పోటీ ప్రపంచంలో నిపుణశక్తే అతిపెద్ద బలమన్న భావనతో- విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకంటూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)తో ఒప్పందం కుదుర్చుకోవడం స్వాగతించదగింది. తనవంతుగా కర్ణాటక నాలుగు రోజులక్రితమే 'అమృత్ శిక్షణ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటివి నైపుణ్య శిక్షణలో క్రియాశీలత కనబరుస్తున్నా- జాతీయ స్థాయిలో ప్రకటనల హోరుకు దీటైన కార్యాచరణ కొరవడటం నిరాశపరుస్తోంది.
నేటికీ నీరోడుతున్నాయి..
సమీప భవిష్యత్తులో సంభవించే పరిణామాలు, పరివర్తనల దృష్ట్యా 'రేపటి కోసం సన్నద్ధత'ను ప్రధాని మోదీ ఇటీవల ప్రస్తావించారు. ప్రపంచంలో ఏ మూలనైనా సుశిక్షిత యువత అవసరమైన పక్షంలో ఇక్కడినుంచే పంపించేలా ప్రణాళికలు పదును తేలాలని ఆయన అభిలషించారు! లోగడ నైపుణ్య భారత్, కౌశల్ వికాస్ యోజన పథకాల పరిపూర్తికి పిలుపిస్తూ శ్రామికశక్తికి నైపుణ్యాల నగిషీపై వల్లెవేసిన సమున్నత సంకల్ప ప్రకటనలెన్నో నేటికీ నీరోడుతున్నాయి. అత్యవసర ప్రాతిపదికన సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా- మున్ముందు 900 రకాల వృత్తి వ్యాపకాలకు నిర్దిష్ట నైపుణ్యాలు అత్యావశ్యకమన్న ఉద్ఘాటనల వల్ల ఒరిగేదేముంటుంది?
తొమ్మిదేళ్ల నిర్బంధ విద్యావిధానంలో ఆఖరి మూడు సంవత్సరాలూ వృత్తివిద్యా బోధన సాగిస్తున్న చైనాలో వృత్తినిపుణుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణ కొరియా 96 శాతం, జర్మనీ 75 శాతం, యూకే 68 శాతందాకా యువతను నిపుణ శ్రామికులుగా తీర్చిదిద్దుతుండగా- ఆ సంఖ్య అయిదు శాతంలోపే ఉన్న భారత్, నైపుణ్య శిక్షణను గాడిన పెట్టేందుకు చేయాల్సింది ఎంతో ఉంది!
లెక్కలు నిజమేనా?
యువజనంలో ప్రపంచశ్రేణి నైపుణ్యాలను పెంపొందించే నిమిత్తం జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థనొకదాన్ని నెలకొల్పి, దాన్ని కదం తొక్కిస్తామని పదమూడేళ్లక్రితం యూపీఏ సర్కారు ఘనంగా చాటింది. శాస్త్రీయ అంచనాల జోలికి పోకుండా హడావుడిగా పట్టాలకు ఎక్కించిన పర్యవసానంగా, వృత్తి శిక్షణలో పెరుగుదల నామమాత్రమేనని అప్పట్లో నిగ్గుతేలింది. ఆ విధానం స్థానే 2015లో మోదీ ప్రభుత్వం ఆవిష్కరించిన పాలసీ 2022 సంవత్సరం నాటికి 40కోట్లమందిని నిపుణులుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. 'కౌశల్ వికాస్ యోజన' కింద అయిదేళ్లలో సుమారు కోటీ ఏడు లక్షలమందికే శిక్షణ సమకూరిందన్న గణాంక వివరాలు ఆరేడు నెలల కిందట కలకలం రేకెత్తించాయి. వివిధ పథకాల కింద 2.35కోట్ల మందికి శిక్షణ సమకూర్చినట్లు కేంద్రం లెక్క చెబుతున్నా- కొలువుల్లో కుదురుకున్నవారి సంఖ్య అందులో పదోవంతైనా లేదని విశ్లేషణాత్మక కథనాలు చాటుతున్నాయి.
వ్యవస్థాగత వైఫల్యమే..
కొన్నిదేశాల్లో 2020నాటికి అయిదు కోట్ల 70 లక్షల మేర శ్రామికశక్తికి కొరత ఏర్పడనుందని, గ్రామీణ భారతం నుంచే ఆ మేరకు మెరికల్ని రూపొందించి పంపగలమంటూ ఆరంభించిన కౌశల్ యోజన ఏ దశలోనూ అంచనాలకు దీటుగా రాణించలేకపోవడం వ్యవస్థాగత వైఫల్యమే. నేడు డిగ్రీలకన్నా నైపుణ్యాలు మిన్న అనే వాతావరణం నెలకొంది. పోనుపోను కృత్రిమ మేధ, బ్లాక్ చెయిన్, సైబర్ భద్రత, డేటా ఎనలిటిక్స్ తదితర విభాగాల్లో ఎన్నెన్నో అవకాశాలు విప్పారనున్నాయంటున్న తరుణంలో- అందుకు తగ్గట్లు ప్రాథమిక స్థాయినుంచీ పాఠ్యప్రణాళికల్ని సాకల్యంగా ప్రక్షాళించాలి.
వృత్తిపరమైన బాధ్యతలకు తగ్గ మెలకువల అభ్యసనంతో విద్యార్థుల్ని భవితకోసం సన్నద్ధపరచే జర్మనీ, నార్వే, ఫిన్లాండ్ తరహా బోధన పద్ధతులు, ఆ మేరకు సిబ్బందికి నిరంతర శిక్షణలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. ఇన్నేళ్ల ఫలితాల్ని సాకల్యంగా పునస్సమీక్షించాలి. విద్యారంగాన సమగ్ర సంస్కరణలు, యువత సహజ ప్రతిభను వెలికితీసేలా బోధన సిబ్బందికి శాస్త్రీయ శిక్షణ సాకారమైతేనే- నిపుణ వనరుల విశ్వరాజధానిగా మున్ముందు ఇండియా రాణించగలిగేది!
ఇదీ చూడండి:Job Skills: జాబ్ కొట్టాలంటే.. ఇవి ఉండాల్సిందే..!
ఇదీ చూడండి:'యువతలో నైపుణ్యాభివృద్ధి దేశానికి అవసరం'