ఒకప్పుడు విద్య లక్ష్యం జ్ఞానసముపార్జన! ఇప్పుడు ఉపాధి కల్పనే లక్ష్యంగా మారింది. ఉపాధి కల్పించలేని విద్య కొరగానిదవుతోంది. అందువల్లే 'నూతన జాతీయ విద్యా విధానం-2020' సైతం ఉపాధి కల్పించే విద్యకే పెద్దపీట వేసింది. దశాబ్దకాలంగా అధిక శాతం ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో మొదటిది, వ్యాపార రంగం. ప్రపంచ గమనాన్ని శాసిస్తోందీ ఈ రంగమే. వ్యాపార పద్ధతుల్లో అనేక మార్పులూ చోటుచేసుకుంటున్నాయి. ఆన్‌లైన్ వ్యాపారం, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఆన్‌లైన్ అకౌంటింగ్ (టాలీ), టాక్సేషన్, ఫిన్‌టెక్ వంటివి వీటిలో ప్రముఖమైనవి. అనేక ఉపాధి అవకాశాలు వీటిలో ఉన్నాయి.అందువల్లే ఇటీవలి కాలంలో బి.కామ్ చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
పరిస్థితులు మారాలి!
డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నవారిలో 40 నుంచి 50 శాతం కామర్స్ కోర్సులనే ఎంచుకుంటున్నారు. అయిదేళ్ల వ్యవధిలో ప్రత్యేక కామర్స్ కళాశాలలు అనేకం ఆవిర్భవించాయి. అయితే, మన దేశంలో వ్యాపార, వాణిజ్య, అకౌంటింగ్ పరిజ్ఞానం కోసం విద్యార్థి ఇంటర్మీడియెట్ వరకు వేచిచూడాల్సి వస్తోంది. ఇంటర్‌లో సీఈసీ చేసి, డిగ్రీలో బి.కామ్ చదివినవారికే వాణిజ్య శాస్త్రంపై అవగాహన ఉంటోంది. అంటే అపార అవకాశాలుగల కామర్స్ పరిజ్ఞానం కోసం ఉన్నతవిద్య దశ వరకు వేచిచూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా వాణిజ్య శాస్త్రాన్ని పాఠశాల స్థాయినుంచే బోధించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలి.
అప్పుడే విద్యార్థికి అవగాహన!
పాఠశాల విద్యలో విధిగా ఆరు పాఠ్యాంశాలను చదివే విద్యార్థికి ఇంటర్మీడియెట్‌లోనే నచ్చిన సబ్జెక్టు ఎంచుకొనే అవకాశం దక్కుతోంది. పది వరకు చదివిన విద్య ఎమ్‌పీసీ, బైపీసీ విద్యార్థులకు ఉపకరిస్తుంది కానీ, సీఈసీ తీసుకున్నవారికి పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ప్రాథమికోన్నత దశలో వాణిజ్య శాస్త్రం ఉండకపోవడమే దీనికి కారణం. నూతన విద్యావిధానంలో ఇంటర్మీడియట్ ఉండదు. కనుక వాణిజ్య శాస్త్రాన్ని తొమ్మిదో తరగతి నుంచి తప్పని సరిగా ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తద్వారా విద్యార్థికి వ్యాపారం, అకౌంటింగ్ ప్రక్రియలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన ఏర్పడే అవకాశం లభిస్తుంది. ఆపై నాలుగేళ్ల డిగ్రీ కామర్స్ కోర్సును స్పష్టమైన అవగాహనతో ఎంచుకునే అవకాశం విద్యార్థికి దక్కుతుంది.