సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు పరిమిత పెట్టుబడులతో ఉత్పత్తి, ఉపాధి కల్పన చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశంలో ఆరు కోట్ల 30 లక్షలకు పైబడిన లఘు పరిశ్రమలు ప్రత్యక్షంగా ఎనిమిది కోట్లు, పరోక్షంగా పన్నెండు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 90శాతం పరిశ్రమలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. భారత కార్మిక శక్తిలో 40శాతం ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉపాధి పొందుతోంది.
సుమారు ఎనిమిది వేల రకాల వస్తువులను ఈ రంగమే తయారు చేస్తోంది. యువతకు ఉపాధి కల్పించాలంటే ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి తప్పనిసరి. మనుగడకోసం పోరు సాగిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కొవిడ్ సంక్షోభం తీవ్రంగా దెబ్బతీసింది. దేశ ఆర్థిక పునరుజ్జీవనానికి, గ్రామీణాభివృద్ధికి ఎంఎస్‌ఎంఈలు కీలకమైనవి కావడంతో- ప్రభుత్వం ఆత్మనిర్భర్ కింద ఉపశమన చర్యలను చేపట్టింది. ప్రత్యేక ప్యాకేజీ అమలవుతున్న విధానాన్ని సమీక్షించి, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
ప్రభుత్వాలదే బాధ్యత
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు భారత స్థూల దేశీయోత్పత్తిలో 30శాతం, దేశ పారిశ్రామిక ఉత్పాదనలో 45శాతం, ఎగుమతుల్లో 40శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలు స్థానిక ప్రపంచ మార్కెట్‌లో గొలుసుకట్టు అవసరాలను తీర్చడానికి భిన్నమైన ఉత్పత్తులతో విస్తరించాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 2006లోనే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టం రూపొందినా- మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవవనరుల కొరత; సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంవంటి సమస్యలు ఎంఎస్‌ఎంఈల పురోగతికి సవాలుగా మారాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలువంటి కష్టాలకు కొవిడ్ సంక్షోభం తోడు కావడంతో ఈ పరిశ్రమలు నష్టాల ఊబిలోకి జారుకున్నాయి.
సమాధాన్..
ప్రభుత్వ రంగ సంస్థల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే- సాయం చేయడానికి 2017లో 'సమాధాన్' పోర్టల్ ప్రారంభించారు. అంకుర సంస్థలకు రుణాలు సకాలంలో అందించడానికి చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ద్వారా నిధిని ఏర్పాటు చేశారు. పెట్టుబడుల పరిమితిని పెంచారు. ఉత్పత్తి, సేవా రంగాల మధ్య వ్యత్యాసం తొలగించారు. ముద్ర బ్యాంక్‌తో రుణ సదుపాయం అందిస్తున్నారు. వాణిజ్య వ్యాపార కార్యకలాపాల కోసం ఎలెక్ట్రానిక్ డిస్కౌంట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంప్రదాయ లఘు పరిశ్రమల పునరుద్ధరణ, అభివృద్ధికి సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవ నిధి పథకం (స్ఫూర్తి) అమలు చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం అందించిన కొవిడ్ నష్ట నివారణ ప్రత్యేక ప్యాకేజీతో లఘు పరిశ్రమలు ఆర్థికాభివృద్ధి బాటపట్టలేదని మూడీస్ సంస్థ విశ్లేషించింది. లఘు పరిశ్రమల పునరుజ్జీవనానికి కనీసం మూడేళ్ల పాటు అన్ని రకాల నిబంధనలూ మినహాయించాలన్న భారత పరిశ్రమల సమాఖ్య సిఫార్సును సత్వరం అమలు పరచాలి.
ఇదీ చదవండి:బడ్డెట్: 'చిన్న పరిశ్రమ'కు ఊతమిచ్చేనా?
ఇదీ చదవండి:చిన్న తరహా పరిశ్రమలకు ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ