శిలాజ ఇంధనాలపై ఆధారపడి మానవాళి సాగించిన ప్రగతి ప్రస్థానం- పెను పర్యావరణ సంక్షోభాలకు అంటుకట్టి మనిషి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. పర్యావరణ హితకర అభివృద్ధిని ప్రపంచదేశాలు పలవరిస్తున్నవేళ- కొత్త శతాబ్ది విద్యుత్ అవసరాలు తీర్చడంలో సౌర విద్యుత్తుదే కీలక పాత్ర కానుంది. మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్లాంటు ప్రారంభోత్సవవేళ ప్రధాని మోదీ చెప్పినట్లు- స్వావలంబనకు ప్రతీక అయిన సౌరశక్తి దేశ విద్యుత్ అవసరాలకు పూర్తిగా అక్కరకొస్తుంది! అంతకుమించి ఏటా 15లక్షల టన్నుల బొగ్గుపులుసు వాయువుకు సమానమైన వినాశకర ఉద్గారాల్ని దేశం తగ్గించగల వీలు ఆ ఒక్క ప్లాంటు ద్వారానే సాధ్యపడనుంది.
కార్యచరణ మెరుగుపడితేనే..
2022 నాటికి 175 గిగావాట్ల సౌరశక్తి ఉత్పాదన సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొన్న ఇండియా ఇప్పటికి 34.6 గిగావాట్ల సామర్థ్యాన్ని ఒడిసిపట్టింది. సౌరఫలకాలు, బ్యాటరీ, నిల్వ తయారీ సామర్థ్యాన్ని ఇండియా దేశీయంగా ఇనుమడింపజేసుకోకుంటే- సౌరశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అవకాశం చేజారిపోతుందన్న ప్రధాని విశ్లేషణ పూర్తిగా అర్థవంతం. సౌర విద్యుత్ తయారీ ఉపకరణాల మార్కెట్టునూ చౌక ఉత్పాదనలతో గుప్పిట పట్టిన చైనానుంచి 2018-19లో రూ.21,000కోట్ల మేర ఇండియా దిగుమతులు చేసుకొందన్నది యథార్థం. 2014 లగాయతు సౌరవిద్యుత్ ఉత్పాదనలో గణనీయ ప్రగతి సాధించిన ఇండియా- 80శాతం ఉపకరణాల కోసం చైనామీదే ఆధారపడుతోంది. ఆత్మ నిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) లక్ష్యసాధనలో భాగంగా సౌరవిద్యుత్ ఉపకరణాలన్నీ దేశీయంగానే ఉత్పత్తి కావాలని ప్రధాని కోరుతున్నారు. ఏటా 20 గిగావాట్ల సోలార్ సెల్ తయారీకి డిమాండు ఉన్నా దేశీయంగా సామర్థ్యం మూడు గిగావాట్లకే పరిమితమైంది. ఈ అవరోధాల్ని అధిగమించేలా కేంద్ర సర్కారు కార్యాచరణ పదును తేలాలి!
దీర్ఘకాలిక వ్యూహంతోనే..