"ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.70 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. అందులో 30 లక్షల మంది భారతీయులు. పట్టణాల్లో 14 లక్షల మంది, గ్రామాల్లో 16 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. హృద్రోగాల బారిన పడుతున్నవారిలో 40 శాతం 55 ఏళ్లలోపు వారే" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
గోరుచుట్టుపై రోకలి పోటు చందంగా- దేశంలో వ్యాపించిన కరోనా మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 60 లక్షలు దాటి, ప్రపంచంలో రెండోస్థానానికి చేరింది. ఈ జబ్బుతో ఆరు నెలల్లో దాదాపు 94 వేల మంది మరణించారు. దేశంలోని అనారోగ్య పరిస్థితులను కళ్లకు కడుతున్న పరిణామాలివి. కరోనా, ఇతర వ్యాధుల నేపథ్యంలో భారతీయుల జీవనశైలి, ఆరోగ్యంపై మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం సృష్టమవుతోంది.
రుగ్మతలపై పోరు...
- ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభాగల దేశంలో ఆది నుంచి అనారోగ్యం ప్రధాన సమస్యల్లో ఒకటిగా ఉంది. అది సామాజికంగా, ఆర్థికంగా జన జీవనంపై పెను ప్రభావం చూపుతోంది. దేశ జనాభాలో 83శాతం ఏదో ఒక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు.
- జబ్బుల్లో అత్యంత ప్రమాదకరమైనది గుండెపోటు. దీనివల్ల మరణించేవారిలో 50శాతం అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల వారికంటే సగటున 8-10 సంవత్సరాల ముందు భారతీయులకు గుండెపోటు వస్తోంది. గుండెపోటుకు గురయ్యేవారిలో 42శాతం ముందే దాన్ని గుర్తించలేకపోవడం ఆరోగ్యం పట్ల అవగాహన లోపాన్ని వెల్లడిస్తోంది.
- దేశంలో ఏటా రెండు లక్షల మంది చిన్నారులు గుండె జబ్బులతో జన్మిస్తున్నారు. ఇవికాక పౌష్టికాహార లోపం, ఊబకాయం, శ్వాసకోశ, నరాల సంబంధిత వ్యాధులతో పాటు జ్వరాలు, ఇతర సాంక్రామిక వ్యాధులు దేశప్రజలను బాధిస్తున్నాయి. జాతీయ పౌష్టికాహార సంస్థ సర్వే ప్రకారం... 10-24 సంవత్సరాల వయసు గల జనాభాలో 56.4శాతం నుంచి 68.5శాతానికి పౌష్టికాహార లోపం ఉంది. పాఠశాలల్లో 38.8 శాతం బాలురు, 36.9 శాతం బాలికలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
- ఇండియాలో మూడు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 60శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది ఆఫ్రికా దేశాల కంటే 28 శాతం ఎక్కువ.
- అయిదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లల్లో 44 శాతం తక్కువ బరువు కలిగి ఉన్నారు. 72 శాతం శిశువులకు రక్తహీనత ఉంది.
- ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు భారతదేశంలో నివసిస్తున్నారు. దేశంలో వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడం, అధికబరువు ఉండటం, విటమిన్లు, అయోడిన్ ఖనిజాల కొరత, ఆరోగ్య లక్షణాల్లో అసమతుల్యత, రక్షిత నీరు కొరవడటం, వాతావరణంలో అనూహ్య మార్పులు, క్రిమికీటకాల ప్రభావం వంటివి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. గృహ, ఆహార భద్రత, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, ప్రభుత్వ విధానాల వంటివి సైతం ప్రభావం చూపుతున్నాయి.
- దేశంలో సగటు ఆయుర్దాయం 1970-1975లో 49.7 సంవత్సరాలు ఉండగా... అది 2010-2014లో 67.9 సంవత్సరాలకు పెరిగింది. 2018 నాటికి అది 69.1 సంవత్సరాలకు చేరింది. ఆయుర్దాయంతో పాటు జబ్బులూ పెరుగుతున్నాయి.
జీవనశైలిలో అంతర్భాగం కావాలి
- పాఠశాల స్థాయిలో పిల్లలకు ఆరోగ్యంపై అవగాహనకు తోడు వ్యాయామాలు తప్పని సరైనా అవి సరిగ్గా అమలు కావడం లేదు. దేశంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మాత్రమే వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలు జరుగుతున్నాయి. చాలా ప్రైవేటు విద్యాసంస్థల్లో వ్యాయామం, క్రీడల ఊసే లేదు.
- టీవీలు, సెల్‌ఫోన్లు, ఆన్‌లైన్ క్రీడలు, సామాజిక మాధ్యమాలకు పిల్లలు, పెద్దలు సైతం ఆకర్షితులవుతున్నారు. వాటితోనే కాలం గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదు. చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారని సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఆసుపత్రులు చికిత్స చేస్తున్నాయి కానీ, ఆరోగ్యంపై ప్రజలను జాగృతం చేయడం లేదు.
- ఆరోగ్యంపై అవగాహనే లక్ష్యంగా జాతీయ క్రీడా దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం నిరుడు దృఢభారత్ (ఫిట్‌ఇండియా) ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆరోగ్యం, శారీరక పటుత్వంపై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనా 'హెల్తీ చైనా' పేరిట దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాన్ని చేపట్టింది.
- ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఆరోగ్య నగరాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. వీటి మూలంగానే ఆ దేశం కరోనా నుంచి త్వరితగతిన గట్టెక్కింది. చైనాతో పాటు కరోనాను జయిస్తున్న న్యూజిలాండ్, శ్రీలంక, సింగపూర్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల విజయ రహస్యం ఇదే. భారత్‌లోనూ ఇలాంటి ఉద్యమస్ఫూర్తి రావాలి. కరోనాను, ఇతర వ్యాధులను పారదోలే సంకల్పం కావాలి.
"శారీరక దృఢత్వ పరిరక్షణ మన జీవన విధానంలో అంతర్భాగం కావాలి. ప్రతి భారతీయుడు రోజూ కనీసం అరగంట సమయమైనా క్రీడలు లేదా శారీరక వ్యాయామానికి సమయం కేటాయించాలి. ఒకరినొకరు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి..." అంటూ ప్రధాని నరేంద్రమోదీ ధృఢభారత్ వార్షికోత్సవం సందర్భంగా పిలుపివ్వడాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తించాలి!