబంధించిన పాజిటివిటీ రేటు అయిదు శాతంకన్నా తక్కువగానే ఉన్నా, మరికొన్ని జిల్లాల్లో అంతకన్నా ఎక్కువగానే ఉంది. పరీక్షల సంఖ్య తగ్గడం వల్ల కూడా పాజిటివిటీ రేటు తక్కువగా కనిపిస్తోందనే వాదనలు లేకపోలేదు. మరోవైపు, ప్రమాదకరంగా భావిస్తున్న డెల్టా రకం వైరస్‌ ఇప్పుడు 85 దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఆందోళనకరమైన వైరస్‌ రకం (వీఓసీ) మనదేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో- నిర్దిష్ట జిల్లాలు, క్లస్టర్లలో తక్షణమే కట్టడి చర్యలు చేపట్టాలని, జనాల్ని గుంపులుగా చేరకుండా చూడాలని, పరీక్షల సంఖ్యను పెంచాలని, కేసులను గుర్తించాలని, టీకాల కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.

ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు

పలుదేశాల్లో ఆంక్షలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, మలేసియా, బంగ్లాదేశ్‌ ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఆఫ్రికాలో డెల్టారకం వైరస్‌ మూడోదశ ఉద్ధృతి ఇప్పటికే భయపెడుతోంది. కొవిడ్‌ మరణాల విషయంలోనూ ప్రభుత్వ యంత్రాంగాల వద్ద సరైన లెక్కలు, అంచనాలు ఉండటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం మృతుల సంఖ్యలో కొద్దిపాటి వ్యత్యాసాలు ఉంటున్నా, ఈ తేడా మనవద్ద మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణాలను నిర్దిష్టంగా లెక్కించకపోవడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర వంటి చోట్ల మొన్నటిదాకా ప్రకటించిన మరణాల సంఖ్యలో పలు సవరణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సవరణల పేరిట కసరత్తుతో వాస్తవిక సంఖ్య మునుపటికన్నా పెరుగుతోంది. అలాంటప్పుడు, మరణాల రేటు తగ్గుతోందని పేర్కొన్న ఆయా గణాంకాల ఆధారంగానే ఆంక్షల్ని సడలించిన క్రమంలో, ఆ నిర్ణయం సరైనదేనా అనే సందేహాలు రాకమానవు.

గతానుభవాలే పాఠాలు

భారత్‌లో రెండోదశ విజృంభించడానికి ఎన్నో కారణాలు తోడయ్యాయి. తొలిదశ తరవాత మార్కెట్లు ముందస్తుగా తెరవడం, ఆంక్షలు ఎత్తివేయడం, పెళ్ళిళ్ల సీజన్‌, మత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నికలు, ప్రయాణాలు పెరగడం, వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యమున్న డెల్టా రకం అవతరించడం, రూపాలు మార్చుకోవడం.. ఇలాంటి ఎన్నో కారణాలతో వైరస్‌ విజృంభించింది. అధిక సామర్థ్యం కలిగిన వైరస్‌ వ్యాప్తికి ఈ తప్పిదాలూ తోడై భారత్‌లో తీవ్రస్థాయి పరిస్థితికి దారితీసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర కార్యక్రమాల ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ స్పష్టంచేస్తున్నారు. తొందరపడి పూర్తిస్థాయిలో ఆంక్షలన్నీ ఎత్తివేసి, అన్ని కార్యకలాపాలకూ అనుమతులు ఇవ్వడం మరింత ప్రమాదకరమని ఇప్పటికే మనకు అనుభవంలోకి వచ్చింది. ఈ క్రమంలో గతంలో ఎదురైన పాఠాలను మరవకుండా, అప్పుడే రెండో ఉద్ధృతి మొత్తంగా ముగిసినట్లు భావించడం తొందరపాటు అవుతుందనే నిపుణుల హెచ్చరికల్ని పెడచెవిన పెడితే, కోరి ముప్పు తెచ్చుకున్నట్లే! ప్రజలు సైతం జాగ్రత్తల్ని విస్మరించి, ఉదాసీనతకు చోటివ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

- శ్రీనివాస్‌ దరెగోన

ఇదీ చదవండి :'చిన్నారులపై కరోనా మూడో దశ ప్రభావం తక్కువే'

ABOUT THE AUTHOR

...view details