ఆర్థిక స్థోమత చాలకున్నా ఆత్మీయుల్ని బతికించుకోవాలన్న తాపత్రయంతో అప్పో సొప్పో చేసి తలకు మించిన వైద్యవ్యయాల్ని భరించి ఏటా ఆరు కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోతున్న దేశం మనది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 19 లక్షలమందికి పైగా సోకి, 40వేలమంది అభాగ్యుల ఉసురు తీసేసిన కరోనా మహమ్మారి మృత్యుఘాతాల నుంచి స్వీయ రక్షణ పొందడం ప్రజలకు, సత్వర సమర్థ వైద్యసేవలతో ఆశ్రితుల్ని ఆదుకోవడం ప్రభుత్వాలకూ పెను సవాలుగా మారింది. మొదట్లో కొవిడ్ వైద్యాన్ని సర్కారీ దవాఖానాలకే పరిమితం చేసిన ప్రభుత్వాలు కేసుల ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సేవలకూ అనుమతించాయి. ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు అని, నచ్చినచోట చికిత్స చేయించుకొనే స్వేచ్ఛ వారికి ఉందనీ మే నెల మూడోవారంలో స్పష్టీకరించిన తెలంగాణ హైకోర్టు- తాజాగా ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యంపై కన్నెర్ర చేయడానికి బలీయ కారణాలే ఉన్నాయి.
'క్యాష్' ఆసుపత్రులుగా..
ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నాయని, వైద్యమూ ఉచితమేనని ప్రభుత్వం చెబుతున్నా- ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రామాణిక వైద్యం ప్రాణ రక్షణకు భరోసా ఇస్తుందన్న ఆశతో వ్యయప్రయాసలకోర్చి వెళుతున్న వేలాది కుటుంబాలకు దారుణ అనుభవాలు ఎదురవుతున్నాయి. లక్షల్లో బిల్లులు, ఆరోగ్య బీమా సదుపాయాన్నీ తోసిపుచ్చుతున్న తీరు, నల్లధనం చెల్లింపు డిమాండ్లు, బిల్లు మొత్తం చెల్లించకుంటే మృతదేహాల్నీ అప్పగించని అమానుషాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రులు 'క్యాషు'పత్రులుగా మారి జనాన్ని పిండేస్తున్న వైనంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాగ్రహం వెలిగక్కింది. ప్రభుత్వం నుంచి భూములు రాయితీలు పొంది పేదలకు నిర్దిష్ట శాతం ఉచిత వైద్యానికి కట్టుబడతామన్న ఆసుపత్రులు మాట తప్పడమేమిటని హైకోర్టు, అమానవీయంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తప్పవని ప్రభుత్వం గద్దిస్తున్నాయి. కరోనాపై పోరులో ముందువరస యోధులుగా జాతి నీరాజనాలందుకొన్న వైద్యనారాయణులు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయమిది!
సహేతుక రేట్లతో..