కరోనా ఉపద్రవం వల్ల అన్ని రంగాల మాదిరిగానే విద్యారంగం కూడా అతలాకుతలమైంది. విద్యా సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక విద్యా సంస్థలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. తాత్కాలిక పరిష్కారంగా ఆన్‌లైన్ తరగతులు రంగప్రవేశం చేసినా, వాటిలో సాధకబాధకాలు అనేకం. మొదట విద్యార్థులకు ఎందుకని చదువు చెబుతున్నాం, వారు ఏ లక్ష్యంతో చదువుతున్నారనే అంశాలపై అందరికీ స్పష్టత ఉండాలి.
కేవలం ఏ సంవత్సరానికా సంవత్సరం పాఠ్య ప్రణాళికను ముగించి చేతులు దులుపుకోవడమే విద్యా సంస్థలు, విద్యార్థుల లక్ష్యమా? లేదా ప్రైవేటు విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి రుసుములు వసూలు చేసుకుని మొక్కుబడి చదువులు చెప్పి సరిపెట్టుకోవడమా? ఇవేమీ కాదని అందరికీ తెలుసు. విద్యార్థులు జీవితంలో రాణించడానికి కావలసిన సామర్థ్యాన్ని అలవరచేదే అసలైన విద్య. విద్యార్థుల మధ్య సాంఘిక, ఆర్థిక అంతరాలు ఎన్ని ఉన్నా తరగతి గదిలో అందరికీ సమాన బోధన అందించాలి. అలా జరిగితేనే విద్యకు లక్ష్యశుద్ధి ఉన్నట్లు లెక్క.
ఆచరణాత్మక విద్య
ఆధునిక విద్య మూడు ధ్రువాల ప్రక్రియ. అవి- ఉపాధ్యాయుడు, విద్యార్థి, సామాజిక వాతావరణం. పాఠశాల సమాజానికి ఓ చిన్న దర్పణం వంటిది. అక్కడ భిన్న వయసులు, భిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు ఉంటారు. గృహ వాతావరణానికి పాఠశాల వాతావరణం పూర్తి భిన్నమైనది. విద్యార్థిలో అంతర్లీనంగా ఉన్న శక్తియుక్తులు మేల్కొనేది బడి వాతావరణంలోనే. ‘చేస్తూ నేర్చుకోవడం’- అంటే ఆచరణాత్మక విద్య ఆధునిక కాల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న విధానం. బాల్యంలో ఒకచోట కుదురుగా కూర్చునే తత్వం ఉండదు. అంతటా కలియతిరుగుతూ అన్నీ నేర్చుకోవాలనే తపన బాలల్లో సహజంగా ఉంటుంది. ఇలా చూస్తూ, చేస్తూ నేర్చుకొన్నప్పుడే విద్యా నైపుణ్యాలు వారి జీవితాల్లో అంతర్భాగాలవుతాయి. ఒక బాలుడు తాను విన్నదానిలో 15 శాతమే గుర్తుపెట్టుకుంటాడు, చూసినదాంట్లో 50 శాతం, చేసిన దాంట్లో 90 శాతం గుర్తుంచుకుంటాడు.
ఇవన్నీ తరగతి గదిలో మాత్రమే సాధ్యం. ఉపాధ్యాయుల వంక, నల్లబల్లపై వారు రాసే సమీకరణల వంక చూస్తూ, చెప్పేది వింటూ, ప్రయోగశాలలో చెప్పేవి చేస్తూ విద్యలో రాణిస్తారు. తమకు అర్థంకాని విషయాల గురించి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ తనకు తాను పదును పెట్టుకుంటారు. దీనివల్ల విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో అంచనా వేయడం ఉపాధ్యాయుడికి వీలవుతుంది. తరగతి గది బోధనాభ్యాసాల అంతిమ లక్ష్యం- విద్యార్థి కొత్త విషయాలు, నైపుణ్యాలను నేర్చుకుని, వాటిని జీవితానికి అన్వయించే సత్తాను సాధించడానికి తోడ్పడటం. ఆన్‌లైన్ బోధనలో విద్యార్థి సమర్థంగా నేర్చుకుంటున్నాడా, ఉపాధ్యాయుడు చెప్పేది అర్థమవుతోందా అనేది నిర్ధారించడం కష్టం.