'చట్టం అందరి చుట్టం కాదు!'
'నిజమే కదా, చట్టం ఎవరి చుట్టమూ కాదు'
'అది తప్పు... అందరికీ చుట్టం కాదు, కొంతమందికి తప్ప!'
'అదెలా- చట్టం ముందు అందరూ సమానమే కదా?'
'అందరూ అంతే సమానం కాదు, కొందరు కొంత ఎక్కువ సమానం'
'అర్థం కాలేదు, తికమకగా ఉంది.'
'అందుకే కదా, అర్థం చేసుకుని అక్కున చేర్చుకున్న వారికి చట్టం దగ్గరి చుట్టమైంది. ఆ వైపే ఆలోచించని వారికి ఎప్పుడోగాని పలకరించని దూరపు చుట్టంలా మారింది.'
'తప్పు చేసిన వారెవరైనా చట్టం ముందు తలవంచాల్సిందే కదా!'
'కానీ, నేతాగ్రేసరులు, అధికార పదవీకారులు, సర్కారీ హోదాధరులు, పలుకుబడితో చెలరేగే పైరవీకారులు... ఇలాంటి ప్రత్యేక వర్గవీరులంతా చట్టం తమను ప్రత్యేకంగా గౌరవించాలని, ఇతరులకు లేని వెసులుబాట్లెన్నో ఉండాలని కోరుకుంటున్నారు.'
'అదెలా కుదురుతుంది... చట్టానికి తరతమ భేదభావాలేమీ ఉండవు కదా?'
'ఉండితీరాలన్నదే ఈ కోటాజీవుల నమ్మకం. రాజస్థాన్‌లో తాగి వాహనం నడిపిన ఓ కుర్రాడిని పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు. ఆ కుర్రాడి మేనత్త అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, తన భర్త, భజన బృందం, అనుచరులతో కలిసి పోలీసుస్టేషన్‌పైకి దండెత్తి నానా హడావుడి చేసి ధర్నాకు దిగారు. కుర్రాళ్లన్నాక ఆ మాత్రం తాగరా ఏమిటి అని తెగ ఆశ్చర్యాన్ని ప్రకటించి, తమలాంటి ప్రముఖుల సంబంధీకులతో ఎలా నడుచుకోవాలో ప్రొటోకాలోపదేశం చేసి, కుర్రాడిని విడిపించుకుని తీసుకుపోయారు. ఇప్పుడెలా చెప్పుకోవాలి... చట్టం అందరి చుట్టమా, కొందరి చుట్టమా?'
'ఏదో ఎక్కడో ఒకచోట ఒకటీఅరా ఉల్లంఘనుల్ని చూసి, మొత్తం వ్యవస్థకే బురదపూస్తే ఎలా?'
'ఎదుటివారికి బురద పూయడం రాజకీయశ్రేణులకు నోటితో పెట్టిన విద్య! ఇలాంటి అదరగొట్టే నైపుణ్య ప్రదర్శన అందరికీ రాదు. అనారోగ్య కారణాలతో బెయిలుపై జైలు నుంచి బయటికొచ్చిన మధ్యప్రదేశ్ భాజపా ఎంపీ ఆటలాడుతున్న, నృత్యాలు చేస్తున్న వీడియోలు బయటికి వచ్చాయంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ నేతలు వేలెత్తి చూపారు. యూపీలో రైతులపై కాన్వాయ్ దూసుకెళ్ళిన ఘటనలో కేంద్రమంత్రి కుమారుడి అరెస్టుకు ఆలస్యం చేశారంటూ ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది. తామేం తక్కువంటూ, ఛత్తీస్‌గఢ్‌లో నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న భక్తులపై నుంచి ఎస్‌యూవీ దూసుకెళ్ళిన కేసును ఏమార్చారంటూ అక్కడి విపక్ష నేతలు ఆ రాష్ట్ర సర్కారుపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇదంతా, అధికార, విపక్షాల మధ్య అలవాటుగా సాగే బురద ఆట!'