తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పారిశ్రామిక సంస్థల సామాజిక బాధ్యతతో పల్లెలకు బాసట - పారిశ్రామిక సంస్థలు

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో 'కంపెనీల సామాజిక బాధ్యత' ఒక సంజీవని. భారత్‌ లాంటి అధిక జనాభా గల దేశాల్లో సామాజిక బాధ్యత చాలా అవసరం. విద్య అవసరమైనచోట సంస్థల సామాజిక బాధ్యత వెల్లివిరియాలి. గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారత వికాసం సాకారం కావాలంటే పారిశ్రామిక సంస్థలు తమ కార్యక్రమాలను పల్లెల వరకు చేరేలా చూసుకోవాలి. అప్పుడే గ్రామస్వరాజ్య సాధన ఆశయం సిద్ధిస్తుంది.

SOCIAL RESPONSIBILITIES  INDUSTRIES TO HELP VILLAGES
పారిశ్రామిక సంస్థల సామాజిక బాధ్యతతో పల్లెలకు బాసట

By

Published : Jul 23, 2020, 6:50 AM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో కుంటువడిన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే ఉద్దేశంతో తీసుకొచ్చిన సంస్కరణల్లో కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' ప్రపంచంలోనే అతి పెద్ద ఆపద్బాంధవ పథకంగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో 'కంపెనీల సామాజిక బాధ్యత' ఒక సంజీవనిగా చెప్పాలి. కరోనా ప్రభావం వల్ల ఏర్పడిన వివిధ సామాజిక సమస్యలైన తిరోగమన వలసలు (రివర్స్‌ మైగ్రేషన్‌) ఆకలి, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యల నిర్మూలనలో దీని పాత్ర ఎంతో ఉందని, అభివృద్ధికి ప్రధానమైన గ్రామీణ భారతాభివృద్ధిని పునరుజ్జీవింప చేయవచ్చునని గత అనుభవాలు చెబుతున్నాయి.

హోవార్డ్‌ బౌర్‌ అనే అమెరికన్‌ ఆర్థికవేత్త మొదటిసారిగా 1953లో 'వ్యాపార సంస్థల సామాజిక బాధ్యత'(సీఎస్‌ఆర్‌) భావనను వెలుగులోకి తెచ్చాడు. సంస్థలు కేవలం లాభాపేక్షతో పనిచేస్తే సమాజంలో సామాజిక అంతరాలు పెరిగి, తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్నాడు బౌర్‌. అప్పుడు దీర్ఘకాలంలో కంపెనీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందనీ హెచ్చరించాడు. సామాజిక బాధ్యతను మొట్టమొదటగా చట్టబద్ధం చేసిన ఘనత భారత దేశానిదే. దీని ప్రకారం సగటున వార్షిక పెట్టుబడి రూ.500 కోట్లు లేదా రూ.1000 కోట్ల టర్నోవర్‌ కలిగిన లేదా అయిదు కోట్లపైన ఆదాయం ఉన్న సంస్థలు తమ నికరాదాయంలో రెండు శాతం సామాజిక బాధ్యత కింద విద్య, వైద్యం, లింగ సమానత్వం, సంక్షేమం, ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల నిర్వహణ, దారిద్య్ర నిర్మూలన తదితర అంశాలపై ఈ నిధులు ఖర్చు చేయాలని కంపెనీ చట్టంలోని సెక్షన్‌ 135 నిర్దేశిస్తుంది. ఇందులో పేర్కొన్న అంశాలన్నీ ఆత్మ నిర్భర్‌ భారత్‌కు సంబంధించినవి. భారత్‌ లాంటి అధిక జనాభా గల దేశాల్లో సామాజిక బాధ్యత చాలా అవసరం.

కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2019నాటి గణాంకాల ప్రకారం కంపెనీల సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న మొత్తం కంపెనీలు 24,902. సుమారుగా రూ.18,653 కోట్లు దీనికింద ఖర్చు చేశారు. 43 శాతం నిధులు ప్రభుత్వరంగ సంస్థల్లో వివిధ కారణాల రీత్యా సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు చేయలేకపోయిన్నట్లు తెలుస్తోంది. దేశంలో సామాజిక బాధ్యత కింద వివిధ కంపెనీలు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చాయి. విదేశీ కంపెనీలకన్నా స్వదేశీ సంస్థలైన టాటా కెమికల్స్‌, ఇన్ఫోసిస్‌, భారత్‌ పెట్రోలియం, మహీంద్రా, ఐటీసీ, రిలయన్స్‌, హిందూజా లాంటి కంపెనీలు నిరుడు పెద్ద మొత్తంలో నిధులు సామాజిక బాధ్యత కింద వ్యయపరచాయి. టాటా సంస్థ వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అశోక్‌లేలాండ్‌ బస్‌ సౌకర్యాలు చేపట్టింది. భారత్‌ పెట్రోలియం జల సంరక్షణకు సంబంధించిన పథకం తీసుకుంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంచార ఆరోగ్య సేవలపై దృష్టి సారించింది. నాల్కో ఉచిత వాహన సదుపాయం... ఇవన్నీ సామాజిక బాధ్యత మేరకు సాకారమైన కార్యక్రమాలే!

ఉద్యాన వన పంటలు, పశుసంపద వాటా దేశ వ్యవసాయ జీడీపీలో 60శాతం పైమాటే. అయినా ఆయా రైతాంగం తమ శ్రమఫలాలను అమ్ముకోలేని దుస్థితి ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు పండించిన కూరగాయలను సమీప విపణులకు సరఫరా చేయడానికి ఉచిత వాహనాలను కంపెనీలు సమకూర్చడం ద్వారా రైతుకు ఊతమిస్తున్నాయి. వలస కూలీలు వెనక్కు వెళ్లిపోవడం (రివర్స్‌ మైగ్రేషన్‌) కరోనా సృష్టించిన మరో ఉత్పాతం. దేశంలో వలస కూలీలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీరి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పల్లెలకు తిరిగివెళ్తున్న వీరికి ఉపాధి కల్పించడం పెద్ద సవాలుగా మారింది. ఉపాధి హామీ పథకానికి సాన పట్టినా అది తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. పూలతోటల సాగు, కూరగాయల పెంపకం, కోళ్లు, చేపలు, పశుపోషణ, సేంద్రియ వ్యవసాయం తదితర అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ వికాసానికి పునాదులు వేయవచ్ఛు నగర పట్టణాలు, గ్రామాలకు పెరిగిన అంతరాన్ని తగ్గించడానికి కరోనా ఇచ్చిన అవకాశంగా ఈ పరిస్థితిని వీక్షించాల్సిన అవసరం ఉంది. దేశంలో 31.45 లక్షల కుటుంబాలు ఆధారపడిన చేనేత రంగానికి ఆపన్న హస్తం అందించడానికీ కంపెనీలు ముందుకురావాలి. దేశంలో విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి అనేక సంవత్సరాలు గడచినా గ్రామీణ అక్షరాస్యత మాత్రం 68.9 శాతంగానే ఉంది. అనేకమంది పిల్లలు చదువులను మధ్యలోనే మానేస్తున్నారు. ఝార్ఖండ్‌లో పాఠశాల విద్యను పూర్తిచేస్తున్న ఆదివాసీ పిల్లలు 30 శాతమే ఉండటం అందుకు నిదర్శనం. విద్య అవసరమైనచోట సంస్థల సామాజిక బాధ్యత వెల్లివిరియాలి. కొన్ని పారిశ్రామిక సంస్థలు నిజాయతీగా ఈ పవిత్ర ధర్మాన్ని పాటిస్తున్నా అనేకం అరకొరగానే నిధులిస్తున్నాయి. గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారత వికాసం సాకారం కావాలంటే పారిశ్రామిక సంస్థలు తమ కార్యక్రమాలను పల్లెల వరకు చేరేలా చూసుకోవాలి. అప్పుడే గ్రామస్వరాజ్య సాధన ఆశయం సిద్ధిస్తుంది.

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌

ABOUT THE AUTHOR

...view details