తెలంగాణ

telangana

ETV Bharat / opinion

టీకాల తయారీలో కొత్త చరిత్రకు నాంది - కొత్త చరిత్రకు నాంది!

కొవిడ్​ మహమ్మారిని తుదముట్టించడమే లక్ష్యంగా తయారు చేసిన వ్యాక్సిన్లకు.. అత్యవసర వినియోగానికి భారత్​ తాజాగా అనుమతిచ్చింది. ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తుండగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ బయోటెక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ ప్రాణ రక్షక ఔషధాల తయారీలో శాస్త్రవేత్తల మేధకు మెచ్చుతునక! ఈ వ్యాక్సిన్లు రెండూ భారత్‌లోనే తయారు కావడం ప్రతి పౌరుడికీ గర్వకారణమన్నది ప్రధాని మోదీ మాట. కొవిడ్‌పై ముందువరస పోరాట యోధులుగా మోహరించిన మూడు కోట్లమందికి త్వరలో మొదలుపెట్టనున్న టీకాల కార్యక్రమం- కొత్త చరిత్రకు నాంది కానుంది!

India Green Signal for Emergency Use of covid Vaccines
కొత్త చరిత్రకు నాంది!

By

Published : Jan 4, 2021, 7:02 AM IST

ప్రపంచ మానవాళిపై కరోనా దట్టంగా పరచిన మృత్యు భీతిని పటాపంచలు చేయడమే లక్ష్యంగా, కాలంతో పోటీపడి బయోటెక్‌ సంస్థలు, శాస్త్రవేత్తల బృందాలు రూపొందించిన వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి నెలల వ్యవధిలోనే సిద్ధమై కొత్త వత్సరం ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. తాము తయారు చేసిన వ్యాక్సిన్లతో కొన్ని వారాల క్రితమే చైనా, రష్యాలు టీకా కార్యక్రమాన్ని చేపట్టగా, కొవిడ్‌ కేసులు మళ్లీ ఉద్ధృతమైన నేపథ్యంలో బ్రిటన్‌, అమెరికా టీకా వినియోగాన్ని ప్రారంభించాయి. ఇప్పటికే టీకా కార్యక్రమ నిర్వహణకు ముందస్తు కసరత్తుల్ని ముమ్మరం చేసిన ఇండియా- సీరమ్‌, భారత్‌ బయోటెక్‌ తయారీ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి తాజాగా అనుమతించింది. ఈ వ్యాక్సిన్లు రెండూ భారత్‌లోనే తయారు కావడం ప్రతి పౌరుడికీ గర్వకారణమన్నది ప్రధాని మోదీ మాట.

ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తుండగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ బయోటెక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ ప్రాణ రక్షక ఔషధాల తయారీలో శాస్త్రవేత్తల మేధకు మెచ్చుతునక! వ్యాక్సిన్లు రెండూ నూరు శాతం సురక్షితమైనవేనన్న డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌- ఏ కొద్దిపాటి సందేహమున్నా అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టీకరిస్తున్నారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లతోపాటు మరో నాలుగు వ్యాక్సిన్ల ప్రయోగాలూ జోరుగా సాగుతున్న వేళ- కొవిడ్‌పై పోరుకు ఇండియా నాలుగు టీకాలతో సన్నద్ధమవుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెబుతున్నారు. టీకా వేయించుకొన్న వారికి కొద్దిగా జ్వరం, నొప్పి, అలెర్జీలు సాధారణమేనని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ చెబుతున్నా- ఎలాంటి దుష్ప్రభావాల్ని అయినా కాచుకొనే వ్యూహంతో కేంద్రం సిద్ధమవుతోంది. కొవిడ్‌పై ముందువరస పోరాట యోధులుగా మోహరించిన మూడు కోట్లమందికి త్వరలో మొదలుపెట్టనున్న టీకాల కార్యక్రమం- కొత్త చరిత్రకు నాంది కానుంది!

వందేళ్ల క్రితం నాటి స్పానిష్‌ ఫ్లూ మాదిరిగానే ప్రపంచ మానవాళిపై పంజా విసరిన కొవిడ్‌ ఇప్పటికే ఎనిమిదిన్నర కోట్ల మందికి సోకి, 18 లక్షల 40 వేల మందిని మృత్యు పరిష్వంగంలోకి ఈడ్చేసింది. ఇండియాలోనూ కోటిమందికిపైగా అభాగ్యులకు సోకి, దాదాపు లక్షన్నర మందిని బలిగొన్న మహమ్మారి- అన్ని విధాలుగా సామాజిక జన జీవనాన్ని దిగలాగేసింది. ఈ తరహా ఆరోగ్య సంక్షోభాన్ని సార్వత్రిక టీకా కార్యక్రమాలతో సమర్థంగా అధిగమించిన చరిత్ర ఇండియాకు ఉంది. నాలుగున్నర దశాబ్దాల క్రితం బిహార్‌, ఒడిశా, పశ్చిమ్‌ బంగలను అతలాకుతలం చేసిన మశూచి 15వేల మందిని కబళించినప్పుడు- సార్వత్రిక టీకా కార్యక్రమంతోనే దాన్ని భారత్‌ పారద్రోలగలిగింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా సాగించిన టీకా కార్యక్రమంతోనే ఇండియా 2014లో 'పోలియో రహితం' కాగలిగింది. ఆ అనుభవాలు ఇండియాకెంతగానో అక్కరకొచ్చేవే అయినా, కొవిడ్‌ కొమ్ములు విరిచే ఈ మహాయుద్ధంలో- సందర్భోచిత వ్యూహాలతో ముందుకు సాగడం తప్పనిసరి.

పదేపదే ఉత్పరివర్తనం చెందుతున్న మాయావి వైరస్‌ కొత్త సవాళ్లు రువ్వుతున్న దశలో- టీకాల సామర్థ్యాన్ని బేరీజు వేసుకొంటూ, వ్యాక్సిన్‌ వేయించుకొన్నవారిలో యాంటీబాడీలు ఎంతకాలం రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటున్నాయో శాస్త్రీయంగా విశ్లేషించుకొంటూ, పరిశోధనలకు పదునుపెట్టుకొంటూ ముందుకు సాగాలి. రెండు దఫాలూ ఒకే టీకా వాడాలని అమెరికా నిర్దేశిస్తుంటే, తొలిసారి వాడిన వ్యాక్సిన్‌ అందుబాటులో లేనప్పుడు వేరేది అయినా వినియోగించుకోవచ్చునని బ్రిటన్‌ ఇచ్చిన సడలింపు వివాదాస్పదమవుతోంది. అంతకు మించి- ప్రపంచారోగ్యానికి దాపురించిన పది పెను ముప్పుల్లో 'వ్యాక్సిన్‌ విముఖత' ఒకటని డబ్ల్యూహెచ్‌ఓ 2019లో ప్రకటించింది. వ్యాక్సిన్లపై దుష్ప్రచారాల బెడద జనసామాన్యాన్ని బెంబేలెత్తించకుండా వాటికి అడ్డుకట్టవేసి, ప్రాణాధార టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వాలు పట్టాలకెక్కించాలి. టీకా వచ్చింది కాబట్టి ఇక ఢోకా లేదనుకోకుండా ముందస్తు జాగ్రత్తల నియమాల్ని ప్రజానీకమూ కచ్చితంగా పాటించాలి!

ఇదీ చదవండి:'జమ్ముకశ్మీర్​ పార్టీలను బలిపశువు చేశారు'

ABOUT THE AUTHOR

...view details