తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!

ఈ ఏడాది సకాలంలో వర్షాలు ఆరంభమైనా, రైతాంగాన్ని ఆందోళన పట్టి కుదుపుతోంది. ఏటేటా అకాల వర్షాలు పొలాల్లో అనూహ్య సంక్షోభం సృష్టిస్తుండగా, రుతుపవనాల ప్రభావంతో కురిసే వానలూ సాగుదారుల్ని కుంగదీస్తున్నాయి. ఆరేడు సంవత్సరాలక్రితం ఏటా 18-25 వేల టన్నుల మేర తిండిగింజల్ని దేశం నష్టపోయేదని, కొన్నాళ్లుగా పరిస్థితి కొంత మెరుగుపడినా ఇప్పటికీ రూ.7,000 కోట్ల దాకా వార్షిక వృథా కొనసాగుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Situation of farmers due to heavy rain and lack of facilities
రైతు కష్టం నేలపాలు!

By

Published : Jun 13, 2020, 7:32 AM IST

సాధారణంగా, వ్యవసాయదారుల నిఘంటువులో- వర్షం అంటే హర్షం. తొలకరికి పులకరించిపోతూ కొండంత ఆశతో దుక్కిదున్ని సేద్య పనులు మొదలుపెట్టింది లగాయతు పంటసిరులు చేతికందేవరకు- సకాలంలో వానలు కురిస్తే... ఏ రైతుకైనా గొప్ప సంబరం! ఈ ఏడాది సకాలంలో వర్షాలు ఆరంభమైనా, రైతాంగాన్ని ఆందోళన పట్టి కుదుపుతోంది. దురదృష్టవశాత్తు- ఏటేటా అకాల వర్షాలు పొలాల్లో అనూహ్య సంక్షోభం సృష్టిస్తుండగా, రుతుపవనాల ప్రభావంతో కురిసే వానలూ సాగుదారుల్ని కుంగదీస్తున్నాయి. గత అక్టోబర్‌, నవంబర్‌ నాటి కుండపోత తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల ఎకరాల్లో పంటను నాశనం చేసింది. మూడు నెలలక్రితం కుంభవృష్టి హరియాణా, రాజస్థాన్‌, పంజాబ్‌, యూపీ వంటి చోట్ల భారీ నష్టం వాటిల్లజేసింది. ఏప్రిల్‌లో ఈదురు గాలులు, వడగండ్ల వానలకు చేతికి అందివచ్చిన పంట పొలంలోనే రాలిపోయిందని ఎందరో రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాల ఆవరణలో ధాన్యం తడిసిపోయే ఘటనలు ఏటికేడాది పునరావృతమవుతున్నాయి. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో పేర్చిన ధాన్యం బస్తాలు తడిసిపోయి మొలకలు వచ్చిన ఘటన, తేమశాతం తగ్గితే కొనుగోలు చేస్తారన్న ఆశతో నిత్యం ఎండబెడుతూ సాయంత్రానికి కుప్పలు పోస్తున్నా మోక్షం దక్కక కడకు జోరువాన ముంచేసిన ఉదంతాలు- రైతుల దుర్భరావస్థకు తాజా నిదర్శనాలు. శ్రమకోర్చి పండించిన పంటను కొనుగోళ్లు ముగిసేదాకా భద్రపరచడానికి కనీస ఏర్పాట్లూ కొరవడటం, కర్షకుల్ని హతాశుల్ని చేస్తోంది. అత్యవసరంగా కప్పడానికి టార్పాలిన్లు, నిల్వ ఉంచడానికి తగినన్ని కేంద్రాలు లేకుండా పోవడం దేశవ్యాప్తంగా అనేకానేక రైతు కుటుంబాల్లో అపార విషాదం రగిలిస్తోంది. కరోనా వైరస్‌ మూలాన దాపురించిన ఆర్థిక అల్లకల్లోలానికి ఆహార సంక్షోభం జతపడకుండా కాచుకునే క్రమంలో- తొలుత ఇటువంటి కంతలన్నింటినీ వడివడిగా పూడ్చాలి!

జాతికి తిండి పెట్టడానికి నిరంతరం స్వేదం చిందిస్తున్న సాగుదారులు దేశానికే గర్వకారణమంటూ- వారు తమ పంట ఉత్పత్తుల్ని భారత్‌లో ఎక్కడైనా ఎవరికైనా విక్రయించుకోగల స్వేచ్ఛను ప్రసాదిస్తున్నట్లు కేంద్రం ఇటీవల ఘనంగా ప్రకటించింది. దేశీయంగా కర్షకుల్లో 82శాతం వరకు సన్న, చిన్నకారు రైతులే. ఆరుగాలం కృషి సల్పి వారు పంటలు పండించగలరేగాని- గిట్టుబాటు లభించేంతవరకు సరకును భద్రపరచగల వెసులుబాటు ఎక్కడుంది? వ్యక్తిస్థాయిలోనే కాదు, వ్యవస్థాగతంగానూ నిల్వ వసతులకు కొరత వెక్కిరిస్తోంది. ఆరేడు సంవత్సరాలక్రితం ఏటా 18-25వేల టన్నుల మేర తిండిగింజల్ని దేశం నష్టపోయేదని, కొన్నాళ్లుగా పరిస్థితి కొంత మెరుగుపడినా ఇప్పటికీ రూ.7,000కోట్లదాకా వార్షిక వృథా కొనసాగుతున్నదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సేకరించిన మొత్తంలో 10శాతం అలా వ్యర్థమవుతుండగా- పనలమీద, కొనుగోళ్లకు నిరీక్షిస్తూ రైతులు నష్టపోతున్నదెంతో సరైన లెక్కలు లేవు. సర్కారీ స్థలాలుంటే మండలాల్లోనూ గోదాముల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండునెలలక్రితం సుముఖత వ్యక్తపరచారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు లక్ష కల్లాలు ఏర్పరచాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సరికొత్తగా సిఫార్సు చేసింది. దేశమంతటా పంట సేకరణ క్రతువు పూర్తయ్యేదాకా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసికట్టుగా రైతాంగానికి బాసటగా నిలవాలి. సీజన్లవారీగా దేశం నలుమూలలా రైతన్నల అవసరాలేమిటో ఎప్పటికప్పుడు మదింపు వేసి తోడ్పాటు సమకూర్చడంతోపాటు, 'ఆత్మనిర్భర్' ప్యాకేజీలో ఇచ్చిన హామీ ప్రకారం- మౌలిక సదుపాయాల పరికల్పననూ వేగవంతం చేయాలి. అందుకు తగ్గ ఉమ్మడి కార్యాచరణే- రైతు కష్టం నేలపాలై, యావత్‌ దేశమే నష్టపోయి కుమిలే దుస్థితిని నివారించగలుగుతుంది!

ABOUT THE AUTHOR

...view details