తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నిపుణ వనరులే ప్రగతి దీపాలు - భారత విద్యారంగంలో సంస్కరణలు

దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలు మాత్రమే సరిపోవు, విద్యా సంస్కరణలూ కీలకం. ప్రపంచంలో అమెరికా తరవాత ఎక్కువ మంది ఆంగ్లం మాట్లాడేది భారతదేశంలోనే. వీరి సంఖ్య బ్రిటన్‌ జనాభా కన్నా ఎక్కువ. అయినా, ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్‌ తీసికట్టుగా ఉంది. స్వాతంత్య్రం అనంతరం మన ఉన్నత విద్య ప్రపంచ ప్రమాణాలకు దీటుగా (lack of skill development in india) ఎదగకపోవడమే దీనికి కారణం. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన విద్యను అందించాలి.

education standards in india
భారత్​లో విద్యా ప్రమాణాలు

By

Published : Nov 7, 2021, 7:51 AM IST

పారిశ్రామిక ప్రగతికి, జీవన నాణ్యత మెరుగుదలకు మేలిమి మానవ వనరులు అవసరం. అటువంటి నిపుణ సిబ్బందిని అందించడం ద్వారా దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశ రూపాంతరానికి నవీకరణ సాధకులుగా, నవ సృజనలకర్తలుగా, నాయకులుగా, జాతి నిర్మాతలుగా ఎదిగే సత్తాను చిన్న వయసు నుంచే సమకూర్చడానికి విద్యావ్యవస్థే పునాది వేస్తుంది. అటువంటి ఉత్తమ వ్యవస్థను నెలకొల్పడానికి భారత్‌లో ప్రయత్నాలు జరిగినా, ఆశించిన స్థాయిలో మార్పులు సాధ్యం కాలేదు. ముఖ్యంగా సాంకేతిక విద్య పలు లోపాలతో (lack of skill development in india) సతమతమవుతోంది.

ర్యాంకుల్లో వెనకబాటు

భారతీయ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏటా పట్టభద్రులవుతున్న సుమారు 15 లక్షల విద్యార్థులలో అత్యధికులకు ఉద్యోగార్హ ప్రమాణాలు కొరవడుతున్నాయి. ఈమధ్య పలు కళాశాలల్లో ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ కావడం లేదు. గత ఏడాది కొత్త కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులు, ఉన్నత ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో దేశీయ ఇంజినీరింగ్‌ కళాశాలలు విఫలమవుతున్నాయి. అందుకే ప్రతిష్ఠాత్మక ర్యాంకింగ్‌లలో చోటు సంపాదించలేకపోతున్నాయి. క్యూఎస్‌(కాకరెల్లి సైమండ్స్‌) వరల్డ్‌ అనే ర్యాంకింగ్‌ సంస్థ ఏటా అగ్రగామి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల జాబితాను ప్రచురిస్తుంది. ఈ ఏడాది వెలువరించిన (world top universities 2021) జాబితాలో 1300 విశిష్ట విశ్వవిద్యాలయాలు చోటుచేసుకున్నాయి. వాటిలో అన్నింటికన్నా పైనున్న 100 వర్సిటీల్లో కనీసం ఒక్క భారతీయ విశ్వవిద్యాలయమూ లేదు. తదుపరి 200 వర్సిటీల్లో మూడు మాత్రమే భారతదేశానికి చెందినవి. అంతకుముందు సంవత్సర ర్యాంకింగ్‌లలోను మొదటి వంద అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒక్క భారతీయ విశ్వవిద్యాలయమూ కనిపించలేదు. ఈ ఏడాది 117వ ర్యాంకులో ఐఐటీ-బాంబే, 185వ స్థానంలో ఐఐటీ-దిల్లీ నిలిచాయి. బెంగళూరు ఐఐఎస్‌సీ 186వ ర్యాంకు సాధించింది.

భారతదేశ జనాభాలో బాలలు, యువతీయువకుల సంఖ్య మరే దేశంలోకన్నా అత్యధికం. అయిదేళ్ల నుంచి 24 ఏళ్ల వయస్కుల సంఖ్య దాదాపు 50 కోట్లు. వారందరికీ ప్రాథమిక దశ నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు ఎంత మేలైన విద్యను అందిస్తే, దేశం అంత అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది. దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలు మాత్రమే సరిపోవు, విద్యా సంస్కరణలూ కీలకమే. స్వాతంత్య్రం వచ్చాక, మరీ ముఖ్యంగా గడచిన 50 ఏళ్లలో అనేక కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. 2020-21లో ఏఐసీటీఈ ఆమోదముద్రతో మొత్తం 9,700 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అవి అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ప్రపంచంలో అమెరికా తరవాత ఎక్కువ మంది ఆంగ్లం మాట్లాడేది భారతదేశంలోనే. వీరి సంఖ్య బ్రిటన్‌ జనాభా కన్నా ఎక్కువ. అయినా, ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్‌ తీసికట్టుగా ఉంది. స్వాతంత్య్రం అనంతరం మన ఉన్నత విద్య ప్రపంచ ప్రమాణాలకు (lack of skill development in india) దీటుగా ఎదగకపోవడమే దీనికి కారణం. పూర్వం భారత్‌లోని నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసానికి ఇతర దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారని గుర్తుంచుకుంటే, నాటి ప్రమాణాలు నేడు లేవని అవగతమవుతుంది. జీడీపీలో ఆరు శాతాన్ని విద్యకు కేటాయించాలని జాతీయ విద్యా విధానాలు ప్రతిపాదించినా, 2019-20లో కేటాయింపులు 3.1 శాతమేనని ఆర్థిక సర్వే తెలుపుతోంది. అరకొర నిధులతో విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి?

మేలిమి పరిశోధనలు అవసరం

ఉత్తమ ప్రమాణాలు పాటించగల విద్యాసంస్థలకు మాత్రమే యూజీసీ, ఏఐసీటీఈలు అనుమతులివ్వాలి. పూర్తి పారదర్శకత ఉండాలి. క్యూఎస్‌, ఎబెట్‌, ఐఈటీ వంటి అంతర్జాతీయ గుర్తింపు సంస్థలను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించినప్పుడు మాత్రమే భారతీయ విద్యాసంస్థలు ప్రపంచంలో మేటి సంస్థల సరసన సగర్వంగా నిలుస్తాయి. అమెరికా, బ్రిటన్‌ల మాదిరిగా విదేశీ విద్యార్థులను ఆకర్షించగలుగుతాయి. భారత్‌లో బట్టీ చదువులకు ఉన్నంత ప్రాధాన్యం, సృజనాత్మక బోధనాభ్యసనాలకు లభించడంలేదు. ఇక్కడ వాసికన్నా రాశికే ఎక్కువ విలువ. ఈ పరిస్థితి తక్షణం మారాలి. మన ఇంజినీరింగ్‌ విద్యాలయాలు కేవలం బోధనతోనే సరిపెట్టుకోకుండా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలతో అనుసంధానం కావాలి. నేడు మన విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థల్లో ఉన్నత స్థాయి పరిశోధనలు జరగకపోవడానికి ఇది ఒక ముఖ్యకారణం. భారతీయ ఆచార్యులు ఎన్ని పరిశోధన పత్రాలు ప్రచురించామనే దానికన్నా ఎంత మేలైన, నాణ్యమైన పరిశోధనలు చేశామనేదానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. అంతర్జాతీయ శాస్త్రసాంకేతిక పత్రికల్లో ప్రచురణార్హమైన స్థాయి పరిశోధన పత్రాలను వెలువరించాలి. విద్యార్థుల్లో నవకల్పనలు సాధించాలనే తపనను, వ్యవస్థాపకులుగా ఎదిగే సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంపొందించాలి. సమాజంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను కనిపెట్టగలిగేవారే కొత్త పరిశ్రమలు, వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. కొవిడ్‌ కాలంలో చదువులు ఇంటి నుంచి సాగాయి. మారిన కాలానికి అనుగుణంగా విద్యను డిజిటలీకరించాలి. అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి. పాఠ్యప్రణాళికలను ఆధునికం చేయాలి. పరీక్షల విధానాన్ని సంస్కరించాలి. ఇవాళ సాంకేతిక విద్యాసంస్థలు ఏమి బోధిస్తున్నాయన్నది రేపు దేశార్థికాన్ని ప్రభావితం చేస్తుందన్నది అందరూ గుర్తుంచుకోవాలి.

సమూల సంస్కరణలతోనే సాధ్యం

నేడు ప్రపంచం వాతావరణ మార్పులతో సతమతమవుతోంది. అదే సమయంలో అంతరిక్ష యానంలో పెద్ద పెద్ద అంగలు వేస్తూ ముందుకెళ్తోంది. కుజుడు, చంద్రుడి మీద స్థిరావాసానికి మానవాళి ఉవ్విళ్లూరుతోంది. రకరకాల కొత్త సాంకేతికతలు వేగంగా రంగప్రవేశం చేస్తున్నాయి. రేపటి ప్రపంచాన్ని రూపాంతరం చెందించే ఆయా రంగాల్లో అమెరికా, ఐరోపా, దక్షిణ కొరియా, జపాన్‌, చైనాలు పరస్పరం పోటీపడుతున్నాయి. భారత్‌ కేవలం పోటీలో ఉండటం కాదు, అగ్రగామిగా నిలవాలి. అందుకోసం మన విద్యావిధానాన్ని సమూలంగా సంస్కరించాలి. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అంతర్జాతీయ ప్రమాణాలకు (international standards in education) దీటైన విద్యను అందించాలి.

కేటాయింపులు పెరగాలి

ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఇండియా ధ్యేయంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని 2030-32నాటికి అందుకోవాలని భావిస్తోంది. అప్పటికి భారత్‌ 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితేనే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతుంది. సహజ వనరుల ఎగుమతితో ఈ లక్ష్యం నెరవేరదు. బలీయ విద్యావ్యవస్థ పునాదిపై అధునాతన విజ్ఞానాధారిత సమాజాన్ని నిర్మించడం ద్వారానే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుంది. అందుకోసం విద్యపై మన కేటాయింపులు పెరగాలి. జీడీపీలో ఆరు శాతాన్ని విద్యపై వెచ్చించాలని 1968 నుంచి సిఫార్సులు వస్తున్నా, 2019-20నాటికి కూడా ఈ కేటాయింపు 3.1 శాతం దగ్గరే నిలిచిపోయింది! స్వాతంత్య్రం అనంతరం భారతీయ విద్యావ్యవస్థ ఎన్నో మైలురాళ్లను అధిగమించినా, 21వ శతాబ్దిలో విజేతగా నిలవాలంటే మరింతగా కృషి జరపాలి. మరిన్ని నిధులు వెచ్చించాలి.

-డా. కే. బాలాజీ రెడ్డి

ఇదీ చదవండి:''రివర్స్​ గేర్'​లో మోదీ అభివృద్ధి వాహనం'

'వెళ్లి చరిత్ర పుస్తకాలు చదవండి'

ABOUT THE AUTHOR

...view details