దిల్లీలో వాయు కాలుష్యానికి పరిశ్రమలు, రవాణా, రహదారి ధూళి ప్రధాన కారణమని, కొన్ని ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల సమస్య తలెత్తుతోందని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో పలువురు రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుండటం కొంతవరకూ వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు గడచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది.
నవంబరు మొదటివారంలోనే పంజాబ్‌లో 22వేల సస్యక్షేత్రాల్లో వ్యర్థాలను తగలబెట్టారని పంజాబ్ కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. పంట వ్యర్థాల దహనంతో దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్)లో వాయునాణ్యత పడిపోతోంది. పంజాబ్ రైతుల ఆరోగ్యంపైనా ఈ కాలుష్యం ప్రభావం చూపుతోందని ఇంధన వనరుల సంస్థ(తేరి) ఇటీవలే వెల్లడించింది.
వ్యవసాయ యాంత్రీకరణ వల్లే పంట వ్యర్థాలను తగలబెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అంతకుముందు కూలీలతో కోయించినప్పుడు పొలాల్లో కొయ్యలు అంతగా మిగిలేవి కావు. యంత్రాలతో కోయిస్తున్నప్పటి నుంచి అవి దాదాపు అడుగు ఎత్తున మిగిలిపోతున్నాయి. వాటిని మళ్ళీ తీయించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో సులభంగా అయిపోతుందని తగలబెడుతున్నారు. హరియాణాలో చిన్న, సన్నకారు రైతులు కూలీలతోనే కోయిస్తున్నారు. దీనివల్ల పంజాబ్‌లో ఉన్నంత తీవ్రంగా సమస్య అక్కడ లేదు. ఎరువుల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న రైతులు పంట వ్యర్థాలను కోయిస్తే మరింత ఆర్థికభారం పడుతుందని అంటున్నారు.
తొలుత వరి, ఆ తరవాత గోధుమ సాగుచేసే రైతులకు రెండు పంటల మధ్య గడువు ఎక్కువ లేకపోవడం సైతం ఇబ్బందిగా మారింది. గతంలో మే నెలలో వరి నాట్లు వేసి, సెప్టెంబరు లేదా అక్టోబరులో కోతలు కోసేవారు. ఆ తరవాత గోధుమ పంట వేయడానికి ఒక నెల సమయం ఉండేది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో జూన్ కంటే ముందు నాట్లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. దాంతో అక్టోబరు నెలాఖరుకుగానీ కోతలు ఉండటం లేదు. మరోవైపు నవంబరు రెండోవారం తరవాత గోధుమ నాట్లు వేయాలి. పొలాలను వేగంగా పంటకు సిద్ధం చేసేందుకు వ్యర్థాలను తగలబెట్టేస్తున్నారు. బయో-డీకంపోజర్లను వాడితే సమస్య ఉండదు గానీ, అందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుండటంతో దహనం వైపే మొగ్గుచూపుతున్నారు.