మొన్న ఆయన ఎమ్మెల్యే. నిన్న రాజీనామా చేసిన శాసనసభ్యుడు. నేడు గౌరవ మంత్రివర్యులు! మొన్నటికి ఇవాళ్టికి మధ్య జరిగిన జగన్నాటకం- కాబోయే నాయకులకు ఓ గొప్ప పాఠం. ఎన్నికల్లో గెలిచిన వారికే పదవులన్నది పాతమాట. గెలిచి రాజీనామా చేసినవారికే పీఠాలన్నది కొత్తపాట. మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో విస్తరి దక్కించుకున్న ద్వాదశ ధర్మపరిరక్షణా దురంధురుల సాక్షిగా ఇదే ఈనాటి రాజకీయం. హవ్వ! ఇదెక్కడి విడ్డూరమని బుగ్గలు నొక్కుకోకండి. కరోనా కాలపు కుళ్లు రాజకీయాలని అప్పుడే మెటికలు విరవకండి.
పదిమంది నడిచిందే బాట, పలికిందే మాట అని మన పెద్దలు ఊరికే చెప్పారా! మరి పదిమందేం ఖర్మ- పన్నెండు మంది ‘పెదవే పలికిన మాటల్లోన తియ్యనిమాటే పదవీ... సంపదలిచ్చే దేవత పదవీ’ అని అమితానందంతో పాడుకుంటూ నడచిపోయిన ఆ అడ్డదారే కదా దేశ ప్రగతికి దగ్గరిదారి. కాబట్టి మిత్రులారా! అఖిల భారత నిఖిల నేతలందరికీ వినపడేలా ఓమారు గట్టిగా నినదిద్దాం- హై హై నాయకా... ఇచ్చేయ్ రాజీనామా ఇక! పట్టేయ్ పదవి చకచకా! చేసేయ్ ప్రజాసేవ ఎంచక్కా!
శత్రు పక్షంలో..
చిన్న పదవిని త్యాగం చేసి పెద్ద పదవిని సంపాదించుకున్న డజను మందికి దళపతి... శ్రీమాన్ జ్యోతిరాదిత్య సింధియా మహారాజులుం గారు! సొంత పార్టీతో ఆయనకేదో లెక్కల్లో తేడా వచ్చింది... అలకపాన్పు ఎక్కేశారు. పక్కపార్టీ పెద్దలొచ్చి ఓదార్చారు. అన్నంపెట్టని అమ్మకంటే బిర్యానీ వడ్డిస్తానంటున్న అత్తమ్మే మేలనుకున్నారీ గ్వాలియర్ ప్రభువులు! ‘రాజు వెడలె రవితేజములలరగ...’ అన్నట్టు బయలుదేరి వైరిపక్షంలో చేరిపోయారు. నాయకుడికి నమ్మినబంట్లుగా ఆ పన్నెండు మందికీ ‘కమలనాథు’డి మీద కోపం, కమలం మీద ప్రేమ ఏకకాలంలో తన్నుకొచ్చాయి. ‘హస్తం గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవులు మాకెందుకు... ఛీ ఛీ’ అనుకుని త్యాగం చేసేశారు. అంతే! పాత ప్రభుత్వం పేకమేడయ్యింది.
అప్పుడు మాజీ.. ఇప్పుడు కొత్త మంత్రి
మాజీ శాసనసభ్యులు కాస్తా కొలువుదీరిన కొత్త సర్కారులో తాజా మంత్రులైపోయారు. ఇందులో ‘నాకిది- నీకిది’ అన్న వక్రగతిని కాంచినవారి కళ్లుపోతాయ్! ‘వాళ్లు త్యాగులయ్యా... చిదానంద భోగులయ్యా!’ అన్న వంధిమాగధ గణపు స్తుతిగీతాలే సకల రాజకీయులకు దారిదీపాలు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సృజనాత్మక పద్ధతిని కనిపెట్టిన ఈ పుణ్యాత్ములకు ‘రాజకీయ నోబెల్’ ఇవ్వాలన్నది అభిమానుల డిమాండ్! ‘నిరుపమాన నవనవోన్మేష నిర్లజ్జా రాజకీయ చరిత్ర’ గ్రంథంలోని ‘నేతిబీర న్యాయం’ ప్రకారం వీళ్లకు ఆ బహుమతి ఇచ్చి తీరాల్సిందే.