తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రసవత్తర రాజకీయం- వేడెక్కుతున్న పశ్చిమ్‌ బంగ - బంగాల్​ భాజపా

మూడు దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగిన వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ 2011లో తొలిసారి అధికారపగ్గాలు చేపట్టారు. అయిదేళ్ల పాటు సాగిన ఆమె పాలనకు మంచి మార్కులు వేసిన బెంగాలీలు 2016లోనూ మరోసారి అక్కయ్య(దీదీ)కే పీఠం కట్టబెట్టారు. కానీ ఈసారి మాత్రం ఆమె అధికారపీఠాన్ని అందుకోవడం నల్లేరుమీద నడకలా లేదు.

BENGAL
రసవత్తర రాజకీయం- వేడెక్కుతున్న పశ్చిమ్‌ బంగ

By

Published : Dec 12, 2020, 5:20 AM IST

బెంగాలీ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. 2021 మే నెలలో- అంటే సుమారు మరో ఆరు నెలల్లో పశ్చిమ్‌ బంగ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఈసారి ఎవరు పాగా వేస్తారన్నది దేశవ్యాప్తంగా రాజకీయ, రాజకీయేతర వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మూడు దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగిన వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ 2011లో తొలిసారి అధికారపగ్గాలు చేపట్టారు. అయిదేళ్ల పాటు సాగిన ఆమె పాలనకు మంచి మార్కులు వేసిన బెంగాలీలు 2016లోనూ మరోసారి అక్కయ్య(దీదీ)కే పీఠం కట్టబెట్టారు. కానీ ఈసారి మాత్రం ఆమె అధికారపీఠాన్ని అందుకోవడం నల్లేరుమీద నడకలా లేదు.

మేనల్లుడిపై ప్రేమ!

మన దేశంలో రాజకీయ వారసత్వానికి నాయకులు పెద్దపీట వేస్తారన్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో మమతా బెనర్జీ స్వయంగా తన మేనల్లుడైన అభిషేక్‌ బెనర్జీని రంగంలోకి దించారు. ఆయనను లోక్‌సభకు పంపడమే కాక పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా చేసి, ఒక రకంగా పార్టీ పగ్గాలను క్రమంగా ఆయన చేతికి అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అభిషేక్‌ ఇప్పటికే పార్టీలో మమతకు అప్రకటిత వారసుడిగా కొనసాగుతున్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుని అమలు చేస్తున్నారు.

ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లు- ఈ అల్లుడి పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ముకుల్‌ రాయ్‌, మిహిర్‌ గోస్వామి లాంటి నేతలు టీఎంసీకి టాటా చెప్పి భాజపా గూటికి చేరారు. ఇప్పుడు తాజాగా జంగల్‌మహల్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న 'అధికారి కుటుంబం' సైతం టీఎంసీకి దూరం అవుతోంది. పార్లమెంటు సభ్యుడు శిశిర్‌ అధికారి, ఆయన కుమారులు సువేందు, దివ్యేందు, సోమేందు... వీళ్లందరికీ ఆ ప్రాంతంలో భారీగా అనుచరవర్గం ఉంది. సువేందు అధికారి నిన్న మొన్నటివరకు మమతా బెనర్జీ క్యాబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పనిచేసేవారు. దివ్యేందు ఎంపీ; సోమేందు అధికారి ఎమ్మెల్యే. దాదాపు ఆరు జిల్లాల పరిధిలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈ కుటుంబం గట్టి ప్రభావం చూపిస్తుంది. హూగ్లీ రివర్‌ బ్రిడ్జ్‌ కమిషనర్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తనను తప్పించి, టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీని ఆ స్థానంలో కూర్చోబెట్టడంతో సువేందు బాబు ఆగ్రహానికి గురయ్యారు. మంత్రిపదవికి రాజీనామా చేస్తున్నట్లు నేరుగా గవర్నర్‌కు లేఖ పంపారు. 2007లో నందిగ్రామ్‌ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది అధికారి కుటుంబమే. ఒకరకంగా ఆ ఉద్యమం వల్లే 2011లో వామపక్ష ప్రభుత్వం కుప్పకూలింది.

సీపీఎమ్‌కు పెట్టనికోటగా ఉన్న జంగల్‌మహల్‌ ప్రాంతాన్ని టీఎంసీవైపు తిప్పినదీ వారే. అలాంటి కుటుంబాన్ని కరివేపాకులా తీసి పక్కన పారేయడం వారికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. గతంలో సీపీఎమ్‌కు అండగా ఉన్న ముస్లిములు, మతువా వర్గం (ఎస్సీలు) 2011 నుంచి టీఎంసీ వైపు మళ్ళారు. మతువా వర్గానికి పెద్దదిక్కుగా ఉన్న బీణాపాణీ దేవి అలియాస్‌ 'బోరో మా'ను మమతా బెనర్జీ తరచూ కలిసేవారు. ఇటీవలి కాలంలో పలు ఎన్నికల్లో 'సోషల్‌ ఇంజినీరింగ్‌' మంత్రాన్ని పఠిస్తున్న భాజపా... 'బోరో మా'ను తమవైపు తిప్పుకొంది. పశ్చిమ్‌ బంగలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఠాకుర్‌నగర్‌ నుంచే ప్రారంభించారు. దానికి ముందు ఆయన స్వయంగా వెళ్లి బోరో మా ను కలిసి వచ్చారు. 2014లో రెండు స్థానాలే గెలుచుకున్న భాజపా... ఇలాంటి వ్యూహాల వల్లే 2019లో ఏకంగా 18 లోక్‌సభ స్థానాల్లో పాగా వేసింది.

ప్రశాంతుడి అండ ఉన్నా...

ఎన్నికల రంగంలో కాకలు తీరిన మొనగాడిగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌- రెండువిడతలుగా అధికారంలో కొనసాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఈసారి తన సైన్యాన్ని రంగంలోకి దించడం విశేషం. ఇన్నాళ్లూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల తరఫున వకాల్తా పుచ్చుకొని వాటిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడం, లేదా బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో సరికొత్త కూటములను రూపొందించి కుర్చీని కట్టబెట్టడం తన ప్రత్యేకతగా నిరూపించుకున్న ఆయన... ఈసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తరఫున పనిచేస్తున్నారు.

2015లో బిహార్‌లో నీతీశ్‌కుమార్‌, 2017లో పంజాబ్‌లో అమరీందర్‌సింగ్‌లను అధికారంలోకి తేవడంలో 'పీకే'దే కీలక భూమిక. 2017లోనే యూపీలో కాంగ్రెస్‌ తరఫున పనిచేసినా అక్కడ భాజపా భారీ విజయం సాధించింది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం వెనకా ప్రశాంత్‌ కిషోర్‌దే ముఖ్యపాత్ర. అలాంటి వ్యక్తి ఇప్పుడు మమతా దీదీకి అండదండలు అందిస్తున్నారు. కానీ, టీఎంసీని ఆయన భ్రష్టు పట్టిస్తున్నారంటూ కొంతమంది సీనియర్‌ నాయకులు తృణమూల్‌కు టాటా చెప్పేస్తున్నారు. ఇది ఇన్నాళ్లుగా ప్రశాంత్‌ కిషోర్‌కు ఎదురుకాని అనుభవం. అసలు ప్రశాంత్‌ను తీసుకొచ్చిందే అభిషేక్‌ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి ఎన్నికలను మమత, మోదీల మధ్య పోరాటంగా చేయాలన్నది తమ వ్యూహమని, ఇందులో స్థానిక నాయకులు, వ్యక్తులకు ఎలాంటి ప్రాధాన్యం ఉండబోదని... కేవలం మమతనే ప్రధానంగా ఓటర్లలోకి తీసుకెళ్తామని ఇండియన్‌ పొలిటికల్‌ యూక్షన్‌ కమిటీ(ఐప్యాక్‌) సీనియర్‌ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. కీలక నాయకుల రాజీనామాల లాంటి పరిణామాలను ఎదుర్కొంటూ దీదీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారో లేదా యూపీ లాంటి అనుభవాన్నే చవిచూస్తారోనన్న అనుమానాలూ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details