సినీ, రంగస్థల, ఆకాశవాణి నటులు, ప్రయోక్త, రూపశిల్పి, మార్గదర్శి విన్నకోట రామన్న పంతులు శతజయంతి వత్సరమిది. తాంబూలాలు ఇచ్చేశాం ఇక తన్నుకు చావండి అని గురజాడ వారు 'కన్యాశుల్కం'లో అనిపిస్తారు. అ సినిమా కానీ, నాటకం కానీ చూసిన వారికి ఆ మాట గుర్తుండిపోతుంది. అందుకు కారణం ఆ పాత్ర వేసిన నటుడి అభినయం. ఆ రౌద్రం, ఆ స్వరం... ప్రత్యేకం. ఆ నటుడి పేరు విన్నకోట రామన్నపంతులు. నటులు శాశ్వతం కాదు, కానీ వారి నటన అజరామరం.
రామన్నపంతులు విజయవాడలో పుట్టి, నటన పట్ల ఆసక్తి పెంచుకుని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ- నాటకం, సినిమా, రేడియో... మూడు ప్రక్రియల్లోనూ తనదైన ముద్ర వేశారు. సాంఘిక నాటకాల్లో రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, బళ్ళారి రాఘవ సమకాలీకులు. వారితో కలిసి కొన్ని ప్రదర్శనలు చేశారు. 'కన్యాశుల్కం, వరవిక్రయం, నాటకం, ఇనపతెరలు, సంభవామి యుగే యుగే...' ఇలా ఎన్నో.
దర్శకత్వాలకే అత్యధిక సమయం..
62 ఏళ్ల జీవితంలో 40 ఏళ్లు నాటకానికి, కళాకారుల్ని తీర్చిదిద్దడానికి, మేకప్ వెయ్యడానికి, రంగస్థలానికి కర్టెన్లు కట్టడానికి వెచ్చించారు. తన ఇంటినే రిహార్సల్ గదిగా మార్చారు. నటన, దర్శకత్వాలకే అత్యధిక సమయం వినియోగించారు. ఆయన దర్శకత్వం వహించిన నాటకాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటులు ఎందరో. రామచంద్ర కాశ్యప, ఏఆర్‌కృష్ణ, నిర్మలమ్మ, మురళీమోహన్, అన్నపూర్ణ, వీరభద్రరావు, సుబ్బరాయశర్మ, జంధ్యాల వంటివారు ఆ జాబితాలోకి వస్తారు.
అయిదు నిమిషాల నిడివికే.. ఉత్తమ నటుడిగా
డీవీ నరసరాజు, రామన్నపంతులు కలిసి ఎన్నో నాటకాలు సృష్టించారు. నరసరాజు రాసిన 'నాటకం' అనే నాటకంలో కేవలం అయిదు నిమిషాల నిడివి ఉన్న పాత్ర వేసి పరిషత్తుల్లో ఉత్తమ నటుడి అవార్డు పొందారాయన. రచయితగా, దర్శకుడిగా, రూపశిల్పిగా, నటుడిగా, నాటక పరిషత్తు నిర్వాహకుడిగా, పరిషత్తు న్యాయనిర్ణేతగా, నాటక శిక్షణ శిబిరాల అధ్యాపకుడిగా, సమ్మేళనాల్లో వక్తగా ఆయన చేసిన సేవలకు ఆధునిక, సాంఘిక నాటకం మురిసిపోయింది. ఆయన కాలంలో నాటకం అక్షరాలా మెరిసిపోయింది.
ఆణిముత్యాల్లాంటి పాత్రల్లో..
సినిమా నటుడిగా ఆయన జగ్గయ్య, సీఎస్‌ఆర్, ఎస్‌వీ రంగారావు వంటి మేటి నటుల సమకాలీకుడు. న్యాయవాద వృత్తి, విజయవాడ మీద ప్రేమ, నాటకరంగం పట్ల అంకితభావం ఆయనకు ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వలేదు. అయినా ఆణిముత్యాల్లాంటి పాత్రల్లో 'గంగిగోవు పాలు' అన్నచందాన నటించారు. 'బంగారు పాప, వరుడు కావాలి, కన్యాశుల్కం, దొంగరాముడు, చదువుకున్న అమ్మాయిలు, బాటసారి, భక్త రామదాసు, శ్రీమతి, సాక్షి, బంగారు పిచుక, స్నేహం, ముద్దమందారం' సినిమాల్లో ఆయన వేసిన పాత్రలు నేటికీ నిలిచి పోయాయి. 'ముద్దమందారం' సినిమాకు ఆయన శిష్యుడు జంధ్యాల దర్శకత్వం వహించడం ఒక విశేషమైతే... ఆయన మనవడు ప్రదీప్ ఆ సినిమా హీరో. రామన్న పంతులు కుమారుడు విన్నకోట విజయరాం ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. అలా మూడు తరాల నటులు ఒకే సినిమాలో నటించడం మరో విశేషం. బాపు దర్శకత్వం వహించిన 'సాక్షి' సినిమాలో మునసబుగా, 'బంగారు పిచుక' సినిమాలో భార్య చాటు భర్తగా, 'ముద్దమందారం'లో ప్రేమ జంటను కలిపే తాతగా ఆయన నటన మరిచిపోలేనిది.
విన్నకోట.. 'ఓకల్ స్టార్'
ఇక 'ఆకాశవాణి' నటుడిగా ఆయన ప్రస్థానం చరిత్ర మరవలేనిది. ఎన్ని నాటకాలో, ఎన్ని నాటికలో, ఎన్ని ధారావాహికలో... రేడియో హీరోగా ఉన్న రోజుల్లో, ఆయన రేడియోకే హీరో. 'ఓకల్ స్టార్'. తనదైన ప్రత్యేక మాడ్యులేషన్‌తో శ్రోతల్ని కట్టిపడేసేవారు. ఒకటో, రెండో నాటికలు రేడియోలో వేసి 'ఏఐఆర్ ఆర్టిస్ట్' అని విజిటింగ్ కార్డు వేసుకునే రోజుల్లో విజిటింగ్ కార్డు అవసరం లేని రేడియో సూపర్‌స్టార్‌గా వెలిగారు రామన్నపంతులు. 1975 ప్రాంతాల్లోనే ఆకాశవాణి డైలీ సీరియల్ (లైవ్) 'సీతాపతి సంసారం'లో ఆయన సీతాపతి. 'వరవిక్రయం'లో ఆయన పాత్ర నటీనటులకు మార్గదర్శకం.
అందులో ఆయనే తొలివ్యక్తి..
'నటశిక్షణ' అనే పుస్తకాన్ని రాసి రంగస్థలం మీద నటుడు ఎలా రాణించాలో, సాంకేతికతను ఎలా పెంపొందించాలో 50 ఏళ్ల క్రితమే చెప్పిన రచయిత ఆయన. నట శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి. నటుడికి ఆహార్యం చేసుకోవడం రావాలని చెప్పేవారు పంతులుగారు. మామూలుగా ఒక వ్యక్తికి ఒక ప్రజ్ఞ ఉంటుంది. కానీ విన్నకోట రామన్నపంతులు బహుముఖ ప్రజ్ఞాశాలి... ఎందరికో స్ఫూర్తి ప్రదాత!
- ప్రదీప్ (రచయిత సినీనటుడు)
ఇదీ చూడండి:ఆకాశవీధిలో అందాల జాబిలి...సావిత్రి