తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Study time table: ఇంట్లో ఉండి శ్రద్ధగా.. చురుగ్గా చదవలేకపోతున్నారా.? - telangana news

కొవిడ్‌ పరిణామాలు విద్యాభ్యాసం తీరుపై పెను ప్రభావం చూపాయి. విద్యార్థుల పరంగా చూస్తే.. నిత్యం కళాశాలకు వెళ్లటం, పాఠాలు వినటం, ఇంటికొచ్చి వాటిని చదవటం, అసైన్‌మెంట్లు... చిరకాలంగా సాగుతున్న ఈ పద్ధతి ఒక్కసారిగా దెబ్బతింది. క్యాంపస్‌కు వెళ్లే అవకాశం లేదు. తరగతులు ఆన్‌లైన్‌లోనే. పరీక్షలైతే వాయిదాల మీద వాయిదాలు. ఫలితంగా పాఠ్యపుస్తకాలను చదివే ఉత్సాహం, ఆసక్తి తగ్గిపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం లాంటి సమస్యలు పెరిగాయి. వీటిని అధిగమించి అభ్యాసాన్ని సరైన గాడిలో పెట్టాలంటే విద్యార్థులు ఈ మెలకువలు పాటించాల్సిందే.!

students face problems in studying
ఇంట్లో ఉండి శ్రద్ధగా చదవాలంటే

By

Published : Jul 8, 2021, 1:19 PM IST

విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదకర వాతావరణం, తోటి విద్యార్థులతో ఆరోగ్యకరమైన పోటీ, ఆటపాటల్లో చురుకుతనం, అందరితో కలివిడిగా మెలగడం ఇవి ఎవరినైనా సరే జీవితంలో ఉన్నత స్థానాలకు చేర్చే చిట్కాలు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు విద్యార్థులకు అలాంటి అవకాశం దొరకడం లేదు. ఫలితంగా ఇంట్లో అలాంటి వాతావరణం లేకపోవడంతో పుస్తకాలు అటకెక్కాయి. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఇలా ఉంటే కుదరదు.

సరైన గాడిలో పెట్టేదెలా.?

రోషన్‌కు ఇంటర్మీడియట్‌ వరకూ ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్‌ వచ్చేది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమై... టీవీ షోలూ, ఆన్‌లైన్‌లో సినిమాలూ చూడటానికి అలవాటుపడ్డాడు. చదువులో వెనకబడిపోతున్నాననే విషయం అర్థమవుతున్నా ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నాడు.
రమ్య పరిస్థితీ దాదాపుగా ఇంతే. ఇంతకుముందు చదువులో చురుగ్గా ఉండేది. పుస్తకం తీసుకోగానే రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి. కుదురుగా కూర్చుని ప్రశాంతంగా గంటసేపు కూడా చదవలేకపోతోంది. దీంతో ఆమెలో నిరాశా, దిగులూ పెరిగిపోతున్నాయి. మనోజ్‌కు బద్ధకం పెరిగిపోవడంతో చదవటం పక్కనపెట్టేశాడు. అంతే కాదు- ఏ పనీ సమయానికి చేయలేకపోతున్నాడు. గంటల తరబడి సమయాన్ని వృథాగా గడిపేస్తున్నాడు.
వీరు మాత్రమే కాదు- ఇలా ఎంతోమంది విద్యార్థుల దినచర్య ఏడాది కాలంగా కుదుపులకు లోనయింది. చదువులో వెనకబడిపోతున్న ఇలాంటి వారంతా
ఎప్పటిలా శ్రద్ధగా, చురుగ్గా పాఠ్యాంశాలపై దృష్టి పెట్టాలంటే.. కొన్ని మెలకువలను నిపుణులు సూచిస్తున్నారు.

నిర్ణీత సమయం కేటాయించుకోవాలి

విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగడానికి ఒక కారణమంటూ ఉండదు. గంటల తరబడి టీవీ చూడటం, సెల్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడటం, ఆన్‌లైన్‌లో సినిమాలు చూడటం, స్నేహితులతో కబుర్లు చెప్పడం లాంటి వన్నీ మూల కారణాలే. అందుకే ముందుగా చదవడానికి నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో చదువు తప్ప మరో ధ్యాస ఉండకూడదు. మీ దృష్టి మరే ఇతర విషయాల మీదకూ వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
విశ్రాంతి తీసుకోవడానికి నిర్ణీత సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో మీకిష్టమైన పనులన్నీ చేయొచ్చు. టీవీ చూడొచ్చు, సంగీతం వినొచ్చు, స్నేహితులతో కబుర్లు చొప్పొచ్చు. కాసేపు హాయిగా నిద్రపోవచ్చు లేదా మీకిష్టమైన మరేపనైనా చేయొచ్చు.

ముందే చెప్పాలి

చదువుకునే సమయంలో ఏకాగ్రతకు భంగం కలిగించే ఎలాంటి పనులూ చేయొద్దని కుటుంబ సభ్యులకు ముందే చెప్పి ఉంచాలి. టీవీ శబ్దం గట్టిగా పెట్టడం, మీరు చదువుకునేచోట గట్టిగా మాట్లాడటం, అక్కడే అటూ ఇటూ తిరగడం... లాంటి పనులు చేయొద్దని చెప్పేయాలి. అప్పుడే ఆ నిర్దేశిత సమయంలో ఎలాంటి అవాంతరాలూ లేకుండా ఎక్కువ సమయం ప్రశాంతంగా చదువుకోగలుగుతారు.

కాసేపు వ్యాయామం

గంటల తరబడి ఆపకుండా పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. విసుగ్గా అనిపిస్తే మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవాలి. కుర్చీలోంచి లేచి కాస్త అటూ ఇటూ నడవడం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల బద్ధకం లేకుండా శరీరం కాస్త చురుగ్గా ఉంటుంది. మరీ ఆకలిగా ఉంటే స్నాక్న్‌ లాంటివి తీసుకుని తిరిగి చదవడం మొదలుపెట్టాలి.

అలా చదవాలి

చదవాలనుకున్న సబ్జెక్టులను ప్రణాళికాబద్ధంగా చదవడానికి ప్రయత్నిస్తే ఎంతో సులువు అవుతుంది. పైకి చదవడం మంచి పద్ధతి. చదువుతున్నప్పుడు మీ గొంతు మీకు స్పష్టంగా వినిపించాలి. ఒక విషయాన్ని అర్థమయ్యేట్టుగా మీకు మీరే వివరించుకోవాలి. మార్కర్లను దగ్గర పెట్టుకుని పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన పాయింట్లను హైలైెట్‌ చేసుకోవాలి.

ఇవి పాటించండి!

> వాయిదా పద్ధతి వద్దు: పాఠ్యపుస్తకాల పఠనానికి మీరు పెట్టుకునే లక్ష్యాలు ఎప్పుడూ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి. కష్టపడకుండానే మొదట్లోనే మన వల్ల కాదని చేతులెత్తేయకూడదు. కేటాయించిన అసైన్‌మెంట్లను నిర్ణీత సమయం లోపలే పూర్తిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి. ఒకవేళ సాధించే క్రమంలో విఫలమైనా నిరాశపడకుండా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి. ఆ తర్వాత చూద్దామనే ధోరణితో వాయిదా మాత్రం వేయకూడదు. ఈ వాయిదా పద్ధతికి అలవాటు పడితే దాన్నుంచి బయటపడటం కష్టం.

> కొత్త విషయాలపై ఆసక్తి:పరీక్షల కోసమే చదవాలని ఎప్పుడూ అనుకోకూడదు. పరీక్షల తర్వాతా చదవడాన్ని ఆపేయకూడదు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపనతో పుస్తక పఠనాన్ని కొనసాగించాలి. మీ అభిరుచికి తగ్గట్టుగా పుస్తకాలను ఎంచుకుని చదవడాన్ని ఆస్వాదించాలి. ఇలా చేయడం వల్ల మీ పద సంపద పెరుగుతుంది. వ్యాకరణ సామర్థ్యమూ మెరుగవుతుంది. మెదడూ చురుగ్గా పనిచేస్తుంది. దీంతో వివిధ అంశాల మీద సొంతంగా రాసే నైపుణ్యమూ మీకు అలవడుతుంది.

> బహుమతి ఇచ్చుకోవాలి:బాగా కష్టపడి చదివినప్పుడు మీకు మీరు కానుక ఇచ్చుకోవాలి. కరోనా క్లిష్ట పరిస్థితుల సమయంలో ఎలాంటి అవాంతరాలను లెక్కచేయకుండా చదువుతున్నందుకు మీరు నిజంగా బహుమతికి అర్హులే కదా. బహుమతి అంటే.. అది వస్తురూపంలోనే ఉండనవసరం లేదు. మీకిష్టమైన పనులు చేయడం కూడా అలాంటిదే. ఇష్టపడే వంటకాన్ని చక్కగా ఆరగించండి. మీరెంతో అభిమానించే వెబ్‌సిరీస్‌ చూడండి. కాసేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు కూడా. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మీ పనులు చేసుకోవచ్చు.

> సామాజిక సంబంధాలు: తోటి విద్యార్థులు, స్నేహితులతో అప్పుడప్పుడూ మాట్లాడుతుండాలి. వీడియోచాట్స్‌ చేయడం వల్ల ప్రత్యక్షంగా కలిసిన అనుభూతీ కలుగుతుంది. ముందుగా పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వాటి గురించి చర్చించాలి. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలు, ఇతర విషయాలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మనసు తేలికపడుతుంది. ఎవరితోనూ కలవకుండా, మాట్లాడకుండా ఉండటం వల్ల ఒంటరితనం పెరుగుతుంది. రోజూ కొంత సమయాన్ని స్నేహితులకు కేటాయించడం వల్ల మానసికానందాన్ని సొంతం చేసుకోవచ్చు. వాళ్లిచ్చే సూచనలు, సలహాలతో చదువులో మరింతగా రాణించొచ్చు.

> ఆరోగ్యం ఎంతో ముఖ్యం: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంతో ఉండటం ఎంతో అవసరం. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం తీసుకోవాలి. శరీరానికి రోజూ వ్యాయామం ఉండాలి. అంటే కసరత్తులే చేయనవసరం లేదు. ఆడుకోవచ్చు లేదా ఇష్టమైన డ్యాన్స్‌నూ సాధన చేయొచ్చు. ఆన్‌లైన్‌ వేదికగానూ వీటిని నేర్చుకోవచ్చు. ఇష్టమైన వ్యాయామాలను ఎంచుకోవడం వల్ల చదువులోనూ చురుగ్గా ఉంటారు. అలాగే మానసికారోగ్యాన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. దానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం ఎంతగానో తోడ్పడతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేవారు సాధించాలనుకున్న లక్ష్యాల మీద దృష్టిని కేంద్రీకరించగలుగుతారు.

నిపుణులు ఏమంటున్నారంటే...

ఉదయాన్నే నిద్ర లేవాలి:జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారందరికీ దాదాపుగా ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉంటుంది. మీరు కూడా ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. లేచిన వెంటనే పక్క బట్టలను చిందరవందరగా అలాగే వదిలేయకుండా చక్కగా సర్దుకోవాలి. ఆ తర్వాత కాసేపు తేలికపాటి వ్యాయామాలు చేసి రోజువారీ కార్యక్రమాల కోసం సిద్ధం కావాలి.

ప్రత్యేక స్థలం: అవాంతరాలు లేకుండా చదువుకోవడం కోసం ఇంట్లోనే ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించుకోవాలి. అక్కడ గాలీ, వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఆ ప్రాంతాన్ని చదువుకోవడానికి అనువుగా అలంకరించాలి. క్యాలెండర్, టైమ్‌ టేబుల్, చక్కని కొటేషన్లను కంటికి కనిపించేలా అమర్చుకోవాలి. ఇవి ప్రేరణను కలిగించి, ఉత్సాహంగా చదువుకునేలా చేస్తాయి. తగినంత వెలుతురు ఉండేలా చూసుకుంటే కళ్లు త్వరగా అలసిపోకుండా ఉంటాయి. కూర్చోవడానికి సౌకర్యంగా ఉండే కుర్చీని ఎంచుకోవాలి. మంచం మీద కూర్చునో, పడుకునే భంగిమలోనో ఎప్పుడూ చదవకూడదు.

వృథాను గుర్తించాలి: ఎక్కడెక్కడ సమయం వృథా అవుతుందో గుర్తించాలి. సోషల్‌ మీడియా, వీడియో గేమ్స్, టీవీ చూడటం లేదా ఏమీ చేయకుండా బద్ధకంగా అలా కూర్చోవడం... వీటన్నింటి వల్లా సమయం వృథా అవుతుంది. చదువుకునే సమయంలో సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయాలి. మధ్యలో విరామం తీసుకున్నప్పుడు మాత్రమే సెల్‌ఫోన్‌ను వినియోగించాలి. ప్రముఖుల జీవిత చరిత్రలు, స్ఫూర్తిదాయక పుస్తకాలు చదవాలి.
పక్కా టైమ్‌ టేబుల్‌: అన్ని సబ్జెక్టులూ కవరయ్యేలా టైమ్‌ టేబుల్‌ను రూపొందించుకుని కనిపించేలా గోడకు అంటించుకోవాలి. సబ్జెక్టులన్నీ చదువుతున్నారో లేదో దాన్ని చూడగానే అర్థమవుతుంది. చదివిన దాన్ని చూడకుండా రాయడమూ అలవాటు చేసుకోవాలి. ఎంత ఎక్కువగా రాయడాన్ని సాధన చేస్తే అంత మంచిది.

నోట్సు రాయాలి: నేర్చుకునే ప్రక్రియలో భాగంగా నోట్సు రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. నిజానికి నోట్సు రాయడమనేది ఓ కళ. క్లాసు జరిగేటప్పుడు లేదా సొంతంగా చదువుకునేటప్పుడు నోట్సు రాసుకోవాలి. ఇలా చేస్తే నేర్చుకున్న విషయాలు ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి.

తగినంత విశ్రాంతి:తగినంత నిద్రపోతున్న విద్యార్థుల్లో... ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉన్నట్టు, వారి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగైనట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి 8-10 గంటలపాటు నిద్రపోవాలి. ఇలా విశ్రాంతి తీసుకుంటే.. చదువుపై దృష్టిసారించి, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

సమయాన్ని సద్వినియోగం చేయాలి: ఒకరోజులో ఏవేవి చదవాలని నిర్ణయించుకున్నారో అవన్నీ చదివేలా చూసుకోవాలి. అంతేగానీ సమయం మించిపోతోందని పైపైన చదివి వదిలేయ కూడదు. ఇలాచేస్తే ప్రయోజనమేమీ ఉండదు. సమయాన్ని తెలివిగా వినియోగించుకోవాలి. అలాగే ఒకేరోజు ఎక్కువసేపు చదవడం, మర్నాడు పూర్తిగా బద్ధకించడమూ సరికాదు.

ఇదీ చదవండి:KISHAN REDDY: కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details