తెలంగాణ

telangana

ETV Bharat / opinion

శ్రీలంకకు భారత్‌ ఆపన్న హస్తం.. చిగురిస్తున్న స్నేహ బంధం

Sri Lanka economic crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్​. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్​తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. భారత్‌ ఇప్పటికే వంద కోట్ల డాలర్ల రుణాన్ని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైతే, భారత వ్యతిరేక శక్తులకు శ్రీలంక వేదికగా మారకుండా నిలువరించే అవకాశం దక్కుతుంది.

India helps Srilanka
శ్రీలంకకు భారత్‌ ఆపన్న హస్తం

By

Published : Apr 11, 2022, 6:55 AM IST

Sri Lanka economic crisis: ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంక- భారత్‌తో మళ్ళీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది. గతంలో కొలంబో పాలకులు భారత్‌ను కాదని ఇతర దేశాలకు దగ్గరయ్యేందుకు యత్నించారు. ప్రత్యేకించి డ్రాగన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు శ్రీలంకను రుణ ఊబిలోకి నెట్టేశాయి. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఆప్త మిత్రదేశం ఇండియాతో పలు ఒప్పందాలు కుదుర్చుకొంటూ కొలంబో వడిగా అడుగులు వేస్తోంది. రుణాల పేరుతో హంబన్‌టొటా నౌకాశ్రయాన్ని డ్రాగన్‌ దేశం 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకోవడంపై శ్రీలంక ప్రజలు మండిపడుతున్నారు. గతేడాది కొలంబో నౌకాశ్రయం తూర్పు కంటైనర్‌ టెర్మినల్‌ ఒప్పందం నుంచి భారత్‌, జపాన్‌లను శ్రీలంక బయటకు పంపింది. జాఫ్నా ప్రాంతంలోని నైనతీవు, నెడున్‌తీవు, అనలైతీవు దీవుల్లో చైనాకు చెందిన సంస్థలతో హైబ్రీడ్‌ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీలంక ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు అత్యంత దగ్గరగా ఉండే జాఫ్నా దీవుల్లో చైనా అడుగుపెడితే భారత్‌కు ఇబ్బందులు తప్పవని రక్షణ రంగ నిపుణులు హెచ్చరించారు. తాజాగా ఆ మూడు దీవుల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారత్‌కు అప్పగిస్తూ శ్రీలంక నిర్ణయం తీసుకోవడం భారత్‌ దౌత్య విజయానికి చిహ్నం. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్‌ ఇప్పటికే వంద కోట్ల డాలర్ల రుణాన్ని ప్రకటించింది.

సహాయ సమన్వయ కేంద్రం ఏర్పాటు: డ్రాగన్‌ కుయుక్తులతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంక అధికార యంత్రాంగం తిరిగి భారత్‌వైపు చూడటంతో ఉభయ దేశాల మధ్య ఆశాజనకమైన వాతావరణం ఏర్పడింది. ఇటీవలే శ్రీలంక పర్యటనకు వెళ్ళిన విదేశాంగ మంత్రి జైశంకర్‌- కొలంబోతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సముద్ర ప్రాంత సహాయ సమన్వయ కేంద్రం ఏర్పాటు వాటిలో ప్రధానమైంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ చేయూతతో కొలంబోలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఐరాస ఆధ్వర్యంలో పనిచేసే ఈ కేంద్రం- హిందూ మహాసముద్రంలో శ్రీలంక ప్రాదేశిక జలాల్లో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాలను పర్యవేక్షిస్తుంది. ఆ మార్గాల్లో నౌకలకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే సాయం అందిస్తుంది.

తమిళుల సమస్యల పరిష్కారం కీలకం: దిల్లీ, కొలంబో సంబంధాల్లో శ్రీలంక తమిళుల అంశం ప్రధానమైనది. ప్రొవిన్షియల్‌ కౌన్సిల్స్‌కు ఎక్కువగా అధికారాలను బదలాయించేందుకు 13వ రాజ్యాంగ సవరణను ఉద్దేశించారు. 1987లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్దనే, భారత ప్రధాని రాజీవ్‌గాంధీల మధ్య కుదిరిన చరిత్రాత్మక ఒప్పందంలో అది ఒక భాగం. అందులో కొన్ని హక్కులు అమలవుతున్నా- భూమిపై యాజమాన్యం, శాంతిభద్రతలు వంటి అంశాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి పరిష్కారానికి శ్రీలంక ప్రయత్నించడం లేదన్న ఆరోపణలున్నాయి. 13వ రాజ్యాంగ సవరణ పూర్తిగా అమలులోకి వస్తే ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో మెజార్టీగా ఉన్న తమిళులకు సాంత్వన చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009లో ఎల్‌టీటీఈపై విజయం అనంతరం తమిళులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో భద్రతాదళాల మోహరింపులు, తమిళ యువతను వేధిస్తున్న ఘటనలు ఎక్కువైనట్లు తమిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మైనార్టీ తమిళుల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు కొలంబో చర్యలు చేపట్టాల్సి ఉంది. తమిళ రాజకీయపక్షాల వేదిక 'తమిళ్‌ నేషనల్‌ అలయన్స్‌' ప్రతినిధులు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఇటీవల తొలిసారిగా సమవేశమయ్యారు. తమిళ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతోపాటు, తమిళ ప్రాంతాల అభివృద్ధి, చెరసాలల్లో మగ్గుతున్న తమిళ యువత విడుదలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవి త్వరితగతిన అమలుకు నోచుకోవాల్సి ఉంది.

చిరకాలంగా శ్రీలంకను ఆదుకుంటున్న భారత్‌పై అక్కడి ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. కానీ, కొలంబో పాలకులతో పాటు జనతా విముక్తి పెరమున వంటి రాజకీయ పక్షాలు విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నాయి. తాజాగా గస్తీ విమానంతోపాటు తేలియాడే డాక్‌ సౌకర్యాన్ని కొలంబో రక్షణ దళాలకు ఇండియా అందజేసింది. ఆధార్‌ తరహాలో శ్రీలంకలోనూ చేపట్టనున్న డిజిటల్‌ గుర్తింపు కార్డుల ప్రాజెక్టుకు ఇండియా ఇప్పటికే నిధులు అందించింది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు పెట్రో ఉత్పత్తుల కొనుగోలుకు రుణాలు మంజూరు చేసింది. ఇప్పటికే భారత్‌లోని పలు నౌకాశ్రయాల నుంచి ద్వీపదేశానికి బియ్యం పంపేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైతే, భారత వ్యతిరేక శక్తులకు వేదికగా శ్రీలంక మారకుండా నిలువరించే అవకాశం దక్కుతుందని భారత్‌ రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

- కె.శ్రీధర్‌

ABOUT THE AUTHOR

...view details