తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఏ విపత్తుకైనా ప్రకృతిలోనే పరిష్కారాలు! - biodiversity latest news

భూగోళంపై జీవవైవిధ్యం ప్రాముఖ్యం, అది ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగించడానికి ఐక్యరాజ్యసమితి 2010 మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవానికి నాంది పలికింది. నేడు ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న వేళ ఈ ఏడాది జీవవైవిధ్య దినోత్సవాన్ని 'మన పరిష్కారాలు ప్రకృతిలో ఉన్నాయి' అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. నేటి విపత్తును ఎదుర్కోవడానికి ప్రకృతిని కాపాడుతూ దానికనుగుణంగా భవిష్యత్తును నిర్మించుకోవడానికి అన్ని స్థాయిల్లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ నినాదం తెలియజేస్తోంది.

world biodiversity day
ప్రకృతిలోనే పరిష్కారాలు!

By

Published : May 22, 2020, 9:10 AM IST

సకల జీవులకు ఆధారమైన భూమిపై జీవవైవిధ్యం ఒక సహజ ప్రక్రియ. భూమిపై ఉన్న జీవుల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. ఇది జాతి, జన్యు, ఆవరణ, వ్యవస్థలపరంగా ఉంటుంది. ప్రకృతిలో కోట్లాది సంవత్సరాల క్రితం ప్రాణికోటి ఆవిర్భవించినది. ప్రపంచవ్యాప్తంగా 87 లక్షల మొక్కలు, జంతు జాతులున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అందులో ఇప్పటివరకు కేవలం 12 లక్షల జాతులను మాత్రమే గుర్తించారు. జీవవైవిధ్యం మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను చూపిస్తుంది. ప్రకృతి సమతుల్యానికి మానవ జీవన విధానమూ దోహదం చేస్తుంది. భూగోళంపై జీవవైవిధ్యం ప్రాముఖ్యం, అది ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగించడానికి ఐక్యరాజ్యసమితి 2010 మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవానికి నాంది పలికింది. నేడు ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న వేళ ఈ ఏడాది జీవవైవిధ్య దినోత్సవాన్ని 'మన పరిష్కారాలు ప్రకృతిలో ఉన్నాయి' అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. నేటి విపత్తును ఎదుర్కోవడానికి ప్రకృతిని కాపాడుతూ దానికనుగుణంగా భవిష్యత్తును నిర్మించుకోవడానికి అన్ని స్థాయిల్లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ నినాదం తెలియజేస్తోంది.

మానవ తప్పిదాలతోనే ముప్పు

పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణవల్ల సహజ వనరులపై తీవ్రఒత్తిడి ఏర్పడుతోంది. కాలుష్యం పెచ్చరిల్లుతోంది. మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు. అడవులు నరకడం, రసాయన ఎరువుల వినియోగం, ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు, ఖనిజాల కోసం పర్వతాలను తవ్వడంలాంటి చర్యల ఫలితంగా అసంఖ్యాక జంతు, వృక్షజాతులు అంతరిస్తున్నాయి. పచ్చిక బయళ్లు, సముద్రతీరాలు, పగడపు దిబ్బలు, చిత్తడి నేలలు అతలాకుతలమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, సునామీలువంటి విపత్తులూ జీవవైవిధ్యానికి పెను సవాలుగా మారాయి. ఈ చర్యలవల్ల ఆహార భద్రతకు, ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పది లక్షలకు పైగా వృక్ష, జంతు జాతులు అంతరించే స్థితికి చేరుకున్నాయని 'ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌ పాలసీ ఫ్లాట్‌ ఫాం (ఐపీబీఈఎస్‌)' గత సంవత్సరం వెలువరించిన నివేదికలో తెలిపింది. కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి మనిషికి వ్యాపించినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గతంలో ఎబోలా, బర్డ్‌ఫ్లూ, జికా వైరస్‌ వంటివన్నీ వన్యప్రాణుల నుంచి మనుషులకు సోకినవే. నేటి కరోనా ఉపద్రవం జీవవైవిధ్య, పర్యావరణ విధ్వంసానికి నిదర్శనం అని చెప్పవచ్ఛు 1992లో బ్రెజిల్‌లో జరిగిన ధరిత్రీ సదస్సు జీవవైవిధ్య పరిరక్షణను నొక్కి చెప్పింది. తదుపరి 'కాప్‌' సమావేశాల్లో ఆధునిక జీవవైవిధ్య సవాళ్లను అధిగమించే దిశగా చర్చలు జరిగాయి. ప్రస్తుతం జీవవైవిధ్య సంరక్షణకు ఈ ఏడాది నిర్వహించబోయే కాప్‌-15 సదస్సు మరోసారి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీని ముసాయిదా ప్రతిపాదనలో వాతావరణ మార్పులు, ఆవాసాల నష్టం, కాలుష్యం తదితర అంశాలను చేర్చారు. సుస్థిరాభివృద్ధి కోసం 2030 ఎజెండా అమలు, వ్యూహాత్మక ప్రణాళిక ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తారు.

అమలుకాని చట్టాలు

ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య సంరక్షణకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అనేక ఒప్పందాల ద్వారా అంతరించిపోయే అరుదైన జాతులను అంచనా వేసి అవసరమైన చర్యలు చేపడతారు. అందులో భాగంగా భారతదేశం కూడా అనేక చర్యలు చేపట్టింది. భారతీయులు అనాదిగా ప్రకృతిని ఆరాధిస్తున్నారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు జీవవైవిధ్యానికి నెలవుగా ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద జీవవైవిధ్య దేశాల్లో భారత్‌ ఒకటి. నాలుగు జీవవైవిధ్య ప్రజ్వలన కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఇండియాలోనూ అనేక జీవవైవిధ్య సంరక్షణ చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదని అనేక అధ్యనాలు పేర్కొంటున్నాయి. రాబందులు, పిచ్చుకలు, కాకులు, బెంగాల్‌ టైగర్‌, ఆసియా సింహం, రెడ్‌ పాండా, ఖడ్గమృగంవంటి అనేక అరుదైన జాతుల మనుగడ ప్రమాదపుటంచున ఉంది. ప్రపంచ దేశాలు చట్టపరమైన, విధానపరమైన చర్యలు చేపట్టి జీవవైవిధ్య సంరక్షణకు కృషి చేయాలి. పర్యావరణ హిత చర్యలు చేపట్టి సుస్థిర అభివృద్ధికి తోడ్పడాలి. ప్రభుత్వం చట్టాలను క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలి. అంతిమంగా మానవుడు ప్రకృతిని జయించాలని వెళ్తే ఏదో ఒక సందర్భంలో అది తిరగబడి తన అధీనంలోకి తీసుకుంటుందనే సత్యం నేడు కరోనా విపత్తు చెబుతున్న పాఠం. కావున ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రకృతి విధ్వంసానికి స్వస్తి చెప్పి జీవవైవిధ్య రక్షణ కోసం పాటుపడాలి.

-సంపతి రమేష్‌ మహారాజ్ ‌(రచయిత- సామాజిక విశ్లేషకులు)

ABOUT THE AUTHOR

...view details