తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఉరిశిక్షకు కాలపరీక్ష! - కేసుల పరిష్కరణలో జాప్యం

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన షబ్నమ్​.. స్వాతంత్ర్యానంతరం తొలిసారి ఉరిశిక్షకు గురవుతున్న మహిళ. తన కుటుంబసభ్యులందరినీ దారుణాతిదారుణంగా హతమార్చిన కేసులో షబ్నమ్‌ అనే ఉన్నత విద్యావంతురాలిని ఉరి తీసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లా జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారతావనిలో మరణశిక్షను ఇప్పటికీ అమలుచేయడం ఎంతవరకు సబబన్న వాదన ఉంది. మరణశిక్షను కొనసాగించాలా లేదా రద్దుచేయాలా అన్న అంశంపై న్యాయ కమిషన్‌ గతంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేసింది.

sub feature on capital punishment system in india
ఉరిశిక్షకు కాలపరీక్ష! - కేసుల పరిష్కరణలో జాప్యం

By

Published : Feb 20, 2021, 7:04 AM IST

స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళకు ఉరిశిక్ష అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంతో- తన కుటుంబసభ్యులందరినీ దారుణాతిదారుణంగా హతమార్చిన కేసులో షబ్నమ్‌ అనే ఉన్నత విద్యావంతురాలిని ఉరి తీసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లా జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారు భావిస్తున్నట్లుగా షబ్నమ్‌ను ఉరితీస్తే- అది చరిత్రే అవుతుంది.

2008 ఏప్రిల్‌ 14వ తేదీ రాత్రి పది నెలల చిన్నారి సహా తమ కుటుంబ సభ్యులందరినీ షబ్నమ్‌ హతమార్చినట్లు రుజువైంది. మిగిలినవారందరినీ పీకలు కోసి, పదినెలల మేనల్లుడిని గొంతు పిసికి ఆమె చంపింది. రెండు ఎంఏలు చదివి ఉపాధ్యాయవృత్తిలో ఉన్న షబ్నమ్‌- ఆరోతరగతిలోనే చదువు మానేసిన సలీం అనే వ్యక్తిని ప్రేమించింది. వాళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రియుడితో కలిసి తన తల్లిదండ్రులు, అన్న, వదిన, సోదరి, మేనల్లుడు- ఇలా అందరినీ చంపేసింది. ఆ కేసులో షబ్నంను, ఆమె ప్రియుడిని హత్యలు జరిగిన కొద్దిరోజుల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. వారికి దిగువకోర్టు 2010లో మరణశిక్ష విధించగా, 2015లో సర్వోన్నత న్యాయస్థానం దాన్ని ఖరారు చేసింది. అరెస్టు అయ్యేటప్పటికే గర్భవతి అయిన షబ్నంకు జైల్లోనే కొడుకు పుట్టాడు. తన తల్లికి క్షమాభిక్ష పెట్టాలని అతడు చేసిన విజ్ఞప్తిని రాష్ట్రపతి 2020 జనవరిలో తిరస్కరించారు. రివ్యూ పిటిషన్లనూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో ఆమెకు ఉన్న అన్నిదారులూ మూసుకుపోయాయని మథుర జైలు అధికారులు ఆమెను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఘోరాతి ఘోరమైన నేరాలు చేసినట్లు రుజువైన దోషులకు మరణశిక్ష అమలుచేయడం చాలా దేశాల్లో ఉంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 750 మందిని ఉరితీశారు. పన్నెండు ఏళ్లలోపు వయసున్న బాలికలపై అత్యాచారం జరిగితే, పోక్సో చట్టం కింద దోషులకు మరణశిక్ష విధించవచ్చని పార్లమెంటు చట్ట సవరణ చేసింది. దిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాజెక్టు 39ఏ నివేదిక ప్రకారం 2000 నుంచి 2014 వరకు దిగువ కోర్టులో 1,810 మందికి మరణశిక్ష విధించగా వాటిలో సగానికి పైగా శిక్షలను హైకోర్టులు లేదా సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చాయి. మరో 443 మందిని నిర్దోషులుగా విడుదల చేశాయి. 73 మందికి మాత్రం సుప్రీంకోర్టు సైతం మరణశిక్ష ఖరారుచేసింది. వారిలో చాలామంది దాదాపు దశాబ్దకాలం నుంచి మరణశిక్ష అమలు కోసం వేచిచూస్తున్నారు.


సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నాలుగు ధర్మాసనాలను ఏర్పాటుచేసి, ఒక్కోదాంట్లో ముగ్గురు చొప్పున న్యాయమూర్తులను నియమించి మరణశిక్షలకు సంబంధించిన నేరాల విచారణను త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రయత్నించారు. ఆ ధర్మాసనాలు వరసగా ఆరు వారాల పాటు విచారణలు జరిపాయి. 2016 సంవత్సరం మొత్తమ్మీద కేవలం ఒక్క కేసులోనే మరణశిక్ష విధించగా, 2017లో ఏకంగా ఏడుగురికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. 2018లో దిగువ కోర్టులు ఏకంగా 162 మందిని ఉరితీయాలని తీర్పులిచ్చాయి. హైకోర్టులు మాత్రం వాటిలో 23 మరణశిక్షలనే ఖరారు చేశాయి. ఇప్పటివరకు ఉరిశిక్షలు అమలైన కేసుల్లో సగం వరకు ఉత్తర్‌ప్రదేశ్‌వే ఉండగా, తరవాతి స్థానాల్లో హరియాణా, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి. స్వతంత్ర భారతంలో తొలిసారిగా మహాత్మాగాంధీ హంతకులైన నాథూరాం గాడ్సే, నారాయణ్‌ ఆప్టేలను 1949 నవంబరు 15న హరియాణాలోని అంబాలా జైల్లో ఉరితీశారు.

ప్రస్తుతం మన దేశంలో పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, మోకా చట్టం, నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రాపిక్‌ పదార్థాల నియంత్రణ చట్టం తదితరాల కింద దోషులుగా తేలినవారికి మరణశిక్షలు పడుతున్నాయి. దేశద్రోహం, తిరుగుబాటుకు ప్రజలను రెచ్చగొట్టడం, అబద్ధపు సాక్ష్యంతో నిర్దోషులకు మరణశిక్ష పడేలా చేయడం, ఆత్మహత్యలకు పురిగొల్పడం, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు వంటి నేరాలకు మరణశిక్ష విధించవచ్చు. గడచిన పదిహేనేళ్లుగా చూసుకుంటే, నిర్భయ కేసులో దోషులనే చివరిసారిగా ఉరితీశారు. వారికంటే ముందు యాకూబ్‌ మెమన్‌, అఫ్జల్‌ గురు, అజ్మల్‌ కసబ్‌, ధనుంజొయ్‌ ఛటర్జీలకు మరణశిక్ష అమలుచేశారు.

ఉరిశిక్షల చరిత్ర ఇలా ఉంటే- అసలు ఉరి ఎంతవరకు సరి అన్న చర్చ సైతం దేశంలో గట్టిగానే జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారతావనిలో మరణశిక్షను ఇప్పటికీ అమలుచేయడం ఎంతవరకు సబబన్న వాదన ఉంది. మరణశిక్షను కొనసాగించాలా లేదా రద్దుచేయాలా అన్న అంశంపై న్యాయ కమిషన్‌ గతంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. ప్రపంచంలో 58 దేశాలు మరణశిక్షలను అమలు చేస్తుంటే- 95 దేశాలు దీన్ని తమ శిక్షాస్మృతి నుంచే తొలగించాయి. కొన్ని దేశాల్లో కేవలం యుద్ధనేరాలకే మరణశిక్ష అమలుచేస్తున్నారు. అత్యంత అరుదైన నేరాలుగా వేటిని నిర్వచించాలి? ఎలాంటి నేరాలకు మరణశిక్ష విధించాలి? మరణశిక్షను ఇంకా భారతీయ శిక్షాస్మృతిలో కొనసాగించాలా, వద్దా అన్న విషయాలపై విస్తృతస్థాయి చర్చ జరగాలి. దాని ఆధారంగా చట్టసభల ప్రతినిధులు, న్యాయకోవిదులు అంతా కలిసి ఒక నిర్ణయానికి రావచ్చు. ప్రపంచానికి అనేక విషయాల్లో ఆదర్శప్రాయంగా ఉంటున్న భారతావని- ఈ విషయంలోనూ ముందడుగు వేయాలి.

- పి.రఘురామ్‌

ABOUT THE AUTHOR

...view details