‘నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ... నా పాట పంచామృతం’ అంటూ అనితర సాధ్యంగా అయిదున్నర దశాబ్దాలపాటు బాలసుబ్రహ్మణ్యం చేసిన స్వరాభిషేకం ముగిసింది. ఉచ్ఛ్వాసం కవనం, నిశ్వాసం గానమై 16 భాషల్లో నలభైవేల పాటల పూదోటగా తన సుస్వర పేటికను మలచి నవ పారిజాతాల్ని విరబూయించిన గాన గాంధర్వం మూగవోయింది. శ్రీపతి పండితారాధ్యుల వారి అబ్బాయి శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నతో మొదలుపెట్టి పాటశాలలో నిత్య విద్యార్థిగా ఎదిగి దిగ్దంత సంగీత స్రష్టల ముద్దు బిడ్డడై ఒదిగి భారతీయ సినీ నేపథ్యగానానికి మణిమకుటమై భాసించిన వైనం అచ్చెరువు గొలుపుతుంది. శాస్త్రీయ సంగీత వ్యాకరణం నేర్వకపోయినా ఏక సంథాగ్రాహిగా సంగీత దర్శకులకు ఏం కావాలో ఇట్టే పసిగట్టి, పాటకోసం ప్రాణం పెట్టి, తరాల అంతరాలకు వారధి కట్టి, తనను తాను నిత్యనూతనంగా ఆవిష్కరించుకొన్న బాలు- ఒక్క మాటలో గాన కళా తపస్వి! ఆత్మీయులు ముద్దుగా పిలుచుకునే మణి- ఏ ప్రాంతీయ చిత్రాలకు పాడినా ఆ భాషా సంప్రదాయాన్ని ఆపోశన పట్టి ‘బాలూ మావాడే’ అని దేశమంతా అక్కున చేర్చుకొన్న మహా విద్వన్మణి! పెద్దలపట్ల ఎనలేని గౌరవం, సమవయస్కులపట్ల స్నేహభావం, పిన్నలంటే అమిత ఆదరం కలగలిసి మూర్తీభవించిన సమున్నత వ్యక్తిత్వంగల బాలూ- అజాత శత్రువు కావడంలో వింతేముంది! సినీ జీవన ప్రస్థానంలో పద్మభూషణుడై ఎదిగినా, తాను సర్వజ్ఞుణ్ని కానన్న ఎరుకతో ఒద్దికగా, ఆత్మవిశ్వాసం సడలని అణకువతో మర్యాదకు పర్యాయపదంగా నిలిచిన బాలూ ఆదర్శం అనుసరణీయమైనది. కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేస్తూ ఫేస్‌బుక్ మాధ్యమంగా అభిమానులు కోరిన పాటకు రుసుము పెట్టి, వచ్చిన మొత్తాన్ని ఎస్‌పీబీ ట్రస్టు ద్వారా ప్రజాహిత కార్యాలకు మళ్ళించదలచిన బాలూ- గొప్ప మానవతావాది. ఆ మానవతా జయ కేతనంపై కన్ను కుట్టిన కరోనా- ఊపిరి సలుపని సంగీత జైత్రయాత్రా పథికుడిపై కసిగా మృత్యుపాశాలు విసరింది. ఆ విష క్రిమికి తెలియదు- మన బాలూ అజరామరుడని!
పాటకు మణిమకుటం- గాన కళా తపస్వి - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఉచ్ఛ్వాసం కవనం, నిశ్వాసం గానమై 16 భాషల్లో నలభైవేల పాటల పూదోటగా తన సుస్వర పేటికను మలచి నవ పారిజాతాల్ని విరబూయించిన గాన గాంధర్వం మూగవోయింది. శ్రీపతి పండితారాధ్యుల వారి అబ్బాయి శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నతో మొదలుపెట్టి 'పాట'శాలలో నిత్య విద్యార్థిగా ఎదిగి దిగ్దంత సంగీత స్రష్టల ముద్దు బిడ్డడై ఒదిగి భారతీయ సినీ నేపథ్యగానానికి మణిమకుటమై భాసించిన వైనం అచ్చెరువు గొలుపుతుంది. శాస్త్రీయ సంగీత వ్యాకరణం నేర్వకపోయినా ఏక సంథాగ్రాహిగా సంగీత దర్శకులకు ఏం కావాలో ఇట్టే పసిగట్టి, పాటకోసం ప్రాణం పెట్టి, తరాల అంతరాలకు వారధి కట్టి, తనను తాను నిత్యనూతనంగా ఆవిష్కరించుకొన్న బాలు- ఒక్క మాటలో గాన కళా తపస్వి!
‘నా మాతృ భాష సంగీతం’ అన్న బాలు- భారతీయతకు నిలువెత్తు రూపు. మదరాసీ గళం హిందీ చిత్ర గీతాలకు ఒప్పదని లక్ష్మీకాంత్ అభ్యంతరపెట్టినా- ఎల్లలు లేని సంగీతమూ తానూ ‘ఏక్ దూజే కే లియే’ అని నిర్ద్వంద్వంగా నిరూపించినవాడు బాలూ! పాత్రల హావభావాల్ని తన గళంలో పలికించి తెర బొమ్మల వైశిష్ట్యాన్ని పెంచిన బాలూ తనలోని నటుణ్ని తెరంగేట్రం చేయించి ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన తీరు మరపురానిది. కాలక్రమంలో డబ్బింగ్ కళాకారుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఎదిగిన బాలూ- బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీత సాహిత్య సమలంకృత నేపథ్యగానానికి తన అకుంఠిత దీక్షా నిబద్ధతలతో బాలూ సమకూర్చిపెట్టిన గౌరవం అనన్య సామాన్యమైనది. దశాబ్దాల అనుభవసారంగా పోగుపడిన స్వర జ్ఞాన నిధిని ముందు తరాలకు పదిలంగా అందిస్తూ, కొత్త గాయకుల విస్తృత పరిచయ వేదికగా ఈటీవీ నిర్వహిస్తున్న ‘పాడుతా తీయగా...’ బాలూను ఇంటింటి ఆత్మబంధువుగా మార్చేసింది. రసరమ్య గీతాల లోతుపాతుల్ని పామర జన రంజకంగా విడమరుస్తూ, పిల్లల గాత్ర దోషాల్ని సరిదిద్దుతూ, ప్రాతః స్మరణీయ విద్వాంసుల ఘనతను వేనోళ్ల కొనియాడుతూ ఆ కార్యక్రమాన్ని అన్నీ తానై బాలూ రక్తి కట్టించిన తీరు నిరుపమానమైనది. అదే వేదికమీద ‘బాలూ కాస్త కష్టపడితే నాలా పాడగలడు... నేను కష్టపడ్డా మా అబ్బాయిలా పాడలేను’ అంటూ వాగ్గేయకారుడు బాల మురళీకృష్ణ ఇచ్చిన కితాబు చాలు- బాలూ స్థాయి తెలియడానికి! పుత్రవాత్సల్యంతోనే అంతగా దీవించారన్న బాలూ- ‘ఒక అవతార పురుషుడు ఇతణ్ని ఇలా ఆశీర్వదించా’రంటూ తన సమాధి శిలాఫలకం మీద రాయాలని అభిలషించిన కర్మయోగి. ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా, కదిలేటి నదిలా, కలల వరదలా సంగీత ప్రియుల్ని ఆనందాంబుధిలో ఓలలాడించిన బాలూ లేని లోటు- వేరెవ్వరితోనూ తీరేది కాదు!