తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆన్​లైన్ విద్యతో.. మసకబారుతున్న సృజన! - ఆన్​లైన్​ బోధనతో విద్యార్థుల సమస్యలు

ఆన్‌లైన్‌ బోధన వల్ల పాఠాలు చదివి మననం చేసుకుని పరీక్షలు రాయాలన్న ధ్యాస విద్యార్థుల్లో క్రమేపీ తగ్గిపోతోంది. గతంలో రోజులో సగం సమయం విద్యాలయంలో గడిపే విద్యార్థులు కేవలం తరగతి గది అభ్యసనే కాకుండా గ్రంథాలయం, క్రీడలు వంటి వాటితో మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ కరవై వారిలో సృజనాత్మకత, పరిశీలన, పరిశోధనా శక్తి కొరవడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

online classes
ఆన్​లైన్ తరగతులతో

By

Published : Aug 17, 2021, 5:26 AM IST

Updated : Aug 17, 2021, 6:50 AM IST

కొవిడ్‌ మహమ్మారి విజృంభించాక ఏడాదిన్నరగా బోధన, అభ్యసన దాదాపు ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు, విద్యా సంస్థలు శూన్య విద్యాసంవత్సరం ఏర్పడకుండా ఆన్‌లైన్‌ బోధన కొనసాగిస్తూ విద్యార్థులను సాంకేతికంగా ఎగువ తరగతులకు నెడుతున్నాయి. పది, పన్నెండు తరగతుల పరీక్షలు జరగకుండానే లక్షలాది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. దీంతో పాఠాలు చదివి మననం చేసుకుని పరీక్షలు రాయాలన్న ధ్యాస విద్యార్థుల్లో క్రమేపీ తగ్గిపోతోంది. సంప్రదాయ తరగతి అభ్యసనకు అలవాటుపడ్డ విద్యార్థులు రోజులో కొంత సమయం గృహాన్ని విడిచి బడి వాతావరణంలోకి వెళ్ళి గురుముఖతః విద్యనభ్యసించి సహచర విద్యార్థుల సాంగత్యంలో ఆట పాటలతో పాఠాలు మననం చేసుకునేవారు. కొంతకాలంగా బోధన-అభ్యసన ప్రక్రియ ఒక్కసారిగా మారిపోవడం, గడప దాటకుండా తెరలపై చదువుకోవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశీలన, పరిశోధనా శక్తి కొరవడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రతికూల ప్రభావం

అరకొర అభ్యసనతో సాగుతున్న ఆన్‌లైన్‌ చదువులు విద్యార్థులందరికీ అందడం లేదు. గతేడాది వార్షిక స్థాయి విద్యా నివేదిక ప్రకారం దేశంలో మూడో వంతు పిల్లలే ఆన్‌లైన్‌ విద్య కొనసాగిస్తున్నారు. భారత్‌లో పదేళ్ల లోపు పిల్లలపై జరిగిన అధ్యయనంలో 10.1శాతమే ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. లాక్‌డౌన్లకు ముందు పిల్లలు స్మార్ట్‌ఫోన్ల జోలికి వస్తే అవి చదువును పాడు చేస్తాయని తల్లిదండ్రులు మందలించేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ బోధన వల్ల ఫోన్లను ఉపయోగించడం పిల్లల హక్కుగా మారిపోయింది. వాటిని చేతికిచ్చాక కార్టూన్లు, వీడియోగేమ్స్‌... ఇలా ఎటువెళతారో తెలియని పరిస్థితి దాపురించింది. గతంలో రోజులో సగం సమయం విద్యాలయంలో గడిపే విద్యార్థులు కేవలం తరగతి గది అభ్యసనే కాకుండా గ్రంథాలయం, క్రీడలు వంటి వాటితో మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ కరవై మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరుణంలో త్వరితగతిన పాఠశాలలు తెరవాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల సూచించింది. కళాశాల విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ తప్ప పాఠ్యాంశాలను నేర్చుకోవడం ఆన్‌లైన్‌లో కొంత అనుకూలంగా ఉన్నా పాఠశాల విద్యార్థులపై అవి ప్రతికూల ప్రభావం చూపుతాయని సర్వేలు తెలియజేస్తున్నాయి.

'ఆన్‌లైన్‌ బోధన, అభ్యసన' అనే భావన పాఠశాల పిల్లలకు అనుకూలంగా ఉండదని జాతీయ విద్యావిధానం-2019 ముసాయిదా కమిటీ అధ్యక్షులు కస్తూరి రంగన్‌ అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష తరగతుల్లో ఉండే ఉల్లాసం, సృజనాత్మకతలు ఆన్‌లైన్‌లో సాధ్యంకావని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎలా బోధించాలి, నూతన విద్యాబోధన విధానాలు ఏమిటనే పరిశీలన మొదలైంది. నిష్ఠ, దీక్ష వంటి వేదికల ద్వారా పాఠశాల స్థాయినుంచి ఇంటర్మీడియట్‌ వరకు శిక్షణ ప్రారంభమైంది. పీఎం ఈ-విద్య, ఈ-పాఠశాల, స్వయం వంటి వేదికలు సైతం ఈ తరహా శిక్షణ కొనసాగిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తరగతి వాతావరణం సృష్టించడం, బోధన కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూడటం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంచడం, సామర్థ్య ఆధారిత అభ్యసనను అందించడం వంటి లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ సంప్రదాయ తరగతి బోధనలోనే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో పెరుగుతాయనుకోవడం అత్యాశే అవుతుంది. కరోనా భయం పూర్తిగా తొలగిన తరవాత సైతం ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం పెరుగుతుందని కొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సులభం కాదు

ఉన్నత విద్యలో ప్రాక్టికల్స్‌ ఆధారిత పాఠ్యాంశాలు లేని కోర్సుల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యను ఆశ్రయించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ ముందు నుంచే సమాచార ప్రసార సాంకేతికత (ఐసీటీ), మ్యాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సుల (మూక్స్‌) ద్వారా కొనసాగుతున్న కోర్సులకు మరింత గిరాకీ పెరుగుతుందన్నది పలువురి భావన. అందుకు సరైన డిజిటల్‌ పాఠ్య పుస్తకాలు అవసరం. బల్గేరియాతో పాటు మరికొన్ని దేశాలు ఇటువంటి ప్రయత్నం ప్రారంభించాయి. ఆన్‌లైన్‌ తరగతుల్లో ఫ్రాన్స్‌, జర్మనీ, చైనాలు ముందంజలో ఉన్నాయి. 25కోట్ల మంది విద్యార్థులు, 8.5కోట్ల మంది అధ్యాపకులు, 15లక్షలకు పైగా పాఠశాలలు ఉన్న ఇండియాలో సంప్రదాయ విద్య నుంచి ఆన్‌లైన్‌ విద్యకు మారడం అంత సులభం కాదు. కరెంటు కోతలు, అంతర్జాల సమస్యలు భారత్‌లో ప్రధాన అవరోధాలు. ఏడాదిన్నర క్రితం ఏడు లక్షల కోట్ల రూపాయలతో 'ప్రతి గ్రామానికి బ్రాడ్‌బ్యాండ్‌ వసతి' అనే నినాదంతో ప్రారంభమైన జాతీయ బ్రాడ్‌బ్యాండ్‌ మిషన్‌ అంత ఆశాజనకంగా సాగడంలేదు. వెయ్యి రోజుల్లో ఆరులక్షల గ్రామాలను ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తామని నిరుడు ఆగస్టులో ప్రధాని చెప్పిన మాటలు ఎంత వరకు నెరవేరతాయో వేచి చూడాల్సిందే. డిజిటల్‌ బోధనపై సరైన పద్ధతులు రూపొందించి ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వడంపై ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీలు దృష్టి పెట్టాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడే బోధన, అభ్యసన గాడిన పడే అవకాశం ఉంది.

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి (అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)

ఇదీ చూడండి:నవతరానికి నాణ్యమైన విద్య అందేనా?

Last Updated : Aug 17, 2021, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details