తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనాను మించిన అతి భయంకరమైన వైరస్​! - bribe in India

కరోనా కంటే అతి భయంకరమైన వైరస్​ దశాబ్దాలగా మన దేశాన్ని పట్టి పీడిస్తోంది. అదేనండి.. లంచం. చేతులు తడపందే దస్త్రాలు కదపనివాళ్లు... వైరస్​ రాకతో హఠాత్తుగా మారిపోతే ఎలాంటి 'సైడ్‌ఎఫెక్టు'లు ఉంటాయోనని కలవరపడ్డారు. అందుకే మూతికి మాస్క్‌ కట్టుకుని, చేతులకు శానిటైజర్‌ పూసుకొని మరీ బలకింద చెయ్యి పెడుతున్నారు మన లంచాలరాయుళ్లు.

Special article on bribes during the Coronavirus period
కరోనాను మించిన అతి భయంకరమైన వైరస్​!

By

Published : Jul 30, 2020, 8:15 AM IST

'కమలాక్షునర్చించు కరములు కరములు' అన్నాడు భక్త పోతన. పాపం... వట్టి అమాయకుడు! పరమ పవిత్ర ప్రజాసేవకుల్లోని మాయావి మహాపురుషులు ప్రవచించిన 'లంచములార్జించు చేతులు చేతులు' అన్న 'ముక్తిమార్గం' ఆయనకు తెలియదు. పోనీలెండీ... ఆధునిక భారత అవినీతి కథలు ఆ భాగవతోత్తముడి ఊహకైనా అందని గొప్ప చరితలు కదా మరి!

ఏ పూటకాపూట కుంచాల కొద్దీ లంచాలతో కంచాలు నింపుకొంటూ బంగారు మంచాల మీద పవళించే మహితాత్ములకు మన దేశం పెట్టింది పేరు. ఈ విషయంలో మనకు సరిజోడు చైనా మాత్రమే. సరిహద్దుల దగ్గర గొడవలు పడుతున్నాం కానీ, ఓ హద్దంటూ లేని అవినీతికి గొడుగుపట్టడంలో సర్వదా 'అవినీతిలో మన ఆత్మబంధువు'గా అవతరించిన చైనా నుంచి కరోనా వచ్చిపడ్డాక అందరూ పదేపదే చేతులు తోమేస్తున్నారు. 'చంటీ... నువ్వు కడగవా ఏంటి?' అని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ కరాలన్నీ కరిగిపోయేలా కడిగిపారేస్తున్నారు.

ఈ ఊపులోనే మన సర్కారీ యంత్రాంగమూ తన చేతివాటాన్ని వదిలించుకుని ఉంటుందని చాలామంది భయపడ్డారు. చేతులు తడపందే దస్త్రాలు కదపనివాళ్లు హఠాత్తుగా మారిపోతే ఎలాంటి 'సైడ్‌ఎఫెక్టు'లు ఉంటాయోనని కలవరపడ్డారు. అదృష్టవశాత్తూ అలాంటి ఉపద్రవమేమీ జరగలేదు. మూతికి మాస్క్‌ కట్టుకుని, చేతులకు శానిటైజర్‌ పూసుకొని మరీ బలకింద చెయ్యి పెడుతున్నారు మన లంచాలరాయుళ్లు! ఇంకా కావాలటే ఆ నోట్లకట్టల మీదా కాస్త క్రిమిసంహారకాన్ని పిచికారి చేసి, చేయించి మరీ స్వీకరించి... కళ్లకద్దుకుంటున్నారు!

లంచాలకేంటి లాక్‌డౌన్‌ అనుకుంటూ ఈ పెద్దమనుషులు తమ 'విధి నిర్వహణ'లో తీరికలేకుండా గడిపేశారు కాబట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏసీబీ అధికారులకు ఈ మూడు నెలలూ చేతి నిండా పని దొరికింది. షాబాదు ఠాణా నుంచి ఒంగోలు భూగర్భగనుల శాఖ దాకా- నంబులపూలకుంట (అనంతపురం) తహసీల్దార్‌ కార్యాలయం మొదలు పెద్దఅంబర్‌పేట పురపాలక కమిషనర్‌ వరకూ ఈ మూడు నెలల్లో సాగిన ఏసీబీ దాడులు నిరూపిస్తున్న పరమ సత్యమొక్కటే- దేశంలోకి కరోనా గిరోనా వైరస్సుల్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి. అవి పిల్లకాకులు. అవినీతి వైరస్‌ పక్కా లోకల్‌... నాశనం లేనిది. న్యాయశాస్త్ర శస్త్రములు దాన్ని ఛేదింపజాలవు. జన కోపాగ్ని దహింపజాలదు. బాధితుల కన్నీరు తడుపజాలదు. దాన్ని ఆర్పివేయ ఏ ప్రభుత్వమూ సమర్థము కాదు... కాజాలదు. అయినా అవినీతిని అంతమొందిస్తే నేతాశ్రీలకే నష్టం తప్ప లాభం ఉండదు కదా! ఇంత చిన్న లాజిక్కును మరచిపోతూ 'అవినీతి రహిత భారతావని' గురించి పగటికలలు కనడమేంటి మనం- తప్పు తప్పు!!

సంక్షోభాలనూ తన సంక్షేమానికి వాడుకోవడంలో మనిషి మహా ముదిరిపోయాడు. ఈ విషయంలో అతని సామర్థ్యం చూస్తే భలే ముచ్చటేస్తుంది. కరోనా రాగానే పరీక్షల కిట్ల కొనుగోళ్లలో గోల్‌మాల్‌ చేసే కిటుకు కనిపెట్టారు నాయకోత్తములు. అచ్చం ఇలాగే చేసి, అనుభవరాహిత్యంతో జింబాబ్వే ఆరోగ్య మంత్రి అరెస్టయ్యాడు కానీ- దొరకని దొరల రాజ్యం మన దగ్గర మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. 'ఎహె... కిట్లతో చిలక్కొట్టుడులేంది- మేం ఏకంగా మందులతోనే విందులు చేసుకుంటాం చూడండి' అంటూ రంగంలోకి దిగారు ఇంకొందరు పెద్దమనుషులు. కరోనాకు మంచి మందులనిపించుకున్న వాటన్నింటినీ నల్లబజారులో నిలబెట్టేశారీ ఘనులు. వందల రూపాయల విలువ చేసే గోళీలను వేల రూపాయలకు విక్రయిస్తున్న వీరి వ్యాపార నైపుణ్యం ముందు 'వారెన్‌ బఫెట్‌' మహాశయుడి చిట్కాలు ఎందుకూ కొరగావు. కాబట్టి మిత్రులారా, దిక్కులు పిక్కటిల్లేలా ఒక్కసారి నినదించండి- 'సాహో అక్రమార్క సాహో' అని! ఏదీ మరొక్కసారి సంద్రాలు పొంగిపొర్లేలా- 'జయహో వక్రమార్గ విజయ పథసంచారీ జయహో'!!

గండంలో పడగానే దండం పెట్టడం మనిషికి అలవాటు. 'ఈ ఒక్కసారికి కాపాడు తండ్రీ...ఇకనుంచి అన్నీ మంచిపనులే చేస్తా మహాదేవా' అనుకుంటూ ఒకటికి పది ప్రమాణాలు చేసే పుణ్యమూర్తులూ కొల్లలు. కరోనా కోరలుచాపిన కొత్తలో వాడవాడలా ఇవే ప్రార్థనలు గుట్టుగా సాగిపోయాయి. వారాలు గడిచాయి. మాస్కు బిగించి భౌతిక దూరం పాటిస్తే వైరస్సు ఆటలు సాగవన్న గుట్టు తెలిసింది. అంతే... ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారు. ఎవరికి వారు యమర్జంటుగా పాత పాత్రల్లోకి దూరిపోయారు.

'మనిషి మారలేదు... ఆతని కాంక్ష తీరలేదు' అంటూ నిర్వికారంగా పాడుకుంటున్న కరోనా తన పని తాను చేసుకుంటూ పోతోంది. 'మారితే మనిషి ఎందుకవుతాడే పిచ్చిమొహమా' అని వెక్కిరిస్తూ అవినీతి వైరస్‌ తన విశ్వరూపాన్ని 9డీలో ప్రదర్శిస్తోంది. దీని నివారణకు టీకా కాదు కదా- శానిటైజర్లు, మాస్కుల్లాంటివైనా సరే కనిపెట్టే పిచ్చిపనులు చేస్తారని భ్రమపడకండి!

- శైలేష్‌ నిమ్మగడ్డ

ఇదీ చూడండి:విద్యా విధానంలో చేసిన నూతన సవరణలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details