తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆన్‌లైన్‌ అగాధంలో చదువులు- గాడిన పడేనా!

కరోనా వల్ల పరిస్థితులు తలకిందులై ఎన్నో విషయాల్లో మార్పులు చేసుకున్నాయి. ఇందులో భాగమే ఆన్​లైన్​ విద్య కూడా. అయితే ఎంతమంది డిజిటల్ తరగతులకు హాజరవగలుగుతున్నారు? దేశంలో ఇంటర్నెట్​ సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉన్నాయా? ఆన్​లైన్​ తరగతులపై జాతీయ గణాంక సంస్థ తాజా నివేదికల్లో తేలిన నిగూఢ నిజాలేంటి? మీ కోసం..

Special story on Problems caused by online classes
ఆన్‌లైన్‌ అగాధంలో చదువులు- గాడిన పడతాయా!

By

Published : Sep 10, 2020, 10:00 AM IST

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ ప్రపంచ గమనాన్ని ఊహాతీతంగా మార్చేసింది. భిన్నరంగాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుండగా- విద్యారంగానా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ మహాసంక్షోభ సృష్టికి తెగబడకముందు విశ్వవ్యాప్తంగా 44శాతం విద్యార్థులకు ఆన్‌లైన్‌ చదువులన్నవే తెలియవని గుటెన్‌బర్గ్‌, ఎవల్డిజైన్‌ సంస్థల సంయుక్త విశ్లేషణ వెల్లడించింది. అదే ఇప్పుడు ఎటుచూసినా ఆన్‌లైన్‌ బోధనకు ప్రాముఖ్యం ఇంతలంతలవుతోంది. దేశదేశాల్లో అందుకు తగిన సన్నద్ధత ఉందా అన్నదే గడ్డుప్రశ్న. దేశీయంగా వివిధ రాష్ట్రాలమధ్య డిజిటల్‌ అగాధాన్ని జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదికాంశాలు ప్రస్ఫుటీకరిస్తున్నాయి.

దృష్టి కేంద్రీకరించాలి

హిమాచల్‌ప్రదేశ్‌ పట్టణ ప్రాంతాల్లో 70శాతానికిపైగా విద్యార్థులకు అంతర్జాల వసతి అందుబాటులో ఉంది. గ్రామీణ ఒడిశాలో ఆ భాగ్యానికి నోచుకున్న కుటుంబాలు మూడుశాతం లోపు! 'సాఫ్ట్‌వేర్‌ హబ్స్‌గా ప్రాచుర్యం పొందుతున్న కర్ణాటక, తమిళనాడు సహా పది రాష్ట్రాల్లో నెట్‌ సదుపాయం కలిగిన జనాభా 20 శాతానికన్నా తక్కువ. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతవాసులలో 42శాతానికి, గ్రామీణుల్లో కేవలం 15 శాతానికే అంతర్జాలం చేరువైందన్న గణాంకాలు; దేశం మొత్తంలో డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లలో ఏదో ఒకటైనా కలిగిన కుటుంబాలు 10 శాతమేనన్న అంచనాలు చాటుతున్నదేమిటి? ఆన్‌లైన్‌ బోధనకు 'డిజిటల్‌ ఇండియా' ఇంకా సంసిద్ధం కాలేదు! చాలాచోట్ల నెట్‌వర్క్‌ ఇబ్బందులు చెప్పనలవి కాదు. మౌలిక ఇక్కట్లను అధిగమించి సజావుగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరై సంతృప్తి చెందుతున్నవారి సంఖ్య పరిమితంగానే ఉన్నంతకాలం- డిజిటల్‌ చదువులు అర్థవంతం కాలేవు. విద్యార్థిలోకంలో ఈ అదృశ్య విభజన రేఖను చాకచక్యంగా తుడిచిపెట్టడంపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి కేంద్రీకరించాలి!

ఆవేదనతో ఆత్మహత్యలు!

ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడానికి స్మార్ట్‌ఫోన్‌ లేదన్న ఆవేదనతో ఓ కేరళ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రెండు నెలలక్రితం గగ్గోలు పుట్టించింది. ఇంటర్‌నెట్‌ సంకేతాలు సరిగ్గా అందక ఇళ్ల పైకప్పులకు చెట్లకొమ్మల మీదకు ఎక్కి గంటల తరబడి నిరీక్షిస్తున్న విద్యార్థుల ఉదంతాలు క్షేత్రస్థాయి దురవస్థకు అద్దం పడుతున్నాయి. ఇళ్లలో బ్రాడ్‌బ్యాండ్‌ కలిగినవారిలో సుమారు సగం మంది తరచూ కనెక్షన్‌ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు మరికొన్నిచోట్ల కేబుల్‌ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో నగరాలకు పల్లెలకు నడుమ అభివృద్ధి రీత్యా దశాబ్దాలుగా భారీ వ్యత్యాసం నెలకొని ఉందన్నది చేదునిజం.

గాడిన పడతాయా!

ఆ అంతరాల్ని సమాచార సాంకేతిక పరిజ్ఞానమనే వారధితో అధిగమించాలని 'భారతరత్న డాక్టర్‌ కలామ్‌ లోగడ పిలుపిచ్చారు. పోనుపోను పూడిపోవాల్సిన ఆ అగాధం ఎన్నేళ్లయినా కొనసాగుతుండటం దురదృష్టకరం. ఎనిమిదేళ్లక్రితం మొదలైన 'జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌' అనంతరం 'భారత్‌ నెట్‌వర్క్‌'గా రూపాంతరం చెందినా- దేశంలోని రెండున్నర లక్షల గ్రామపంచాయతీల్ని అనుసంధానించాలన్న సంకల్పం నేటికీ నెరవేరలేదు. పనులు పూర్తయినట్లు చెబుతున్నచోట్లా నెట్‌ సేవల అందుబాటు అంతంతమాత్రమే. పట్టణ ప్రాంతాలతో పోటీపడేలా అంతర్జాల సదుపాయాలతో పల్లెల్నీ పరిపుష్టీకరించడంతోపాటు, బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో ఇండియా తక్కిన దేశాలకు దీటుగా నిలిచేలా సత్వర చర్యలు అత్యవసరం. ఇక్కడి నెట్‌ వేగం- శ్రీలంక, పాకిస్థాన్‌, నేపాల్‌ కన్నా వెలాతెలాపోయే దుస్థితి ఇంకెంతకాలం? అంతర్జాల సేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని సర్వోన్నత న్యాయస్థానమే ఇటీవల ప్రకటించింది. ఆ స్ఫూర్తికి పట్టం కట్టి, అందరికీ నాణ్యమైన అంతర్జాల సేవల్ని ప్రభుత్వాలు సాకారం చేస్తేనే- దేశంలోని 35కోట్ల మంది విద్యార్థుల ఆన్‌లైన్‌ చదువులు గాడిన పడతాయి!

ఇదీ చూడండి:వ్యాక్సిన్ ట్రయల్స్​పై సీరంకు షోకాజ్ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details