ఔత్సాహికులు తమ నవ్యమైన ఆలోచనలే పెట్టుబడిగా స్థాపిస్తున్న అంకుర సంస్థలు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇరుసుగా మారుతున్నాయి. కొలువుల కోసం వెతకడం మాని ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్న యువత ఆకాంక్ష అంకుర సంస్థలకు ప్రాణం పోస్తోంది. దేశంలో 2020 చివరి నాటికి ఏకంగా 41,061 అంకుర సంస్థలు ప్రభుత్వ గుర్తింపు పొందినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. ఇందులో అత్యధిక సంస్థలు వందల మందికి ఉపాధి చూపుతున్నాయి. వీటిలో 39 వేల అంకురాలు 4.70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వెల్లడించింది. పర్యాటకం, ఈ-కామర్స్ వంటి సేవా రంగాలే కాదు- విద్య, వైద్యం వంటి ప్రాధాన్య రంగాల్లోనూ అంకుర సంస్థలు వేళ్లూనుకుంటుండటం శుభపరిణామం. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేటు సంస్థల ప్రవేశానికి కేంద్రం ద్వారాలు తెరవగానే 40 అంకుర సంస్థలు పెట్టుబడులు పెట్టడం- ఈ వ్యవస్థ బహుముఖాభివృద్ధికి ప్రత్యక్ష నిదర్శనం.
ప్రభుత్వ చేయూత
ఉద్యోగాల కల్పన కష్టమవుతుండటం, సరికొత్త ఆలోచనలతో పది మందికి ఉపాధి కల్పించేలా యువత ముందుకొస్తుండటంతో అంకుర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందుకోసం 'స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా' పథకాన్ని ప్రారంభించింది. దీనికింద అంకుర సంస్థల మేధాహక్కులకు రక్షణ కల్పిస్తోంది. అంకురాలకు ఆర్థిక ఊతమిచ్చేందుకు 14వ, 15వ ఆర్థిక సంఘాల సహకారంతో రూ.10 వేల కోట్ల మూలనిధిని సమకూర్చింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) ఆధ్వర్యంలో ఈ మూలనిధికి మరిన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు జోడించి దాదాపు రూ.31,598 కోట్లు పోగేయగలిగారు. దీని నుంచి ఇప్పటి వరకు 384 అంకుర సంస్థల్లో రూ.4,509 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరోవైపు అంకుర సంస్థలకు ప్రారంభదశలో కొన్నాళ్లపాటు ఆదాయపన్ను మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది.
68సంస్థలకు యూనికార్న్ హోదా
కరోనాతో అన్ని రంగాలూ అతలాకుతలమయ్యాయి. ఇప్పుడిప్పుడే ప్రయాణం మొదలుపెట్టిన అంకుర సంస్థలకు కొవిడ్ శరాఘాతంలా తాకింది. ఇంత సంక్షోభంలోనూ కొన్ని అంకుర సంస్థలు దూసుకెళ్లాయి. కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులనే అవకాశాలుగా మలచుకుంటూ అత్యధిక మార్కెట్ విలువ వైపు పరుగులు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా 68 అంకుర సంస్థలు ఈ ఏడాది యూనికార్న్ హోదా పొందాయి. (100 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ సాధించిన సంస్థలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు). దాదాపు రూ.7,300 కోట్ల మార్కెట్ విలువను సాధించిన 12 భారతీయ కంపెనీలు ఈ ఏడాది జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇందులో ఏడు కంపెనీలు కొవిడ్ తరవాతే యూనికార్న్ హోదా పొందడం విశేషం. చిన్నారుల దుస్తులు, ఇతర సామగ్రి విక్రయించే 'ఫస్ట్ క్రై' సంస్థ గత ఫిబ్రవరిలోనే యూనికార్న్‌గా నిలిచింది. అయితే కరోనా తరవాత సంక్షోభ పరిస్థితుల్లోనూ నైకా, పోస్ట్‌మ్యాన్, జెరోధా, ఎన్ఎక్స్ట్రా డేటా, అన్అకాడమీ, రేజర్‌పే సంస్థలు ఈ జాబితాలోకి వచ్చాయి.