పేరుకవి లఘు పరిశ్రమలైనా, దేశంలో సుమారు 12కోట్ల దాకా ఉపాధి అవకాశాలు కల్పించగల సామర్థ్యం వాటి సొంతం. అసలే ఆర్థిక మాంద్యంతో కుంగిపోయి ఉన్న చిన్న పరిశ్రమల పాలిట కరోనా సంక్షోభం పిడుగుపాటులా పరిణమించిందన్నది చేదు నిజం. లాక్‌డౌన్లతో లావాదేవీలు అడుగంటి అతలాకుతలమైన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు కేంద్రప్రభుత్వ ‘ఆత్మ నిర్భర్ ప్యాకేజీ’పై కొండంత ఆశ పెట్టుకున్నాయి. ప్రత్యేకించి సర్కారీ పూచీకత్తుపై 45లక్షల యూనిట్లకు గొప్ప మేలు చేయగలదంటూ మూడు లక్షల కోట్ల రూపాయల అదనపు రుణ వితరణ పథకం ప్రకటించిన మూడు నెలల తరవాతా, వాటి తలరాత మారనే లేదు. రుణ లభ్యత సంక్షోభం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను వెన్నాడుతూనే ఉందని నిరుడు ధ్రువీకరించిన రిజర్వ్‌బ్యాంక్ తాజాగా క్రోడీకరించిన గణాంకాల్లోనూ చిన్న సంస్థల దుస్థితి ప్రస్ఫుటమవుతోంది.
లాక్‌డౌన్ల దరిమిలా, గత ఏడాదితో పోలిస్తే వాటికి రుణ వితరణ 17శాతం మేర తెగ్గోసుకుపోయింది! అధికశాతం లఘు పరిశ్రమల్ని నిర్వహణ నిధులకు కొరత, పాత అప్పులపై పేరుకుపోతున్న వడ్డీ భారం, ముడిసరకులకు నిపుణ కార్మికులకు కొరత ముప్పేట చెండుకు తింటున్నాయి. ఈ విపత్కాలంలో నామమాత్రం వడ్డీరేటుపై కనీసం పదేళ్లపాటు చెల్లింపుల బాదరబందీ లేకుండా కేంద్రం ఉదార యోజన ప్రకటించి చురుగ్గా అమలుపరచి ఉంటే, ఈసరికే వాటిలో చాలావరకు తెరిపిన పడేవి. వాస్తవంలో చిన్న సంస్థలనుంచి బ్యాంకులు 9-14శాతం వరకు వడ్డీరేటును ముక్కుపిండి వసూలు చేస్తున్నాయన్న కథనాలు వెలువడ్డాయి. వాటికి, రుణ వితరణలో కుంగుదలపై రిజర్వ్‌బ్యాంక్ నిజనిర్ధారణకు సమశ్రుతి కుదురుతోంది. దేశార్థికానికి పెద్ద ఆసరా కాగల చిన్న సంస్థల్ని గట్టెక్కించాల్సిన దశలో, భరించశక్యం కాని వడ్డీరేటును షరతుల్ని వాటినెత్తిన రుద్దడం- ప్యాకేజీ వెనక చిత్తశుద్ధినే ప్రశ్నార్థకం చేస్తోంది!