తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వలస కూలీల దైన్యం- విషాద అధ్యాయం - రాష్ట్రాల్లో వలస కూలీలు

కొవిడ్ కోరలు చాస్తున్న వేళ.. వలస కూలీలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ప్రాణభయంతో ఇంటిబాట పడుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వేస్టేషన్లు ఇప్పుడు వలస కూలీల సమూహాలతో కిటకిటలాడుతున్నాయి. పిడుగుపాటులా దాపురించిన విపత్తుతో దిక్కుతోచక దయనీయ పరిస్థితిలో అల్లాడుతున్న వాళ్లను కేంద్రప్రభుత్వమే పెద్దమనసుతో ఆదుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

migrant labours
వలస కూలీలు, కొవిడ్ సెకండ్ వేవ్

By

Published : Apr 29, 2021, 7:40 AM IST

కొవిడ్‌ కేసులు రెండోదఫా మహోగ్రంగా విజృంభిస్తున్న వేళ అసంఖ్యాక వలసజీవుల అవస్థలు చెప్పనలవి కాదు. నిరుటి భయానక అనుభవాలు వీడని పీడలా వెన్నాడుతుండగా, రేపటిపై తీవ్ర అనిశ్చితి వారిని ఎక్కడా కుదురుకోనివ్వడంలేదు. కొన్నిచోట్ల పరిమిత ఆంక్షలు, రాత్రి సమయాల్లో కర్ఫ్యూల విధింపు నేపథ్యంలో- స్వస్థలానికి తరలిపోయి బతికుంటే బలుసాకైనా తిని గట్టెక్కుదామన్న ఆరాటం ఎందరినో ఉన్నచోట నిలవనీయకుండా తరుముతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వేస్టేషన్లు ఇప్పుడు వలస కూలీల సమూహాలతో కిటకిటలాడుతున్నాయి.

గత సంవత్సరం కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన దరిమిలా కూలీల ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈసారి అటువంటి నిర్ణయమేదీ అధికారికంగా ఖరారు కాకపోయినా, ఇప్పటికే లక్షల మంది శ్రామికులకు చేద్దామంటే పనిలేదు. తినడానికి తిండి లేదు. పొదుపు చేసిందంతా కరిగిపోయి చేతిలో కాసులు ఆడని దుస్థితిలో ఏదోలాగా సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలని మూటాముల్లే సర్దుకుని రైల్వేస్టేషన్‌ చేరేసరికి, హతాశులు కాక తప్పడం లేదు. భాగ్యనగరంలోనే కోల్‌కతా, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలకు చెందిన లక్షలమంది కూలీలు దొరికిన పని చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో మరెందరో స్థిరాస్తి, సాగునీటి పథకాలు, పై వంతెనలు, డ్రెయినేజీల నిర్మాణం తదితరాల్లో బతుకుతెరువు పొందుతున్నారు. పిడుగుపాటులా దాపురించిన విపత్తుతో దిక్కుతోచక దయనీయ పరిస్థితిలో అల్లాడుతున్నవాళ్లను కేంద్రప్రభుత్వమే పెద్దమనసుతో ఆదుకోవాలి. రెపరెపలాడుతున్న ప్రాణదీపాలను రెండుచేతులూ అడ్డుపెట్టి నిలబెట్టాలి!

దయనీయ ప్రస్థానం..

జనాభా లెక్కల ప్రకారం దేశంలో వలస కార్మికుల సంఖ్య సుమారు 11కోట్ల 80లక్షలు. ఏటికేడు ఆ పరిమాణం విస్తరిస్తూనే ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏపీ, తెలంగాణ సహా ఎన్నో రాష్ట్రాల్లో వలస కూలీలు అందుబాటులో లేకపోతే నిర్మాణ రంగం చతికిలపడుతుంది. చాలాచోట్ల పొలం పనులూ సవ్యంగా సాగవు. అంతటి కీలక శ్రమజీవులూ ఎందరో నిరుటి లాక్‌డౌన్‌ సందర్భంగా ఎండ చలి వానల్ని తట్టుకుంటూ బిడ్డల్నీ వస్తుసామగ్రినీ మోస్తూ వందల కిలోమీటర్ల దూరం కాలినడకన పయనమైన దృశ్యాలు జాలి గుండెల్ని మెలిపెట్టాయి. దారంట దాతలెవరైనా ఇచ్చింది తింటూ, లేకుంటే పస్తులుంటూ సాగిన అసంఖ్యాకుల దయనీయ ప్రస్థానం- కొవిడ్‌ సంక్షోభంలో విషాద అధ్యాయం.

కాళ్లు వాచి, పాదాలు పుండ్లు పడి, మార్గమధ్యంలోనే కడతేరిపోయిన బతుకులెన్నో లెక్కేలేదు. వ్యవస్థాగతంగా అటువంటి వైఫల్యం మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం జాతీయస్థాయిలో అన్నివిధాల జాగ్రత్తలూ తీసుకోవాలి. ఏ ప్రాంతానికి ఎంతమంది వెళ్ళాల్సి ఉందో శాస్త్రీయంగా మదింపు వేసి వారివారి గమ్యస్థానాలకు ప్రయాణికుల్ని రైళ్లలో పంపించాలి. పోయిన సంవత్సరం శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో కోటిమందిని తరలించినట్లు అధికారులు లెక్కచెప్పినా- అవసరార్థుల సంఖ్యతో పోలిస్తే అరకొరగా, ఎంతో ఆలస్యంగా చేసిన ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తాయి. నేడలా కాకుండా తగినన్ని రైళ్లను పట్టాలకు ఎక్కించి కూలీలు తమ గమ్యం చేరేలోగా వారి తిండీతిప్పలు, మంచీచెడ్డా అంతా ప్రభుత్వమే చూసుకోవాలి. స్వస్థలానికి చేరినవారు తెరిపిన పడేదాకా ఆహార సరఫరాల్నీ అందించాలి. కోట్లాది వలస కార్మికుల బాగోగులకు ఉద్దేశించిన సమగ్ర చట్టమేదీ ఇంతవరకు రూపొందని దేశంలో, బాధ్యతాయుతమైన ఏ ప్రజాప్రభుత్వానికైనా మానవీయ విధ్యుక్త ధర్మమిది!

ఇదీ చదవండి:'వైద్య సదుపాయాలపై సమగ్ర వివరాలివ్వండి'

ABOUT THE AUTHOR

...view details